తెలంగాణ

telangana

కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!

By

Published : Jul 12, 2020, 8:47 AM IST

లాక్​డౌన్​తో పిల్లల్లో ఒంటరితనం పెరిగింది. కరోనా ప్రభావంతో గత నాలుగు నెలలుగా ఇంటిపట్టునే ఉండటంతో చిన్నారుల్లో మానసిక సమస్యలు వస్తున్నాయి. చాలా మంది పిల్లల్లో చదువుపట్ల ఆసక్తీ సన్నగిల్లుతోంది. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటే అంతా తేలిగ్గానే సర్దుకుంటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు.

coronavirus
coronavirus

బడిలేదు.. ఆటపాటల్లేవు.. స్నేహితుల సందడి లేదు. వినోదాలకు, విహారయాత్రలకు బయటకు కదిలే పరిస్థితి లేదు. అంతా నాలుగ్గోడల మధ్యనే.. కుటుంబ సభ్యులతోనే.. కరోనా ప్రభావంతో గత నాలుగు నెలలుగా ఇంటిపట్టునే ఉన్న చిన్నారుల పరిస్థితి ఇది. వారు తమ ఎదుగుదలకు, మానసిక వికాసానికి దోహదం చేసే బాహ్యప్రపంచంతో క్రమంగా సంబంధాలు కోల్పోయారు. అలాంటి పిల్లల్లో చాలామంది పిల్లలు సరిగా తిండితినకపోవటం, నిద్రకు దూరం కావటం, తరచూ కోపం, విసుగు అసహనానికి గురికావటం, కుంగుబాటుకు లోనుకావటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సన్నగిల్లుతోన్న ఆసక్తి

చాలా మందిలో పిల్లల్లో చదువుపట్ల ఆసక్తీ సన్నగిల్లుతోంది. లాక్‌డౌన్‌-1లో తల్లిదండ్రులిద్దరూ పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పూర్తికాలం పిల్లల్ని కనిపెట్టుకుని ఉండటం సాధ్యమైంది. ఆ తర్వాత వారంతా వృత్తివ్యాపారాలకు బయటకు వెళ్లిపోవడంతో పిల్లల్లో మానసికంగా ఒంటరితనం అధికమైంది. ఇదే సమస్యకు అసలు మూలమని నిపుణులు ‘ఈనాడు’తో చెప్పారు. తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటే అంతా తేలిగ్గానే సర్దుకుంటుందని అభిప్రాయపడ్డారు.

అర్థమయ్యేలా వివరించాలి

చిన్నారులు ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న అనుభవాలను చూసి ‘ఇక అంతా అయిపోయింది’ అన్న ఆందోళనకు లోనవుతున్నారు. దాంతోపాటు తల్లిదండ్రులు కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని, అది కలిగించిన నష్టాలను పిల్లల ఎదురుగానే తరచూ చర్చిస్తున్నారు. సహజంగానే ఇది పిల్లల్లో భయాన్ని పెంచుతోంది. తాము ఎప్పుడు బయటకు వెళ్లవచ్చు? స్నేహితులను ఎప్పుడు కలవచ్చు లాంటి ప్రశ్నలు తరచూ వేస్తున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని విసుక్కోకుండా అర్థమయ్యే తీరులో వారికి వాస్తవ పరిస్థితులను వివరించాలి.

గాడ్జెట్స్‌ వినియోగాన్ని గమనించాలి

పిల్లల్లో అపరిమితమైన శక్తిసామర్థ్యాలుంటాయి. సహజంగా ఆ వయసులో వారిలో ఉండే చురుకుదనం (హైపర్‌ యాక్టివిటీ) ప్రస్తుతం వారు బయటకు వెళ్లకపోవటం వల్ల ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. ఒంటరి ప్రపంచంలో మగ్గవలసి రావటంతో తరచూ భావోద్వేగాలకు గురవుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వారిని చెడగొడుతున్నాయి. చిన్నారులు తమకు అందుబాటులోకొచ్చిన గాడ్జెట్స్‌ను ఎలా వినియోగిస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలకు సమయాన్ని కేటాయించాలి. ఆన్‌లైన్‌ చదువులు ‘యాక్టివిటీ’ రూపంలో ఉంటే మంచిదే. పిల్లల్లో ఆసక్తి ఉంటుంది.

సానపెడితే బహుముఖ ప్రజ్ఞావంతులే

పది పన్నెండేళ్ల లోపు పిల్లలు వేగంగా ఆలోచించగలుగుతారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయటం, బొమ్మలు వేయటం, సృజనాత్మక రచన.. ఇలా ఎన్నో ... తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎందులో ప్రవేశం ఉందో గుర్తించి వారిని ప్రోత్సహించాలి. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ మాధ్యమాలను ఉపయోగించుకుని పిల్లల కృషిని నలుగురికీ తెలియజేయాలి. వారి నుంచి వచ్చే అభినందనలు తెలియకుండానే పిల్లల్లో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగచేస్తాయి. ఆన్‌లైన్‌ క్లాసులు.. వారి దృష్టిని చదువుపైకి మళ్లించటానికి ఉపయోగపడతాయి. విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో సంభాషించగలుగుతారు. కొద్దిగా సానపెడితే పిల్లలు బహుముఖ ప్రజ్ఞావంతులుగా రూపుదిద్దుకోటానికిది సరైన తరుణం.

- డాక్టర్‌ దేవికారాణి కాకరాల, సైకాలజిస్ట్‌

ఇంటి పనులు నేర్పాలి

మాంటిస్సోరీ విధానంలో ఇంట్లోనే చిన్నారుల చేత చేయించగల దాదాపు 30 వరకూ చిన్నచిన్న పనులున్నాయి. ఇవి మూడు నాలుగేళ్ల పిల్లల్ని పనిలో నిమగ్నమయ్యేలా చేస్తాయి. రకరకాల రూపాల్లో కాగితాలను కత్తిరించటం; పక్షులు, జంతువుల రూపంలో మడవటం; బంకమట్టి లేదా గోధుమ, మైదా పిండితో బొమ్మలు తయారు చేయమని పిల్లలకు చెప్పవచ్చు. వీటితో పాటు కథలు చెప్పటం, పద్యాలు పాడటం లాంటివి అభ్యాసం చేయించవచ్చు. ఇంటిపనుల్లో సాయం చేయటం లాంటివి నేర్పితే వారికి అలవాటవుతుంది.

- వాసిరెడ్డి అమరనాథ్‌, స్టూడెంట్‌ కౌన్సెలర్‌, ట్రైనర్‌

ABOUT THE AUTHOR

...view details