ఇంటి పనుల్లో చిన్నారులను భాగస్వాములను చేయాలి. మురికి దుస్తులను బాస్కెట్/వాషింగ్ మెషిన్‌లోనో వేయమనడం, ఉతికిన వాటిని మడతపెట్టడం లాంటివి నేర్పించాలి. దీనివల్ల దుస్తులను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పద్ధతి ప్రకారం నడుచుకుంటారు.
- పిల్లలు రాత్రి త్వరగా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. దాంతో ఉదయం త్వరగా లేవడానికి ఇబ్బంది పడరు. వీలైతే దగ్గర్లో అలారాన్ని పెట్టండి.
- కాగితాలు, మిగిలిన ఆహారం, ఇతర వ్యర్థాలు... ఇంటి గోడ అవతల లేదా రోడ్డు మీద పడేస్తుంటారు కొందరు. అది చూసి పిల్లలూ అలానే చేస్తారు. కాబట్టి మీ చిన్నారులకు చెత్తను చెత్తబుట్టలో వేయడం అలవాటు చేయండి. ఇల్లే కాదు పరిసరాల శుభ్రత బాధ్యత కూడా మనదే అని చెప్పండి.
- చిన్నారి వల్ల పొరపాటు జరిగితే వారిని మందలించకుండా దానికి కారణం తెలుసుకోండి. సమస్య వచ్చినప్పుడు, తప్పు జరిగినప్పుడు కుంగిపోకుండా బయటపడటం, ధైర్యంగా ఉండటం ఎలాగో ఉదాహరణలతో వివరించండి. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- నిద్రపోయే ముందు ఒక్క స్ఫూర్తి కథనైనా చెప్పండి. ఇలా చేస్తే బాధ్యతలతోపాటు ఎలా మసలుకోవాలో నేర్చుకుంటారు.