తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

HAIR LOSS PROBLEMS: నా జుట్టు పలచగా ఉంది... ఒత్తుగా పెరిగేదెలా.? - home remedies to strengthen hair

అందంపై అమ్మాయిలకు మక్కువ ఎక్కువ. ఆ అందాన్ని కాపాడుకోవడానికి అనేక చిట్కాలు పాటిస్తుంటారు. ముఖారవిందం ఒక ఎత్తైతే.. అతివల అందాన్ని మరింత ఇనుమడింప చేసేది వారి దృఢమైన, ఒత్తైన కురులే. కానీ ఉరుకుల పరుగుల జీవితం, కాలుష్యంతో రోజురోజుకీ మగువల జట్టు ఊడిపోవడమే కాక బలహీనంగానూ తయారవుతోంది. అదే సమస్యతో ఉన్న ఓ సోదరికి.. ఆకర్షణీయమైన కురుల కోసం ఈ సలహా..

home remedies to strengthen hair
ఒత్తైన జుట్టు కోసం ఇంటి చిట్కాలు

By

Published : Sep 11, 2021, 11:52 AM IST

మేడమ్‌.. నాకు జుట్టు పొడవుగా లేకపోయినా ఒత్తుగా ఉంటే చాలు. కానీ నా జుట్టు చాలా పలచగా ఉంది. ఏం చేయాలి?

జ.మన శరీరంలో ఐరన్‌ తక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా లభించే తోటకూర, బీట్‌రూట్‌, క్యారట్‌, బెల్లం.. వంటివి భాగం చేసుకోండి. అలాగే మీరు తరచూ పెట్టుకునే హెన్నాలో గుడ్డులోని తెల్లసొనని జత చేయండి. ఒకవేళ మీకు గుడ్డు వాసన వచ్చినా పర్లేదనుకుంటే పూర్తి గుడ్డుని (తెల్లసొన + పచ్చసొన) కూడా కలుపుకోవచ్చు. గుడ్డులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇలా గుడ్డుని హెన్నాలో భాగం చేసుకోవడం వల్ల జుట్టుకు ప్రొటీన్లు అందుతాయి. తద్వారా కురులు దృఢంగా మారతాయి.

అయితే కొంతమంది మార్కెట్‌లో దొరికే హెన్నా ఉత్పత్తుల్ని వాడడానికి సంశయిస్తుంటారు. అలాంటి వారు ఇంటి దగ్గరే హెన్నాని తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..

హెన్నా కోసం ముందుగా.. గోరింటాకు పొడి, మెంతి పొడి, మందార పూరేకల పొడి.. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకొని ఒక డబ్బాలో భద్రపరచుకోండి. మీరు హెన్నా పెట్టుకోవాలనుకున్న ముందు రోజు రాత్రి ఒక కప్పు పొడిని ఇనుప పాత్రలోకి తీసుకోండి. దానిలో సరిపడినన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా కలుపుకోండి. మరునాడు ఉదయం హెన్నా పెట్టుకునే అరగంట ముందు.. ఒక కప్పు పెరుగు, ఒక గుడ్డుని ఈ మిశ్రమానికి జత చేయండి. ఆపై దీన్ని జుట్టుకి పట్టించి అరగంట పాటు అలాగే ఉంచిన తర్వాత చన్నీళ్లతో తలస్నానం చేయండి. మరుసటి రోజు షాంపూతో రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే కొద్దిరోజుల్లోనే చక్కటి ఫలితాన్ని పొందుతారు.

ఈ మూడు నూనెలతో

దీంతోపాటు మీకు సమయం ఉంటే ఒక కప్పు కొబ్బరి నూనె, అర కప్పు ఆలివ్‌ ఆయిల్‌, అర కప్పు ఆముదం నూనెని కలుపుకొని పెట్టుకోండి. ఈ నూనెను వారానికి రెండు నుంచి మూడు సార్లు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా పట్టిస్తే కేశాలు ఒత్తుగా మారడంతో పాటు పొడవుగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

ఇదీ చదవండి:మన బొజ్జ గణపయ్యకు ఏమి ఇష్టమో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details