మీ పిల్లల ఊహలకు రెక్కలు తొడగండిలా...!
తమ బంగారు కొండలు.. నలుగురిలో ఒకరిలా కాకుండా... కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరేమో. పిల్లలు అలా ఉండాలంటే చిన్నతనంలోనే వారిలో సృజనాత్మకత వికసించేలా చేయాలి. దాని కోసం మీరేం చేయాలంటే...
మీ పిల్లల ఊహలకు రెక్కలు తొడగండిలా...!
చుక్కలు లేదా అంకెలు కలిపి బొమ్మలు గీయమనీ, రంగులు అద్దమనీ సాధారణంగా పిల్లలకు చెబుతుంటారు కదా. దానికంటే ముందు వాళ్లకో తెల్ల కాగితాన్ని మాత్రమే ఇవ్వండి. దాని మీద వాళ్లకిష్టమైన బొమ్మలను గీయమనండి. ముందుగా పిచ్చి గీతలు గీసినా ఆ తర్వాత మెల్లగా చుట్టుపక్కల ఉన్న వస్తువులను పరిశీలించి వాటిని గీయడం మొదలుపెడతారు. అలాగే తెల్ల కాగితం మీద వాళ్లకిష్టమైన నాలుగు పేర్లు రాయమనండి. ఇలా చేయడంవల్ల వాళ్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది.
- లెగో బ్రిక్స్ ఇచ్చి వివిధ ఆకృతులను రూపొందించమనాలి. అవసరమైతే స్నేహితుల సహాయం తీసుకునేలా చేయండి. దీంతో చిన్నారుల ఊహలు వాస్తవ రూపాన్ని సంతరించుకుంటాయి.
- పిల్లలెప్పుడూ రంగురంగుల బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు కదా. అలాంటి బొమ్మలను వాళ్లే స్వయంగా తయారుచేసేలానూ చేయొచ్చు. కాగితాలను మడిచి వివిధ రకాల వస్తువులు, బొమ్మలు తయారుచేసేలానూ ప్రోత్సహించవచ్చు. అయితే ఈ క్రమంలో కత్తెరలాంటివి ఉపయోగించకుండా చూసుకోవాలి.