కరోనా సమయంలో తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, ఇతర వస్తువులను శానిటైజ్ చేయడం అలవాటుగా మారింది. రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులను శానిటైజ్ చేయడం అంటే పెద్ద పనే. మేకప్ బాక్స్‌ని సులభంగా క్లీన్ చేయవచ్చు. మరి అందులో ఉండే పౌడర్, క్రీమ్, మేకప్ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్ చేయవచ్చు అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
పౌడర్ ఉత్పత్తులు ఇలా..!
మనం ఉపయోగించే మేకప్ ఉత్పత్తుల్లో పౌడర్ తరహావి చాలానే ఉంటాయి. ప్రెస్‌డ్ పౌడర్స్, బ్లషెస్, ఐ షాడోస్, పౌడర్ ఫౌండేషన్స్.. ఇలాంటి వాటిని ఎలా శానిటైజ్ చేయాలో చాలామందికి తెలియదు. అయితే ఇందుకోసం 70 శాతం ఆల్కహాల్ ఉన్న క్రిమి సంహారకాలను ఉపయోగించాలని చెబుతోంది వ్యాధి నియంత్రణ, నివారణ మండలి (సీడీసీ). ఇవి వైరస్‌ను నాశనం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయంటోందా సంస్థ. వీటితో పౌడర్ తరహా బ్యూటీ ఉత్పత్తుల్ని శానిటైజ్ చేసే క్రమంలో.. 9 వంతుల ఈ ఆల్కహాల్ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోయాలి.. దీనికి ఒక వంతు డిస్టిల్డ్ వాటర్‌ని జతచేసి బాగా షేక్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పౌడర్ ప్యాలట్‌పై స్ప్రే చేయాలి. పూర్తిగా ఆరేంత వరకు ప్యాలట్‌ను అలాగే తెరచి ఉంచాలి.
మేకప్ బ్రష్‌లు
మేకప్ ఉత్పత్తుల్నే కాదు.. మేకప్ బ్రష్‌లను తరచూ శుభ్రం చేయడం ఉత్తమం. ఎందుకంటే పదే పదే వాటినే వాడడం వల్ల అందులో ఉండే మేకప్ అవశేషాల వల్ల చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అలాగే మేకప్ వేసుకున్న తర్వాత ఆ బ్రష్‌లను అలాగే వదిలేయడం వల్ల వాటిపై దుమ్ము-ధూళి, ఇతర వైరస్, బ్యాక్టీరియాలు చేరతాయి. తద్వారా అందానికే కాదు.. ఆరోగ్యానికీ ప్రమాదమే. కాబట్టి ఈ కరోనా సమయంలోనే అని కాకుండా తరచూ మేకప్ బ్రష్‌లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం తయారుచేసుకున్న ఆల్కహాల్ మిశ్రమాన్ని బ్రష్ బ్రిజిల్స్, బ్రష్ హ్యాండిల్‌పై స్ప్రే చేసి కాటన్ ప్యాడ్‌తో తుడిచేయాలి. లేదంటే ఆల్కహాల్‌తో కూడిన బ్రష్ క్లీనర్స్ మార్కెట్లో లభిస్తాయి. మేకప్ బ్రష్‌లను శానిటైజ్ చేయడానికి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. మనం తలస్నానం చేయడానికి ఉపయోగించే గాఢత తక్కువగా ఉండే షాంపూలతో సైతం మేకప్ బ్రష్‌లను శుభ్రం చేసుకోవచ్చు.
లిక్విడ్ ఫౌండేషన్
మేకప్ వేసుకోవడంలో భాగంగా మనం ఉపయోగించే లిక్విడ్ తరహా ఉత్పత్తుల్ని శానిటైజ్ చేయడమంటే కాస్త కష్టమనే చెప్పాలి. అలాగని ఆల్కహాల్ మిశ్రమాన్ని ఆ లిక్విడ్‌లో పోయలేం. కాబట్టి ఇందుకోసం ఇందాక మనం తయారుచేసి పెట్టుకున్న ఆల్కహాల్ మిశ్రమాన్ని ఒక కాటన్ ప్యాడ్‌పై వేసుకొని లిక్విడ్ ఫౌండేషన్ బాటిల్ లేదా ఫౌండేషన్ ట్యూబ్‌పై తుడవాలి. అలాగే దాని మూత తీసి ఫౌండేషన్ బయటికి వచ్చే రంధ్రం దగ్గర కూడా శుభ్రం చేయాలి. ఇలా లిక్విడ్, జెల్ తరహా మేకప్ ఉత్పత్తులను శుభ్రం చేయచ్చు.. కానీ వాటిలో ఉండే మిశ్రమాన్ని శానిటైజ్ చేయలేం కాబట్టి వాటిని ఉపయోగించే ముందు మీ ముఖాన్ని, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు.