తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఫిట్‌నెస్‌ కోసం ఈత.. ఇప్పుడు ప్రపంచ రికార్డు

చురకత్తుల్లా దూసుకొచ్చే అలల్ని వెనక్కి నెడుతూ, ప్రమాదకరమైన జలచరాల బారి నుంచి తప్పించుకుంటూ అంతులేని సముద్రంలో ఈత కొట్టడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందుకు ఎంతో తెగువ, పట్టుదల కావాలి. ఆ రెండూ తనలో ఉన్నాయని నిరూపించింది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 47 ఏళ్ల శ్యామల గోలి. అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే పాక్‌ జలసంధిని తాజాగా ఈది సరికొత్త చరిత్రకు తెరలేపిందామె. భారత్‌-శ్రీలంకల్ని కలిపే ఈ 30 కిలోమీటర్ల నీటి వారధిని కేవలం 13 గంటల్లోనే ఛేదించిందామె. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోనే రెండో మహిళగా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అంతేకాదు.. శ్యామల తన 47 ఏళ్ల వయసులో ఈ సాహసానికి పూనుకోవడం మరో విశేషం! ఈ మహిళా స్విమ్మర్‌ తన గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

By

Published : Mar 21, 2021, 5:15 PM IST

goli shyamala Swimming for fitness now she was world record
ఫిట్‌నెస్‌ కోసం ఈత.. ఇప్పుడు ప్రపంచ రికార్డు

ఎవరి ప్రోత్సాహం లేకుండా మనకు నచ్చిన దారిలో నడవడమంటే సవాలే! నేనూ ఇదే దారిని ఎంచుకున్నా. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా అన్నీ తట్టుకుంటూ ముందుకు సాగా. ఇలా నా జీవిత ప్రయాణం మొదలైంది ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని సామర్ల కోటలో. అక్కడే పుట్టి పెరిగిన నాకు చిన్నతనం నుంచి బొమ్మలు గీయడమంటే ఆసక్తి ఉండేది. కానీ నాన్నేమో నేను ఐఏఎస్‌ను కావాలని కలలు కన్నారు. దీంతో తనకు ఇష్టం లేకపోయినా పీజీ పూర్తయ్యాక ఐఏఎస్‌ కోచింగ్‌లో చేరాను. అయినా నా మనసంతా బొమ్మల పైనే ఉండేది. అర్ధరాత్రి దాటినా బొమ్మలు గీస్తూనే ఉండేదాన్ని. అయితే ఇలా సివిల్స్‌కి ప్రిపేరయ్యే సమయంలోనే మంచి సంబంధం రావడంతో నాకు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత మా వారి ఉద్యోగరీత్యా గుజరాత్‌ వెళ్లిపోయాం.

ఆయన ప్రోత్సాహంతో..!

చిత్రకళలు, ఫొటోషాప్‌, యానిమేషన్‌ పట్ల నాకున్న ఆసక్తిని గమనించిన మా వారు మోహన్‌ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. దీంతో యానిమేషన్‌ కోర్సు నేర్చుకొని చిన్న చిన్న కథలను యానిమేషన్‌ చిత్రాలుగా మలచడం మొదలుపెట్టా. ఈ క్రమంలో కొన్ని సినిమాలు కూడా రూపొందించా. వాటిలో కొన్ని సక్సెసయ్యాయి.. మరికొన్ని నష్టాల్ని మిగిల్చాయి. అయినా వెనకడుగు వేయలేదు. ఇలా నేను రూపొందించిన ‘లిటిల్‌ డ్రాగన్‌’ అనే యానిమేషన్‌ చిత్ర టీజర్‌ను ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ యానిమేషన్‌ సినిమా ప్రదర్శన మిప్‌కామ్‌లో ఆవిష్కరించా. ఈ అవకాశం నాకెంతో ప్రతిష్ఠాత్మకమైనది. అంతేకాదు.. ఓ యానిమేషన్‌ కంపెనీలో ప్రొడ్యూసర్‌గా, రచయిత్రిగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశా. అయితే కొన్ని అనారోగ్యాల కారణంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొని తిరిగి ఫిట్‌గా మారాలంటే ఈత నేర్చుకోమని నా స్నేహితులు నాకు సలహా ఇచ్చారు. అలా 2016లో ఈత నా జీవితంలో ఓ భాగమైంది.

ఫిట్‌నెస్‌ కోసం ఈత.. ఇప్పుడు ప్రపంచ రికార్డు

అలా ఈతే నా కెరీరైంది!

