జలుబు, దగ్గు, జ్వరం, నీరసం, వాసన-రుచి కోల్పోవడం.. ఇలాంటి కొవిడ్ లక్షణాలు కొంతమందికి నెగెటివ్ వచ్చినా తగ్గుముఖం పట్టట్లేదు. ఇందుకు కారణం ఆయా అవయవాలపై వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడమే అంటున్నారు నిపుణులు. ఇలాంటి లక్షణాలు తగ్గి తిరిగి మునుపటిలా సాధారణ స్థితికి రావాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే మన ఆహారపుటలవాట్లలో చిన్న పాటి మార్పులు చేసుకుంటే కొవిడ్ తర్వాత త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్.
ఈ మార్పులతో కోలుకోవచ్చు!
* సాధారణంగా మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం మొదట తీసుకునే ఆహారంపైనే అది ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొవిడ్ నుంచి కోలుకునే వారు రాత్రి నానబెట్టిన బాదం పప్పులు, ఎండు ద్రాక్షలను ఉదయాన్నే తీసుకోవడం మంచిది. తద్వారా బాదంలోని ప్రొటీన్, ఎండు ద్రాక్షలోని ఐరన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
* ఇక అల్పాహారంలో భాగంగా.. రాగి దోసె లేదంటే పారిడ్జ్ (తృణధాన్యాలను పాలలో ఉడికించి తయారుచేసుకునే పదార్థం. ఉదాహరణకు.. ఓట్‌మీల్) తీసుకోవాలి. రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇక ఓట్‌మీల్ రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తుంది.
* మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బెల్లం-నెయ్యి కలిపి తీసుకోవడం శ్రేష్టం. ఈ క్రమంలో ఈ కాంబినేషన్‌ను చపాతీతోనైనా తినచ్చు.. లేదంటే అన్నం తినడం పూర్తయ్యాక ఒక చిన్న బెల్లం ముక్కపై కాస్త నెయ్యి వేసుకొని చప్పరించచ్చు. ఈ రెండు పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో, హార్మోన్లను సమతులం చేయడంలో సమర్థంగా పని చేస్తాయి.
* శారీరక అలసటను దూరం చేసుకోవాలంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ క్రమంలో రాత్రుళ్లు హాయిగా నిద్ర పట్టాలంటే రాత్రి మితమైన భోజనం, సులభంగా జీర్ణమయ్యే పదార్థం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు కిచిడీ చక్కటి ప్రత్యామ్నాయం. మనం ఇందులో వాడే పప్పులు, నెయ్యి, కాయగూరల ద్వారా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు.. వంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి.
* కొవిడ్ కారణంగా తలెత్తే నీరసం, అలసటను తగ్గించుకోవాలంటే శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో నీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా!