ముద్దు ముద్దు మాటలతో మురిపించే చిన్నారులు... ఒక్కోసారి అలవోకగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. అందుకు కొన్నిసార్లు కారణాలు ఉండకపోవచ్చు. ఇంకొన్నిసార్లు భయానికి, సరదాకో కూడా చెబుతూ ఉండి ఉండొచ్చు. అవి అలవాటుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
భయాన్ని పోగొట్టండి:
సాధారణంగా పిల్లలు చెప్పే అబద్ధాల్లో భయంతో చెప్పేవే ఎక్కువ ఉంటాయి. తాము చేసిన పొరపాటుని గుర్తిస్తే తిడతారేమోననే ఆందోళనే ఇందుకు కారణం. వీలైనంతరవరకూ వారు చెప్పేది పూర్తిగా విన్నాకే నిర్ణయం తీసుకోండి. చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకొంటే దండించమనే భరోసా ఇవ్వాలి. అప్పుడే వారు నిజం చెప్పడానికి వెనుకాడరు.
సరదాకే చెబుతోంటే...:
పిల్లల తీరుని చిన్నప్పుడే సరిదిద్దాలి. లేదంటే...కొన్నిసార్లు అవి ప్రమాదాలకూ కారణం కావొచ్చు. ఏ సందర్భంలోనైనా భయపడకుండా నిజం చెబితే చిన్నచిన్న బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి నిజం చెప్పడమే అలవాటుగా మారుతుంది. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.
పెద్దలూ మారండి:
చిన్నారులు ఎదురుగా కొందరు తల్లిదండ్రులు మాట మార్చడం, అబద్ధం చెప్పడం... అదే సరైనదని వాదించడం చేస్తుంటారు. దాన్ని పిల్లలూ అనుసరిస్తారు. అందుకు మీరే కారణం అవుతారు. ఈ పరిస్థితి రానివ్వకండి. ఎప్పుడైనా మాట తడబడితే...అది ఎవరికీ హానిచేయనిది, ఇంకొకరికి మేలు చేసేది అయితేనే చెప్పాల్సి వచ్చిందని నిజాయతీగా వారి ముందు ఒప్పుకోండి. వారు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు.
ఇదీ చదవండి:300 రూపాయలతో బయటకొచ్చి...30 కోట్ల టర్నోవర్ చేశా!