పిల్లలకు కథలు చెప్పడం నిద్రపుచ్చడానికి మాత్రమే కాదు.. వాళ్లదైన ఊహా లోకంలోకి తీసుకెళ్లి, నిద్రాణంగా ఉండే సృజనాత్మక శక్తిని పెంచడానికి కూడా! కథ చెప్పినప్పుడు.. వారు ఆ కథలోని పాత్రలను ఊహించుకుంటారు. కథలో జరిగే ప్రతి విషయాన్ని వాళ్లు నిజంగా జరుగుతున్నట్లు ఇమాజిన్ చేస్తారు. దీనివల్ల వారిలో సృజన్మాకత పెరుగుతుంది. అలా ఆ కథలో లీనమై.. నిద్రలోకి వెళ్తారు.
ముందు పెద్దలు కొన్ని మంచి కథలు చదవాలి. లేదా చిన్నప్పుడు విన్న కథలనైనా జ్ఞప్తికి తెచ్చుకుని సంక్షిప్తంగా రాసి పెట్టుకోవాలి. చెప్పబోయే కథ సందర్భానికి అనువైనదిగా ఉండాలి. అప్పుడే పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది.
ఇలా మన సాహిత్యం, చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు... ఇతరత్రా సామాజిక అంశాలను వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఇవి వారి మనోవికాసానికి తోడ్పడతాయి.
మొబైళ్లు, టీవీ వంటి గ్యాడ్జెట్లకు పిల్లలు దూరంగా ఉండాలంటే... కథలు చెప్పేందుకు పెద్దలు కొంత సమయం కేటాయించాల్సిందే. ఇవి వారిలో భావోద్వేగాలను వృద్ధి చేస్తాయి అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లలకు వీటి ద్వారా కొత్తకొత్త పదాలు పరిచయం చేయవచ్చు. ఏదైనా పదం వింతగా ధ్వనిస్తే, చిన్నారులు దాని అర్థం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు. తద్వారా వారికి భాషాసంపద అందించినట్టు అవుతుంది.
కథల ద్వారా వినగలిగే సామర్థ్యం కూడా మెరుగువుతుంది. క్లాస్ రూంలో పిల్లలు వినడం కన్నా మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే, వారు మంచి శ్రోతలు కారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కథలు వినడాన్ని గనుక వారికి అలవాటు చేస్తే... విషయ గ్రహణ సామర్థ్యం పెంపొందుతుంది. ఫలితంగా చదువులోనూ ముందుంటారు.