శ్రావణి కుమారుడు అర్జున్‌కు ఏడేళ్లు. ఇంట్లో ఏ ఇండోర్ గేమ్ ఆడినా, వాడిని అందరూ కలిపి గెలిపించాల్సిందే. లేదంటే ఇల్లంతా పీకి పందిరేస్తాడు. ఎప్పుడైనా ఓడిపోతున్నావంటే చాలు, మధ్యలోనే ఆటను వదిలేసి కోపంగా వెళ్లిపోతాడు. ఇలా ఓటమి, గెలుపులకు అతిగా స్పందించడం మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు. రెండింటిలో దేనినైనా స్వీకరించగలిగేలా వారిని సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. లేదంటే ఓటమిని ఒప్పుకోలేని తత్త్వం వారి ఎదుగుదలకే ప్రమాదంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఓటమి నుంచి గెలవాలనే ఆకాంక్ష వారిలో వచ్చేలా పెంచాలని చెబుతున్నారు.
నిరుత్సాహాన్ని దూరం చేయాలి.. ఇంట్లో ఆడే బోర్డు గేమ్ అయినా కావొచ్చు లేదా పాఠశాలలో పోటీ అయినా అవ్వొచ్చు. ఎక్కడైనా ఓటమిని ప్రతికూలంగా తీసుకోకూడదని నేర్పాలి. కొందరు పిల్లలు ఓడిపోయామని తెలిసిన వెంటనే తీవ్ర ఒత్తిడి, నిరుత్సాహానికి గురై, క్రమేపీ దాన్ని కోపంగా మార్చుకుంటారు. అటువంటి సమయంలో వారితో మృదువుగా మాట్లాడాలి. తిరిగి ప్రయత్నించు, తప్పక గెలుస్తావని ఉత్సాహాన్ని నింపాలి. నైపుణ్యాలను పెంచుకోవాలని చెప్పాలి.
నియమాలను.. ఆట నియమాలను చిన్నారులకు ముందుగానే తెలియజేయాలి. ఎలా ఆడితే విజయం సొంతమవుతుందో అవగాహన కలిగించాలి. అది వారిలో నెగ్గడానికి తగిన సామర్థ్యాలు అందేలా చేస్తుంది. గెలుపు కోసం నియమాలను అధిగమించకూడదనే కట్టుబాటునూ నేర్పాలి. బృందంతో కలిసి ఎలా ఆడాలో చెప్పాలి.
ఓటమిని చవిచూసేలా.. కొందరు తమ పిల్లలను ప్రతి విషయంలోనూ గెలిచేలా చేస్తారు. దీనివల్ల తమకు ఎదురు లేదనే ధీమా వచ్చేస్తుంది. విజయాన్ని మాత్రమే అంగీకరించే స్థాయికి చేరుకుంటారు. వీరు జీవితంలో ఓటమి ఎదురైతే కుంగుబాటుకు గురవుతారు. కాబట్టి పిల్లలకు ఓటమి రుచీ తెలియజేయాలి. ఓడినంత మాత్రాన ఒత్తిడికి గురవకూడదని, దాన్నుంచి పాఠాలు నేర్చుకుని విజయ సాధనకు కృషి చేయాలనే ఆలోచన పెంచాలి. ఓడితే విమర్శించకుండా, వారిలోని సామర్థ్యాల్ని చెెప్పి ప్రోత్సహించాలి.
ఆరోగ్యకర పోటీ... చదువు, క్రీడల్లో పోటీ తప్పక ఉండాలి. అయితే అది ఆరోగ్యకరమైనదిగానే ఉండేలా పిల్లలను పెంచాలి. ఇతరులు గెలిస్తే వారిపై కోపోద్రేకాలు, ఈర్ష్య, అసూయలు మంచివి కాదని చెప్పాలి. ఎదుటి వారు విజేతగా నిలవడానికి వారి సామర్థ్యం, వారు చేసిన అభ్యాసం, సాధన వంటి అంశాల దిశగా ఆలోచించడం చిన్నారులకు నేర్పించాలి. వాటిని అనుసరిస్తే విజయం తమకూ సాధ్యపడుతుందనే ఆలోచనావిధానం పిల్లల్లో వస్తే చాలు. వారు గెలుపు, ఓటములను సమానంగా తీసుకునే పరిపక్వతను సాధిస్తారు.