వ్యాక్సిన్ వచ్చినా కరోనాకు అంతం ఎప్పుడనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అలాగని పనులన్నీ ఎన్నాళ్లని వాయిదా వేసుకొని ఇంట్లోనే కూర్చుంటాం? పిల్లలు కూడా ఎన్నాళ్లు స్కూలుకెళ్లకుండా ఇంటికే పరిమితమవుతారు? అందుకే కరోనాతో సహజీవనం చేయక తప్పదంటూ అందరూ తమ తమ విధుల్లో ఇప్పటికే మళ్లీ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో స్కూల్స్ కూడా తరగతుల వారీగా తెరచుకుంటున్నాయి. మొన్నటికి మొన్న 9, 10 తరగతులతో పాటు కాలేజీలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు 6, 7, 8 తరగతులు కూడా మొదలయ్యాయి. తల్లిదండ్రుల అనుమతితో పిల్లలు తిరిగి పాఠశాలకు రావచ్చంటూ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే మనకు కొవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి తరుణంలో స్కూలుకెళ్లే పిల్లలు వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.
ఈ కనీస జాగ్రత్తలు తప్పనిసరి!
* వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఇన్నాళ్లూ ఇంట్లో ఎలాగైతే చేతులు శుభ్రంగా కడుక్కున్నారో.. స్కూల్లో కూడా చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పాలి. ఇందుకోసం ఇంటి నుంచే ఓ బాటిల్‌లో హ్యాండ్‌వాష్ తీసుకెళ్లడం మంచిది. లేదంటే స్కూల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్‌వాష్ పిల్లలంతా ఉపయోగిస్తారు కాబట్టి వైరస్ విస్తరించే ప్రమాదం ఎక్కువ. అలాగే మీ చిన్నారులు తీసుకెళ్లిన హ్యాండ్‌వాష్ కూడా ఇతర పిల్లలకు ఇవ్వకుండా ముందే ఓ మాట చెప్పి పంపండి.
* హ్యాండ్ శానిటైజర్ విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. ఎప్పుడూ తమ వద్ద శానిటైజర్ ఉంచుకొని చేతులు శుభ్రం చేసుకునే వీల్లేనప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోమని చెప్పండి. అలాగే దీన్ని కూడా ఇతర పిల్లలతో పంచుకోకూడదని వారికి అర్ధమయ్యేలా వివరించండి. అలాగని మరీ ఎక్కువగా ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే!
* ఇక మాస్క్ పెట్టుకోవడమన్నది వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త మాత్రమే కాదు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మన జీవితంలో ఓ భాగమైపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా రోజూ తప్పనిసరిగా మాస్క్ పెట్టుకునేలా.. తరగతి గదిలో, ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్ తొలగించకుండా ఉండమని వారికి చెప్పాలి. అలాగే దాన్ని ఎలా ధరించాలి, ధరించినప్పుడు తాకకుండా ఉండడం, తొలగించడం.. వంటివి కూడా వారితో ప్రాక్టీస్ చేయించాలి.
* ఇక రీ యూజబుల్ మాస్క్ అయితే వాటిని వేడి నీళ్లలో ఉతికేయడం, వాడి పడేసేదైతే మూత ఉన్న చెత్తడబ్బాలో పడేయాలన్న విషయం తెలిసిందే! దీని గురించి పిల్లలకు కూడా వివరించాలి.
* పిల్లల్లో రోగనిరోధక శక్తి పెద్ద వారితో పోల్చితే కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే వారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే సీజనల్ పండ్లు, కాయగూరలు, నట్స్, విటమిన్-సి ఎక్కువగా ఉండే పదార్థాలు.. వంటి ఆహారంతోనే వారి రోజువారీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ తయారుచేయడం మంచిది.
* అలాగే వారికి ఇమ్యూనిటీని పెంచే కాఢా పానీయం, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు.. వంటివి ఉదయాన్నే తాగించడం మంచిది.
* పిల్లలు స్కూల్ క్యాంటీన్‌లో, బయటి పదార్థాలు తినకుండా చూసే బాధ్యత కూడా మీదే! ఈ క్రమంలో రోజూ రుచికరమైన ఇంటి భోజనంతో బాక్స్ కడుతూ.. బయటి పదార్థాలు తినడం అనారోగ్యకరమని, వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటుందని వారికి వివరించి చెబితే వారు తప్పకుండా వింటారు.
* ఇక మధ్యాహ్నం భోజన సమయంలో చాలామంది పిల్లలు తమతో తీసుకొచ్చిన పదార్థాలు తమ స్నేహితులతో పంచుకుంటూ సరదాగా భోంచేస్తుంటారు. అయితే కొవిడ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి అలవాటు మంచిది కాదని పిల్లలకు చెప్పాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా దూరం దూరంగా కూర్చొని తినమని చెప్పాలి.
* శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకూ అవసరమే! అందుకే రోజూ మీతో పాటే పిల్లలు కూడా ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసేలా వారిని ప్రోత్సహించాలి.
* స్కూలుకెళ్లే పిల్లలు సాయంత్రం ఆడుకునే సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా పిల్లలంతా కలిసి ఆడుకోకపోవడమే మంచిది.
* ఇక మీ పిల్లలు స్కూలుకెళ్లే క్రమంలో దగ్గు, జలుబు, జ్వరం.. వంటి అనారోగ్యాలకు గురైతే వారిని బడికి పంపించకుండా ఇంటి వద్దే ఉంచుకొని సంబంధిత డాక్టర్ వద్దకు వారిని తీసుకెళ్లడం శ్రేయస్కరం!