యుక్తవయసులోకి అడుగుపెట్టిన తర్వాత శరీరంలోని హార్మోన్ల స్థాయుల్లో మార్పులు చోటుచేసుకోవడం తదనుగుణంగా శారీరకంగా, మానసికంగా కూడా పలు మార్పులు కనిపించే విషయం తెలిసిందే. ఈ దశలో అమ్మాయిలు ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు.
పచ్చని ప్రకృతిలో..
రోజూ ఎంత తీరికలేకుండా గడిపినా కాసేపైనా పచ్చని ప్రకృతితో తప్పకుండా మమేకం కావాలట! దీనివల్ల మనసు తేలికపడడంతోపాటు సృజనాత్మకంగా ఆలోచించడం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనులు చేసుకోవడం బాగా అలవడుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఉదయం లేదా సాయంత్రం వేళ కాసేపు వాకింగ్ చేయడం, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా పార్కుల్లో విహరించడం, ఇంటి పనుల్లో భాగంగా గార్డెనింగ్‌కు సంబంధించిన పనుల్లో భాగస్వాములు కావడం.. వంటివి చేయాలని వారు సూచిస్తున్నారు.
అవి వద్దు..
ప్రస్తుతం అంతా ఇన్‌స్టంట్ ఫుడ్స్, డ్రింక్స్‌తోనే గడిపేస్తున్నారు. మీరూ అంతేనా.. అయితే వెంటనే వాటికి బై చెప్పేయండి. శరీర ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలను అందిస్తేనే సరైన ఎత్తు, ఎత్తుకు తగిన శరీర సౌష్ఠవం లభిస్తాయి. కాబట్టి తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు.. మొదలైనవాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా శీతలపానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, డైట్ సోడా.. మొదలైనవాటన్నింటికీ స్వస్తి పలకాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవించడానికి ఒక హెల్దీ మార్గం ఏర్పరుచుకున్నట్లు అవుతుంది. అలాగే తినే ఆహారపదార్థాలు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే తయారుచేసినవైతే మరీ ఉత్తమం.
చక్కెర తక్కువగా..
ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకున్నా అందులో చక్కెర స్థాయులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా రక్తంలోని చక్కెరస్థాయులు క్రమంగా ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
వ్యాయామం తప్పనిసరి..
రోజూ ఉదయాన్నే కాసేపు ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. ఫలితంగా శరీరంలో పేరుకుపోయిన అదనపు కెలొరీలు కరగడంతోపాటు కండరాలు దృఢంగా మారడం వల్ల ఫిట్‌గా కూడా ఉండచ్చు. అలాగే హార్మోన్లు సైతం సమతూకంలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.