విత్తనాలు చల్లించాలి:
తోటపనంటే చిన్నారుల్లో మొదటున్న ఉత్సాహం తరువాత కనిపించదు. కారణం మనం చేస్తుంటే వాళ్లు చూస్తుండటమే. అలాకాకుండా వారినీ భాగస్వాముల్ని చేయాలి. మెంతులు, ధనియాలు, ఆవాలు లాంటివాటిని తొట్టెల్లో వారితో చల్లించాలి. కుండీల్లో మట్టిని నింపే పనికూడా చేయించాలి. అలా విత్తనాలు వేసిన ఎన్ని రోజులకు మొలకలు వస్తాయో వివరించి వాటి బాధ్యత వారిదేనని చెప్పాలి. నీళ్లు చల్లడం లాంటి పనులు అప్పజెప్పాలి. దాంతోరోజూ ఉదయం వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఆకుకూరల నుంచీ మనకు అందే పోషకాలను చెబుతుంటే, వాటి పోషణను వాళ్లు శ్రద్ధగా చేస్తారు.
కానుకగా:
పిల్లలకు ఎలాంటి పూలమొక్కలంటే ఇష్టమో తెలుసుకుని వాటినే కానుకగా అందించాలి. దాంతో ఆ మొక్కను ప్రేమగా పెంచడమే కాకుండా, పూలు పూసేవరకు శ్రద్ధగా పెంచడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో వారు ఫోన్, టీవీలకు దూరంగా ఉంటారు.
కష్టం తెలిసేలా:
పచ్చదనం పర్యావరణాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుతుందో చెప్పాలి. వారు పెంచిన ఆకుకూరలు, కూరగాయలను వారికిచ్చే అల్పాహారంలో వేసి చూపించాలి. వీటిలోని పోషకవిలువలే కాదు, కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండుతున్నాయో, ఎంతమంది కష్టపడితే అవి మార్కెట్లోకి వస్తున్నాయో వంటి అంశాలు తోటపని ద్వారా తెలుసుకుంటారు.
ఇదీ చూడండిచైనాకు చెక్: లద్దాఖ్కు కొత్త రోడ్డు మార్గం