బిడ్డను చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించే అమృతమే.. అమ్మపాలు! బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా రోగనిరోధకశక్తికి బీజం వేస్తాయి. అంతేకాకుండా అమృతం లాంటి అమ్మపాలతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..!
నవజాత శిశువుకు తల్లిపాల నుంచి అందే వ్యాధినిరోధక శక్తి భవిష్యత్తులో ఆ చిన్నారికి రక్తపోటు సమస్యను దూరంగా ఉంచుతుందట. ఎక్కువ కాలంపాటు తల్లి పాలను తాగే పిల్లల్లో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందంటూ కెనడియన్ పరిశోధన సంస్థ నివేదిక తెలిపింది. 2,400 మంది పిల్లలపై ఈ అధ్యయనాన్ని జరిపారు. 2009-2012 సంవత్సరాల మధ్య ప్రసవించిన తల్లులు, వారి పిల్లల వివరాలను సేకరించి ఈ అధ్యయనం జరిపారు. తల్లిపాలను తాగే కాలాన్నిబట్టి పిల్లల ఆరోగ్యంలో కలిగే మార్పులను గుర్తించారు.
తక్కువ రోజులు తల్లి పాలను తాగిన చిన్నారులకు మూడేళ్ల నుంచే రక్తపోటు సమస్య మొదలైనట్లు తేలింది. రెండేళ్లపాటు తల్లిపాలను తాగే పిల్లల్లో ఆరోగ్యస్థాయులు పెరగగా, రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించలేదు. ఆరునెలల నుంచి ఏడాదివరకు తాగిన చిన్నారుల్లో అధికబరువు, మధుమేహం, జీర్ణశక్తికి సంబంధించి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి. మొదటి ఆరునెలలు తప్పనిసరిగా తల్లిపాలను, ఆ తర్వాత దాంతో పాటు బార్లీ, ఓట్స్ వంటి ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలను ఆవిరిపై ఉడికించి అందించిన చిన్నారులు ఆరోగ్యవంతులుగా ఉండటాన్ని గుర్తించారు. ప్రసవించిన మొదటి మూడు రోజుల్లోని తల్లిపాల ద్వారా ఉత్పత్తి అయ్యే కొలోస్ట్రం నవజాత శిశువుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని, ఇది వారిని భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా అధ్యయనవేత్తలు తెలిపారు. అంతేకాదు...