తనకు చెల్లో, తమ్ముడో వస్తున్నాడని చెబితే... చాలా ఉత్సాహంగా ఉంటారు పిల్లలు. అయితే ఈ అనుబంధాన్ని పాపాయి కడుపులో ఉన్నప్పటి నుంచే అందించండి. వారికి చిన్నప్పటి నుంచే బాధ్యతలు అప్పజెప్పండి. ‘చెల్లికి ఈ డ్రెస్ బాగుంటుందా. ఈ బొమ్మ నచ్చుతుందా’ వంటివి వారిని అడిగి తెలుసుకోండి. వారూ సంతోషిస్తారు.
తమకంటే చిన్నపిల్లలు కాబట్టే జాగ్రత్తగా చూసుకోవాలనీ, తననీ అలానే చూసుకున్నారనే విషయం అర్థమయ్యేలా వారి చిన్నప్పటి ఫోటోలను చూపించండి. పిల్లలు అర్థం చేసుకొని, అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. అందుకే నెమ్మదిగా వాళ్లను చిన్నవాళ్లకు చేరువ చేయండి.