మల్లిక(mallika dutt) భర్త మోహిత్ ఉద్యోగ రీత్యా కొన్నాళ్లు లండన్‌లో నివసించింది. అక్కడే ఆమెకు మొదటి పాప మైరా పుట్టింది. స్నేహితుల్లో తనే మొదట అమ్మ అవడంతో పాపాయికి వాడే ఉత్పత్తుల విషయంలో సలహాలిచ్చే వారే లేరు. తనే పరిశోధించుకునేది. తర్వాత వాళ్లు మన దేశానికి వచ్చేశారు. పాపకి అక్కడి ఉత్పత్తులనే కొనసాగించింది. భర్త అడపాదడపా విదేశాలకు వెళ్లివచ్చేటపుడు తెప్పిస్తుండేది. ఆయన పర్యటనలు తగ్గడంతో ఇతరుల ద్వారా తెప్పించడం మొదలుపెట్టింది. ఇదో జంజాటంలా తోచిందామెకు. దేశీయ బ్రాండ్‌లనే ప్రయత్నిద్దాం అనుకుంది.
ఆలోచన వెనుక..
మార్కెట్‌లో బోలెడు ఉత్పాదనలు. సురక్షితమైనవని వాడితే ఆ పాపకి చర్మ సమస్యలు వచ్చాయి. వైద్యుల సలహాతో వాటిని ఆపేసింది. మళ్లీ విదేశాల నుంచి తెప్పించడం ప్రారంభించింది. తర్వాత ఆమెకు ఇంకో పాప పుట్టింది. ఆమెకు పుట్టుకతోనే ఆస్తమా. ఉత్పత్తుల్లో పరిమళాలున్నా, అలర్జీ కలిగించే పదార్థాలున్నా ఆస్తమా తిరగబెట్టేది. మరింత జాగ్రత్త అవసరమై.. సహజ పదార్థాలతో చేసిన వాటిని పరిశోధించింది. ఆ పరిజ్ఞానంతో తనే కొన్ని ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేవాలనుకుంది. ఆ ఆలోచన ఫలితమే ‘ద మామ్స్ కో’.
మల్లిక(mallika dutt) వాళ్ల నాన్న సైనిక అధికారి. ఆయన బదిలీల వల్ల తను దేశంలోని చాలా ప్రదేశాల్లో పెరిగింది. ఇంజినీరింగ్ అయ్యాక ఓ కంప్యూటర్స్ సంస్థలో మేనేజర్‌గా చేసింది. ఏడాది తర్వాత ఉద్యోగం నుంచి విరామం తీసుకుని ఎంబీఏ చేసి, ఐసీఐసీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరింది. పెళ్లి తర్వాతా దాన్ని కొనసాగించింది. ప్రెగ్నెన్సీ, భర్తకు లండన్ వెళ్లే అవకాశం రావడంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పింది. కానీ తన కూతుళ్ల పరిస్థితి వ్యాపారం వైపు అడుగులు వేయించింది.