తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చలికాలంలో పిల్లలకు ఏ ఆహారం మంచిది? - What kind of food to give children

వాతావరణంలో వచ్చే మార్పుల్ని మనమే తట్టుకోలేం.. అలాంటిది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులేం తట్టుకుంటారు? ఈ క్రమంలోనే జలుబు, దగ్గు, ఆస్తమాతో పాటు పలు చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఇక వీటికి తోడు ప్రస్తుతం కరోనా వైరస్‌ ముప్పు పొంచి ఉంది. కాబట్టి చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాల్సి ఉంటుంది. అయితే మనకు తెలియకుండానే మనం చిన్నారులకు తినిపించే కొన్ని పదార్థాలు వారి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇవి చలికాలంలో వారి ఆరోగ్యం పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయట! మరి, ఈ సీజన్‌లో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఏయే పదార్థాలకు వారిని దూరంగా ఉంచాలో తెలుసుకుందాం రండి..

foods to give and avoid to kids during winter months
చలికాలంలో పిల్లలకు ఏ ఆహారం మంచిది?

By

Published : Nov 11, 2020, 1:42 PM IST

ఓవైపు చలికాలం, మరోవైపు కరోనా.. ఈ రెండూ ఒకేసారి మనపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చిన్నారుల్ని మరింత జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే ఈ కాలంలో వారిని కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు.

పాలు, పాల పదార్థాలు వద్దు!

ఉదయం లేవగానే పాలు తాగడం చాలామంది పిల్లలకు అలవాటే! అలాగే వెన్న, జున్ను, క్రీమ్‌.. వంటి పాల పదార్థాలు కూడా పిల్లలు ఇష్టంగా తింటుంటారు. అయితే శీతాకాలం ఈ అలవాట్లకు కాస్త బ్రేక్‌ ఇవ్వమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలు, పాల పదార్థాల్లో ఉండే జంతు సంబంధిత కొవ్వులు నోట్లోని లాలాజలం, శ్లేష్మాన్ని గట్టిపడేలా చేస్తాయి. తద్వారా వారికి ఆహారం మింగడంలో ఇబ్బందవడం, ముక్కు దిబ్బడ.. వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక వెన్నను కొన్ని పిండి వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. వీటిని నూనెలో వేయించి తినడం వల్ల ఎక్కువ మొత్తంలో నూనె, కొవ్వులు శరీరంలోకి చేరతాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి శీతాకాలంలో శ్వాస సంబంధిత సమస్యలు తెచ్చి పెట్టే ఇలాంటి ఆహార పదార్థాలను పిల్లలకు అందించకపోవడమే మంచిది.

ఇవి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయ్!

ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలే కానీ తగ్గించుకుంటే ముప్పు శాతం పెరుగుతుంది. అయితే పిల్లలు ఇష్టపడే క్యాండీస్‌, కేక్స్‌, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్‌.. వంటి వాటిలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్యను తగ్గిస్తుంది. ఫలితంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి కేవలం శీతాకాలమనే కాదు.. ఏ కాలంలోనైనా పిల్లలను వీటికి ఎంత దూరంగా ఉంచితే వారి ఆరోగ్యానికి అంత మంచిదన్న విషయం గుర్తు పెట్టుకోండి. అయితే వద్దంటే పిల్లలు అస్సలు వినరు కాబట్టి వారిని సంతృప్తి పరచడానికి ఎప్పుడో ఒకసారి కొనివ్వడం లేదంటే ఇంట్లోనే చేసి పెట్టడం చేయచ్చు.. అంతేకానీ పదే పదే ఇవే తింటానంటే మాత్రం అస్సలు ఒప్పుకోకండి.

అది మంచిదైనా ఇప్పుడు ఇవ్వద్దు!

మయొనైజ్, అవకాడో, వంకాయ, పచ్చళ్లు, ఇతర పులియబెట్టిన ఆహార పదార్థాల్లో హిస్టమైన్‌ అనే రసాయనం అధిక మొత్తంలో ఉంటుంది. సాధారణంగా ఇది అలర్జీలతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. అయితే ఈ రసాయనం ఎక్కువగా ఉండే పదార్థాలను చలికాలంలో పదే పదే తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనివల్ల శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తై గొంతు, శ్వాస సంబంధిత సమస్యలొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయట! కాబట్టి ఇలాంటి పదార్థాలను పిల్లలకు అందించాలనుకుంటే మాత్రం మితంగా, ఎప్పుడో ఒకసారి ఇచ్చేలా ప్లాన్‌ చేసుకోండి.

మాంసాహారం మితంగానే..