ఏదైనా నేర్చుకోవాలి అని నా మనసులో బలంగా అనుకుంటే దాన్ని వెంటనే ఒంటబట్టించుకోవడం నాకు చిన్నతనం నుంచే అలవాటు. ఈత సాధన చేసే విషయంలోనూ ఇదే జరిగింది. ముందుగా బ్రెస్ట్‌ స్ట్రోక్‌తో మొదలుపెట్టి ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌ దాకా ప్రతి మెలకువా నేర్చుకున్నా. ఈ క్రమంలో గచ్చిబౌలి స్టేడియంలో కోచ్‌ పర్యవేక్షణలో రోజూ ఐదు గంటల పాటు స్విమ్మింగ్‌ సాధన చేసేదాన్ని. ఇలా నా జీవితంలో అంతర్భాగమైన ఈతను కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకించారు.. కానీ మా వారు మాత్రం నా వెన్నంటే నిలిచారు. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొని పతకాలు కూడా గెలిచాను. ఇక 2019లో కృష్ణా నదిలో 1.5 కిలోమీటర్ల దూరాన్ని అరగంటలో ఈదిన నేను.. అదే ఏడాది పాట్నా వేదికగా జరిగిన మరో ఈత పోటీల్లో పాల్గొన్నాను. ఇందులో భాగంగా గంగానదిలో 13 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 50 నిమిషాల్లో పూర్తిచేశాను. ఈ పోటీల్లో పాల్గొన్న 40 మందిలో నాకు ఆరో స్థానం దక్కింది.

ఆ ఐదు మైళ్లు కష్టమనిపించింది!

ఇక ఇప్పుడు పాక్‌ జలసంధిని ఈదే అరుదైన అవకాశం నాకు దక్కింది. నిజానికి ఇది నేను గతేడాదే పూర్తి చేయాల్సింది. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయా. ఈ ఫీట్‌లో భాగంగా మార్చి 19 న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరం నుంచి బయల్దేరిన నేను ఆ రోజు సాయంత్రం 5.58 గంటల కల్లా తమిళనాడు రామేశ్వరంలోని ధనుష్కోటి తీరానికి చేరుకున్నా. ఇందుకు నాకు 13 గంటల 43 నిమిషాలు పట్టింది. చాలా వరకు నా ప్రయాణం సాఫీగానే సాగింది.. కానీ ఆఖరి ఐదు మైళ్లు మాత్రం అలల తాకిడి ఎక్కువగా ఉండడతో చాలా క్లిష్టంగా అనిపించింది. అందుకే ఈ ఫీట్‌ పూర్తి చేయడానికి నాకు 90 నిమిషాలు అదనపు సమయం పట్టింది. దీంతో పాక్‌ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోనే రెండో మహిళగా గుర్తింపు పొందడం చెప్పలేనంత సంతోషంగా ఉంది.

మూడు గంటల సాధన

ఇందుకు నా కోచ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ త్రివేదికి (గతంలో ఆయనకు కూడా పాక్‌ జలసంధిని ఈదిన అనుభవం ఉంది) రుణపడి ఉంటా. ఆయనే నన్ను ఈ సాహసం కోసం సన్నద్ధం చేశారు. ఈ క్రమంలో రోజూ ఉదయం 3 గంటలకు నిద్ర లేచి, ఇంట్లో వాళ్లకి బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసి.. గచ్చిబౌలి స్టేడియంకి వెళ్లేదాన్ని. అక్కడ సుమారు మూడు గంటల పాటు స్విమ్మింగ్‌ సాధన చేసేదాన్ని. ఎలాగైతేనేం.. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది.. చాలా సంతోషంగా ఉంది.

ప్రస్తుతం ఇటు ఈతపై దృష్టి సారిస్తూనే.. అటు హైదరాబాద్‌లో ఓ ప్లే స్కూల్‌ నిర్వహిస్తున్నా. నాకు ఇంజినీరింగ్‌ చదివే కొడుకున్నాడు. ఇక, ఆఖరుగా ఒక్కమాట.. మనం ఏదైనా సాధించాలని మనసులో అనుకుంటే అది కచ్చితంగా చేసి తీరతాం.. మహిళలుగా మనం అంత సమర్థులం.. నా సక్సెస్‌తో నేను నిరూపించాలనుకుంది ఇదే!

ఇదీ చూడండి :'కుటుంబంలో ఏ వేడుక జరిగినా మొక్కలు నాటాలి'

ABOUT THE AUTHOR

...view details