షుగర్ స్క్రబ్‌తో ఇన్‌స్టంట్ గ్లో!
చర్మంపై ఏర్పడిన మృతకణాల్ని, దుమ్ము-ధూళి వంటి వాటిని తొలగించుకోవడానికి తరచూ స్క్రబ్ చేసుకోవడం మనకు అలవాటే. అయితే ఇందుకోసం బయట పార్లర్స్‌కి వెళ్లడం కంటే ఇంట్లోనే సహజసిద్ధమైన బాడీ స్క్రబ్స్‌ని తయారుచేసుకోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు కొలంబియా మగువలు. ఈ క్రమంలోనే చక్కెరలో కాస్త కొబ్బరి నూనె కలుపుకొని ముఖం, మెడ, చేతులు, కాళ్లు, పెదాలు.. తదితర భాగాల్లో ఈ మిశ్రమంతో స్క్రబ్ చేసుకుంటారు. ఇలా ఈ మిశ్రమంతో గుండ్రంగా, మృదువుగా రాసుకొనే క్రమంలో చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోవడంతో పాటు దుమ్ము, ధూళి.. వంటివి కూడా బయటికి వెళ్లిపోతాయి. తద్వారా చర్మం లోలోపలి నుంచి తక్షణ మెరుపును సంతరించుకుంటుంది. అలాగే స్క్రబ్ చేసిన భాగాల్లో మరింత మృదువుగా మారుతుంది.
కాఫీతో ఆ కొవ్వు కరుగుతుంది!
కొలంబియాను కాఫీ గింజలకు కేరాఫ్ అడ్రస్‌గా పేర్కొంటారు. అక్కడ ఎక్కువ మొత్తంలో పండించిన కాఫీని ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే కాదు.. వారూ తమ సహజసిద్ధమైన సౌందర్య సాధనాల్లో ఒకటిగా ఉపయోగిస్తుంటారు. సాధారణంగా చర్మం కింద కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. ఫలితంగా అందం క్రమంగా తగ్గిపోయే అవకాశముంటుంది. మరి, దాన్ని కరిగించుకోవడానికి కొలంబియా మగువలు కాఫీ స్పా ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటారు. ఈ క్రమంలో బరకగా ఉండే కాఫీ పొడితో ముఖాన్ని, శరీరాన్ని నెమ్మదిగా, మృదువుగా మర్దన చేసుకుంటుంటారు. తద్వారా చర్మం కింద పేరుకొన్న కొవ్వు కరిగిపోయి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా చర్మం తాజాగా మారుతుంది. అంతేకాదు.. ఈ పద్ధతి వల్ల చర్మంపై ఉండే మృతకణాలు కూడా తొలగిపోతాయి.
అందానికి అడవి గులాబీ!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై గీతలు, ముడతలు సహజం. అలా కాకుండా చర్మాన్ని ఎప్పుడూ నవయవ్వనంగా ఉంచుకోవడంలో అందరికంటే తామే ముందున్నామంటున్నారు కొలంబియా అతివలు. ఇందుకోసం అడవి గులాబీ గింజల నుంచి సేకరించిన నూనెను వారు తమ సౌందర్య పోషణకు ఉపయోగిస్తుంటారు. దాన్ని అక్కడ 'రోజా మాస్క్వెటా ఆయిల్'గా పిలుస్తారు. ఇందులో అధికంగా ఉండే 'ఎ', 'సి', 'ఇ' విటమిన్లు కొత్త చర్మ కణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. తద్వారా ఎప్పటికీ చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.
ఆ మట్టిలో దాగున్న అందం!
మనం ఎంత శుభ్రం చేసుకున్నా చర్మ కణాల్లోకి దుమ్ము-ధూళి వంటివి చేరి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడం సహజం. అందుకే ఆ మలినాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించడం మంచిది. అందుకోసం కొలంబియా మగువలు పాటించే పద్ధతి 'వోల్కానిక్ క్లే డీటాక్సిఫికేషన్'.. అంటే అగ్నిపర్వతపు మట్టితో చర్మంలో చేరిన మలినాల్ని తొలగించడమన్నమాట! ఈ క్రమంలోనే ఈ మట్టిని నీటిలో కలుపుకొని చర్మానికి పూతలా వేసుకొని.. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తద్వారా ఓలివిన్, పైరాక్సిన్, బయోటైట్.. వంటి ఖనిజాలు చర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేయడంతో పాటు చర్మానికి పోషణనందిస్తాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా, నవయవ్వనంగా కనిపిస్తుంది.
కలబందతో సన్‌బర్న్‌కి చెక్!
కాలమేదైనా ఎండ వల్ల చర్మం కమిలిపోవడం సహజం. మరి, అలా జరగకుండా ఉండేందుకు మనం వివిధ రకాల సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకుంటాం. కానీ కొలంబియా మగువలు ఈ సమస్య దరిచేరకుండా ముందుగానే జాగ్రత్తపడతారు. అదెలా అనుకుంటున్నారా? కలబందతో! కలబంద నుంచి సేకరించిన గుజ్జును వారు ముఖం, మెడ, చర్మంపై రాసుకుంటారు. కాసేపటి తర్వాత కడిగేసుకుంటుంటారు. బయటికి వెళ్లడానికి ముందే ఈ పద్ధతిని పాటిస్తుంటారు. తద్వారా ఎండ తీవ్రత చర్మంపై ప్రతికూల ప్రభావం చూపకుండా కలబంద రక్షిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ-ఏజింగ్ గుణాలు చర్మంపై ముడతలు, గీతలు లేకుండా చర్మాన్ని ఎప్పుడూ నవయవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
పట్టులాంటి జుట్టుకు అవకాడో!
జుట్టు రాలడం, చుండ్రు.. వంటి జుట్టు సమస్యలకు చెక్ పెట్టి కేశాల్ని పట్టుకుచ్చులా మెరిపించుకోవడానికి చాలామంది చేసే పని వివిధ రకాల హెయిర్‌మాస్కులు వేసుకోవడం. అయితే ఇంట్లో కాకుండా కొందరు ఇందుకోసం పార్లర్స్‌కి వెళ్తుంటారు. అక్కడ చేసే హెయిర్ ట్రీట్‌మెంట్స్ కారణంగా జుట్టు సహజమైన అందాన్ని కోల్పోతుంది. అందుకే జుట్టు సంరక్షణంతా ఇంట్లోనే చేసుకుంటుంటారు కొలంబియా మగువలు. ఇందుకోసం వారు ఉపయోగించే అతి ముఖ్యమైన పదార్థం అవకాడో. ఒక అవకాడో గుజ్జులో ఒక అరటి పండు, టేబుల్‌స్పూన్ ఆలివ్ నూనె వేసి.. ఈ మూడింటినీ మాస్క్‌లా మెత్తగా చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ పద్ధతి జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. అలాగే కేశాలను పట్టులా మెరిపిస్తుంది కూడా!
సింపుల్ హోమ్ రెమెడీస్‌తో సింప్లీ సూపర్బ్ అనిపించేంత అందాన్ని తమ సొంతం చేసుకున్న కొలంబియా మగువల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకున్నారుగా! మరి, మీరూ వాటిని ఫాలో అయిపోయి సౌందర్య రాశిలా మెరిసిపోతారు కదూ!!