పీసీఓఎస్(PCOS issues) ఉందని తెలిసినప్పట్నుంచి మహిళల్లో ఏదో తెలియని భయం, ఆందోళన ఆవహిస్తాయి. ఇది దీర్ఘకాలిక సమస్య కాబట్టి ఇక తమకు పిల్లలు పుట్టరని, ఇతరత్రా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని మథన పడుతుంటారు. అయితే ఇది దీర్ఘకాలం పాటు మనతోనే ఉన్నప్పటికీ నిపుణుల సలహా మేరకు మందులు వాడుతూ చక్కటి జీవన విధానం అలవాటు చేసుకుంటే ఈ సమస్యను అదుపు చేసుకోవడమే కాదు.. సంతాన భాగ్యానికీ నోచుకోవచ్చంటున్నారు నిపుణులు.
బరువు తగ్గాల్సిందే!
పీసీఓఎస్(PCOS issues) కారణంగా మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుంది. తద్వారా గర్భం ధరించే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతాయి. కాబట్టి ముందుగా బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీ బీఎంఐ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సాధారణంగా గర్భం ధరించాలనుకునే మహిళల బీఎంఐ 18.5 – 24.9 మధ్యలో ఉంటే వారు ఆరోగ్యకరమైన బరువున్నారని అర్థం. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ముందుగా బరువు తగ్గాకే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలని, లేదంటే ఇటు మీ ఆరోగ్యం, అటు కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. ఇలా మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు వ్యాయామాలను మీ రొటీన్‌లో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు కనీసం అరగంటైనా ఇందుకు కేటాయించాలి. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని ఓసారి వైద్యుల వద్ద చెక్ చేయించుకొని ఏయే వ్యాయామాలు చేయచ్చన్న విషయంలో వారి సలహా తీసుకుంటే మరీ మంచిది.
ఆ సమయం తెలుసుకొని..!
నెలనెలా వచ్చే నెలసరి పదే పదే క్రమం తప్పుతోందంటే అందుకు పీసీఓఎస్(PCOS issues) కూడా ఓ కారణమై ఉండచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ అదే నిర్ధారణ అయితే మాత్రం నెలసరి సక్రమంగా వచ్చేలా చేసుకోవడం తప్పనిసరి.. లేదంటే గర్భధారణ కష్టమవుతుంది. అయితే పీసీఓఎస్ కారణంగా మనం పెరిగిన బరువు తగ్గే క్రమంలోనూ మన ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య తగ్గడంతో పాటు, ఇది అండోత్పత్తి సరైన సమయంలో జరగడానికి సైతం దోహదం చేస్తుంది. తద్వారా ఆ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే అండోత్పత్తి (ఒవ్యులేషన్) సమయం మాకెలా తెలియాలి అనుకున్న వాళ్ల కోసం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఒవ్యులేషన్ క్యాలిక్యులేటర్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆశ్రయిస్తే మీ సందేహానికి సమాధానం దొరుకుతుంది.