తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పిల్లలు అబద్ధం చెబుతున్నారా...? - తెలంగాణ వార్తలు

చిన్నారులు తమ ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తారు. ఒక్కోసారి అలవోకగా అబద్ధాలూ చెబుతారు. భయం, సరదా లేక ఇతర కారణాల వల్ల కావొచ్చు చీటికి మాటికి అబద్ధాలు చెబుతుంటారు. అయితే అదే అలవాటుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

parenting tips, kids tips
పేరెంటింగ్ టిప్స్, పిల్లల కోసం చిట్కాలు

By

Published : Jun 1, 2021, 11:30 AM IST

మాధవి కూతురికి రెండేళ్లు. చీటికి మాటికి అబద్ధాలు చెబుతుంది. ఆ అలవాటు మాన్పించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథానే. తమను రక్షించుకోవడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నించడం చాలామంది పిల్లల్లో కనిపిస్తుంది అంటున్నారు మానసిక వైద్యనిపుణులు. దీన్ని బాల్యం నుంచే మార్చడానికి, నిజం చెప్పేలా చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

  • నీ ఇంటి నుంచే...ఇంట్లో అమ్మానాన్నలు అబద్ధాలు మాట్లాడకూడదని నిబంధన పెట్టుకోవాలి. చిన్నదైనా, పెద్దదైనా అబద్ధం మాత్రం చెప్పకూడదనే రూల్‌ని పెద్దలు పాటిస్తే, క్రమేపీ పిల్లలకూ అలవడుతుంది. పెద్ద వాళ్లు వాళ్లకి రోల్‌ మోడల్‌ అవుతారు. అమ్మ/ నాన్న నిజం చెప్పడం లేదని పిల్లలు గుర్తిస్తే తామూ నేర్చుకుంటారు. అందుకే నిజం చెప్పడం ఇంటినుంచే మొదలవ్వాలి.
  • మృదువుగా... ఏదైనా బొమ్మో, వస్తువో పిల్లల చేతుల్లో విరిగిపోతే కోప్పడకూడదు. అది వారిలో అభద్రతను పెంచుతుంది. ఆ సందర్భం మరోసారి ఎదురైనప్పుడు అమ్మ కొడుతుంది, నాన్న తిడతాడు అనే భయం వారితో అబద్ధం చెప్పిస్తుంది. అందుకే సున్నితంగా మాట్లాడి అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. మరోసారి అలా కాకుండా ఏం చేయాలో చెప్పాలి. ఇది పిల్లలను నిజం చెప్పడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది.
    అబద్ధం వల్ల ఎంత నష్టం కలుగుతుందో పిల్లలకు వివరించాలి. దానివల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి మృదువుగా చెప్పాలి. నిజానికి ఉండే బలం, శక్తి.. అబద్ధానికి ఉండవని ఉదాహరణలు లేదా కథల రూపంలో చెప్పగలగాలి. ఇవన్నీ వారి మెదడులో నిక్షిప్తమవుతాయి. నిజం చెప్పినప్పుడు వారిని ప్రశంసించాలి. క్రమేపీ అది వారికి అలవాటుగా మారుతుంది.
  • తప్పించుకోవడానికి... చదువుకోమంటే కొందరు చిన్నారులు ఒంట్లో బాగోలేదంటారు. తరచూ ఇలా చెబుతుంటే దానికి కారణాలను గుర్తించాలి. సబ్జెక్టు పిల్లలకు నచ్చనిది కావొచ్చు, అర్థం కాకపోవచ్చు... ఆ విషయాన్ని కనిపెట్టగలగాలి. వారితో కూర్చుని దాన్ని వారికి అర్థమయ్యేలా చెబితే చాలు. ఆసక్తి కలిగి, వారే చదువుకుంటారు. అమ్మా నాన్న చెప్పిన పనిని చేయకుండా వెనుకడుగు వేసి, అది తమకు తెలీదంటూ అబద్ధం చెబుతారు. అటువంటప్పుడు పెద్దవాళ్లు కూడా వారితో కలిసి కూర్చుని చేస్తే, ఆ పనిపై చిన్నారులకూ ఆసక్తి పెరుగుతుంది. నెమ్మదిగా అబద్ధం చెప్పడం అనే అలవాటును మానుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details