మీ చిన్నారులను తరచూ పీడ కలలు ఇబ్బంది పెడుతుంటే వారు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారని అర్థం. పిల్లకు తరచూ పీడ కలలు వస్తుంటే మాత్రం జాగ్రత్త వహించాలి. మీ కంటిపాపలను గమనిస్తూ వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ బుడతల భయాలను తెలుసుకుని ధైర్యం నూరిపోయండి. మీరున్నారనే భరోసాను కల్పించండి.
ఆహారంలో మార్పులు...
ఒత్తిడి చిన్నారుల ఆహారంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. స్ట్రెస్ వల్ల పిల్లలు ఆహారం తీసుకునే విధానంలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో సరిగా తినరు లేదా ఎక్కువగా తినేస్తారు. ఈ రెండింటికీ కారణం వారిలోని ఒత్తిడే. ఇలాంటి మార్పేదైనా కనిపిస్తే వారితో మాట్లాడండి. ప్రేమగా విషయం ఏమిటో తెలుసుకోవాలే తప్ప కోప్పడటమో, దండించడమో చేయొద్దు.
దూకుడు..
చిన్నా.రులు ఒత్తిడికి గురవుతున్నప్పుడు తమకు తెలియకుండానే ఇతరులతో సరిగా ప్రవర్తించరు. అకారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. మాట్లాడటం కంటే పోట్లాటకే ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ వారిలో పెరిగిపోతున్న ఒత్తిడి, ఆందోళనకు సూచికలని మీరు గుర్తించాలి. మీరు నచ్చజెప్పినా చిన్నారిలో మార్పు రాకపోతే నిపుణుల సాయం తీసుకోవాలి.
ఏకాగ్రత లోపించడం...
స్కూల్లో టీచర్ ఇచ్చిన పనిని పూర్తిచేయడంలో ఇబ్బందులు పడుతుండటం, ఇతర ఏ పనుల్లో ఆసక్తి చూపించకపోవడం.. ఇవన్నీ స్ట్రెస్‌కు కారణాలే. బాగా చదవమని లేదా ఆడమని ఒత్తిడి చేయడం వల్ల చిన్నారి ఏకాగ్రత దెబ్బతింటోందేమో గమనించండి. ఏదైనా మార్పు కనిపిస్తే తనని కూర్చోబెట్టి విషయం తెలుసుకోండి. తన పనులకు ప్రాధాన్యం ఇస్తూ మీ సాయమందించాలి.
పక్కతడపడం...
చిన్నారిలో ఎప్పుడైతే ఒత్తిడి, అభద్రత ఎక్కువైతాయో ఆసమయంలో వారు వాటిని తట్టుకోలేక పక్క తడిపేస్తారు. అలా చేయడంతో దండనే మార్గంగా ఎంచుకోవద్దు. కేవలం ఒత్తిడే కాదు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా చిన్నారులు పక్క తడపొచ్చు. కాబట్టి ఓసారి వారిని వైద్యులకు చూపించాలి.