సెప్టెంబరు మొదటి వారాన్ని ఏటా జాతీయ పోషకాహార వారంగా జరుపుకొంటాం. చిన్నారుల్లో దీని లోపాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఈ ఏడాది థీమ్‌ని ‘ఫీడింగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ ది స్టార్ట్’గా ప్రకటించింది. చిన్నారుల భవిష్యత్తుని మంచి ఆహారంతో నిర్మించాలనేది దీని ఉద్దేశం. ఆ దిశగా అవగాహన కల్పించే విషయాలే ఇవి..
మనమే చెప్పాలి:పసివాళ్లకు ఏది మంచిదో, ఏది కాదో తెలియదు. చెప్పే బాధ్యత మనదే. పిల్లలు మనం చెప్పింది చేయడం కష్టమే. కానీ అనుసరిస్తారు. అంటే మనమేం తింటే వాళ్లూ అదే తింటారు. కాబట్టి ముందు మనం ఆహారపు అలవాట్లని మార్చుకోవాల్సిందే.
వాళ్లకు నచ్చేలా:సాధారణంగా పిల్లల కళ్లని రంగులు ఆకర్షిస్తాయి. అందుకే మీరు వాళ్లకు పెట్టే ఆహారంలో రంగురంగుల కాయగూరలు, పండ్లకూ ప్రాధాన్యం ఇవ్వండి. ‘రోజూ ఇవేనా’ అనకుండా ఉండాలంటే మీ సృజననంతా ఉపయోగించి వివిధ ఆకృతుల్లో అందించండి. నచ్చని కాయగూరలని స్మూథీల్లా ఇవ్వండి.
ప్రత్యామ్నాయాలు:కేకులు, కుకీలను ఇష్టపడని పిల్లలుండరు. వాటిల్లో మైదా ఎక్కువ. ఇందులో పీచు ఉండదు. ఫలితమే మలబద్ధకం, ఊబకాయం. చురుగ్గా ఉండలేరు. అందుకే బేకింగ్ చేసిన వాటికి నెమ్మదిగా దూరం చేయండి. ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నా పొట్టుతీయని ధాన్యాలతో చేసిన ఓట్స్ పిండి వంటివి దొరుకుతున్నాయి. వాటిని ప్రయత్నించండి. పంచదారకు బదులుగా బెల్లం, ఖర్జూరం, తేనె, అంజీర వంటివి ఎంచుకోండి. ఇవి రక్తహీనత రాకుండా చూస్తాయి.