ఈ శీతాకాలంలో అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి గొంతు నొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను తెచ్చిపెట్టే మరో పదార్థం మాంసం. చికెన్‌, మటన్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే ప్రొటీనే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన మాంసం, కోడిగుడ్లు అసలే వద్దంటున్నారు. ఒకవేళ పిల్లలకు కచ్చితంగా మాంసం పెట్టాలనుకుంటే ఆర్గానిక్‌ పద్ధతుల్లో పెంచిన కోళ్లు, మేకలు.. వంటి మాంసాహారమైతే మంచిదట! అలాగే చేపలు కూడా పెట్టచ్చు. అయితే ఏ మాంసమైనా బాగా శుభ్రపరచడం, ఎక్కువ సేపు ఉడికించడం మంచిది. అంతేకాదు.. పిల్లలకు వీటిని ఎంత మోతాదులో పెట్టాలన్న విషయం నిపుణుల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఏదైనా మితంగా తింటేనే మంచిది కదా!

ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయ్!

శీతాకాలంలో అటు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇటు శరీరానికి వెచ్చదనాన్నీ అందించే ఆహార పదార్థాలను పిల్లలకు అందించడం చాలా మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. అందుకోసం ఈ పదార్థాలను వారి రోజువారీ ఆహారంలో భాగం చేయమని సలహా ఇస్తున్నారు.

  • జొన్నలు శరీరానికి వెచ్చదనాన్ని అందించడంతో పాటు చలికాలంలో తరచూ ఎదురయ్యే జలుబు నుంచి దూరంగా ఉంచడంలో సహకరిస్తాయి. కాబట్టి పిల్లలకు రోజూ జొన్నరొట్టె పెట్టడం మంచిది. అది కూడా కాస్త నెయ్యి, బెల్లంతో అందిస్తే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యమూ సొంతమవుతాయి.
  • సీజనల్‌ మార్పుల వల్ల వచ్చే ఫ్లూను దూరం చేసుకోవాలంటే విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందే! ఈ క్రమంలో ఉసిరి, నిమ్మకాయ, బత్తాయి .. వంటివి పిల్లలకు అందించచ్చు.
  • ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా చిలగడ దుంపలే దర్శనమిస్తున్నాయి. వీటిలో ఉండే విటమిన్‌ ‘సి’, బీటా కెరోటిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. కాబట్టి వీటిని కాల్చి లేదంటే ఉడికించి పిల్లలకు తినిపించచ్చు.
  • పిల్లలకు సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్‌ ఐటమ్‌ ఉండాల్సిందే! లేదంటే ఆకలి అంటూ మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు బజ్జీలు, పకోడీలు అని కాకుండా వారితో నట్స్‌ తినిపించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలు, వాల్‌నట్స్‌.. వంటివన్నీ కొద్ది మొత్తాల్లో తీసుకొని ఒక గిన్నెలో వేసి వారికి అందించచ్చు.. లేదంటే వీటితో చేసిన లడ్డూలు కూడా సాయంత్రం పూట స్నాక్స్‌ సమయంలో వారికి ఇవ్వచ్చు. ఈ నట్స్‌ శరీరానికి వెచ్చదనాన్ని అందించడంలో సహకరిస్తాయి.
  • పిల్లల కోసం ఏ స్వీట్‌ చేసినా చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తే అటు రుచీ పెరుగుతుంది.. ఆరోగ్యమూ సొంతమవుతుంది. అలాగే దీనివల్ల ఐరన్‌ శాతం పెంచుకోవచ్చు.. శరీరానికి వెచ్చదనాన్నీ అందించచ్చు.
  • ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాలు విటమిన్‌ ‘ఎ’లోనూ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది ఎక్కువగా ఉండే క్యారట్‌, ఆకుకూరలు కూడా పిల్లల రోజువారీ ఆహారంలో భాగం చేయాలి.
  • ఈ చల్లగాలుల్లో పిల్లలు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తోందమ్మా అని అడిగినప్పుడు సూప్స్‌ ఇవ్వచ్చు. ఈ క్రమంలో కాయగూరలు, పప్పులు, మొలకలతో కూడా సూప్స్‌ తయారుచేసి వారికి అందించచ్చు.. ఇవి వారికి రుచించడంతో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి.
  • శీతాకాలంలో పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి పదార్థాలకు వారిని దూరంగా ఉంచాలి.. ఏయే పదార్థాలను వారి మెనూలో చేర్చాలన్న విషయాల గురించి తెలుసుకున్నారుగా! అయితే ఒక వయసుకు వచ్చిన పిల్లలను బతిమాలో, బామాలో వారితో ఈ ఆహార నియమాలు అలవాటు చేయించచ్చు! అదే మరీ చిన్న పిల్లలనుకోండి.. ఇప్పుడు ఇవి పెట్టచ్చో, లేదో అన్న సందేహాలు తలెత్తుతుంటాయి. అలాంటి వారు నిపుణుల సలహా తీసుకోవచ్చు..!
  • ఇదీ చదవండిఃనీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!

ABOUT THE AUTHOR

...view details