‘అబ్బా.. మళ్లీ మర్చిపోయాను..’ ‘అరెరె... ఇందాక కూడా అనుకున్నా!’
ఇంట్లో ఆడవాళ్ల నుంచి వచ్చే మాటలే ఇవి. సమయంతో పోటీపడుతూ పనులు పూర్తి చేసేటపుడు ఇలాంటివి సహజమే. కానీ.. తరచూ జరుగుతోంటే? జాగ్రత్త పడాల్సిందే. అందుకు ఈ చిట్కాలను పాటించండి.
చాలాసార్లు... తప్పక గుర్తుంటుందనుకున్నదీ మర్చిపోతుంటాం. ఇలాంటప్పుడు పని/ విషయం చిన్నదైనా, పెద్దదైనా ఒకచోట రాసిపెట్టుకోవాలి. గుర్తుందా మంచిదే. లేదంటే ఈ జాబితా గుర్తు చేస్తుంది. రాసినది మెదడులో ముద్రలా పడుతుంది. ఇదీ లాభమే.
* సరిగా నిద్రలేకపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగినులైతే పనివేళల తర్వాత విశ్రాంతి కోసం టీవీల్లోనో, మొబైల్స్‌లోనో వీడియోలు చూడటం పరిపాటి. కానీ ఇది అంత మంచి అలవాటు కాదంటున్నారు. అందులోనూ నిద్రపోయే ముందు వీడియోలు చూడటం మెదడుపై ప్రభావం చూపుతుంది. దానివల్ల గాఢనిద్ర ఉండదు.