పెరుగు, నిమ్మరసంతో..
చుండ్రు సమస్యను తగ్గించడంలో పెరుగు, నిమ్మరసం పాత్ర కూడా కీలకమే. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. ఆపై ఆ మిశ్రమంలో పెరుగు వేస్తూ పేస్ట్ అయ్యేంత వరకు ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారం లేదా పదిహేను రోజులకోసారి పాటించడం వల్ల క్రమంగా చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
మందారంతో..
మందార ఆకులు, పువ్వులలో ఉండే గుణాలు జుట్టు సమస్యల్ని తగ్గించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో ఎండబెట్టి పొడి చేసిన మందార ఆకులు, పువ్వుల పొడిని కొద్దిగా వేసి, ఈ మిశ్రమానికి కాస్త ఉసిరి పొడి, మెంతుల పొడి కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ మృదువైన పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. అలాగే ఈ హెయిర్‌ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలోనూ దోహదం చేస్తుంది.
మెంతులతో..
జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వీటిని కొన్ని హెయిర్ ప్యాక్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. చుండ్రును తగ్గించడానికి తయారుచేసుకొనే ప్యాక్‌లలో భాగంగా కూడా మెంతుల్ని వాడతారు. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగుతో పాటు ఒక్కో టేబుల్‌స్పూన్ చొప్పున ఆలివ్ నూనె, వెనిగర్, మెంతిపొడి.. వీటన్నింటినీ బాగా కలుపుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకొని రెండుమూడు గంటల పాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే బయటపడే అవకాశం ఉంటుంది.
కోడిగుడ్డు ప్యాక్..
గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణనందించడంలో ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదు.. ఇది చుండ్రును తొలగించడానికీ ఉపయోగపడుతుంది. మూడు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, టేబుల్‌స్పూన్ ఆలివ్ నూనె, రెండు టేబుల్‌స్పూన్ల బాగా బీట్ చేసిన గుడ్డు తెల్లసొన.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లో తీసుకొని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే క్రమంగా చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.