ప్రపంచవ్యాప్తంగా ఈమధ్య టీనేజీ పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం వాళ్లు నిద్రపోయే సమయం బాగా తగ్గిపోవడమే అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నిపుణులు. శారీరక, మానసిక ఆరోగ్యానికీ రోగనిరోధకశక్తి పెరగడానికీ నిద్ర అందరికీ అవసరమే. కానీ టీనేజర్లకు మరీ అవసరం. శారీరక, మానసిక ఎదుగుదలకు వాళ్లకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేదంటే వాళ్లు సామాజికంగా ఎదురయ్యే ఒత్తిడినీ తోటి విద్యార్థుల కామెంట్లనీ కూడా తట్టుకోలేక ఆందోళనకీ మానసిక కుంగుబాటుకీ లోనవుతున్నట్లు పరిశీలనలో స్పష్టమైంది.
టీనేజీలో నిద్ర అత్యవసరం.. లేకపోతే ప్రమాదం! - తెలంగాణ వార్తలు
ఇటీవల కాలంలో టీనేజీ పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి అంటున్నారు నిపుణులు. అందుకు వివిధ రకాల కారణాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వయసులో ఎక్కువ నిద్ర అవసరం అని అంటున్నారు. టీనేజీ పిల్లలు ఎంతసేపు నిద్రపోవాలి? మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలో చూద్దాం రండి.
నిద్రలేమివల్ల మత్తుమందులు, మద్యపానం, ధూమపానానికీ అలవాటుపడతారనీ చెడు సావాసాలతో హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశమూ లేకపోలేదనీ హెచ్చరిస్తున్నారు. మానసిక సమస్యలేవయినా- ఎక్కువగా పద్నాలుగేళ్ల వయసులోనే మొదలవుతాయనీ చాలావరకూ వాటిని తగ్గించలేకపోతున్నామనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. స్నేహితులతో చాటింగ్, ఆన్‌లైన్ గేమింగ్... వంటి వాటివల్ల నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. ఆయా గాడ్జెట్ల నుంచి వచ్చే నీలికాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ శాతాన్ని తగ్గించడంతో క్రమేణా నిద్రకు దూరమై మానసిక సమస్యల బారినపడుతున్నారనీ కాబట్టి ఆ వయసులో తల్లితండ్రుల కట్టడి చాలా అవసరమనీ హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:'కరోనాపై పోరాటంలో ధైర్యాన్ని కోల్పోవద్దు!'