తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇంటి నుంచి పని.. అలసట అందుకేనా?!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కరోనా కాలంలో బాగా ట్రెండ్‌ అవుతోన్న ఈ పని విధానం కారణంగా ఇంటి పట్టునే ఉంటూ హాయిగా పనిచేసుకోవచ్చు. అయితే ఇందులో పలు సమస్యలూ లేకపోలేదు. నిరంతరాయంగా కూర్చొనే ఉండడం, ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, సరైన పని వాతావరణం లేకపోవడం.. ఇలా వీటి మూలంగా చాలామంది ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. మరి, ఇంతకీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే క్రమంలో ఎదురయ్యే అలసటకు కారణాలేంటి? దాన్ని దూరం చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Work-from-home issues
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్​తో ఎదురయ్యే సమస్యలు

By

Published : Mar 27, 2021, 2:57 PM IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా అలసటకు గురవుతోన్న వారి సంఖ్య సుమారు 35 శాతంగా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక మరో 32 శాతం మంది పని ఒత్తిడిని తట్టుకోలేక అప్పుడప్పుడూ నీరసిస్తున్నారని వెల్లడైంది. ఏదేమైనా దీని ప్రభావం అంతిమంగా వారి అవుట్‌పుట్‌పై పడుతుందని.. కాబట్టి ఈ అలసటను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదంటున్నారు.

అదనంగా మూడు గంటలపైనే

అదనంగా మూడు గంటలపైనే..!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం వచ్చినప్పట్నుంచి ప్రయాణ సమయం ఆదా అవుతోంది.. బస్సుల కోసం పడిగాపులు కాచే బాధ తప్పింది.. నిజానికి ఇలా మనకు కలిసొస్తుందనుకున్న సమయం అదనపు పని వల్ల వృథానే అవుతుందంటున్నారు నిపుణులు. ఇంటి నుంచి పనిచేసే క్రమంలో చాలామంది ఉద్యోగులు అదనంగా రోజుకు 3.13 గంటలు పనిచేస్తున్నారని ఓ సర్వే తెలిపింది. ఇక మరికొంతమందైతే రోజుకు 4.64 గంటలు అదనంగా పనిచేస్తూ, మరింత ఉత్పాదకతను సంస్థకు అందిస్తున్నామన్న భావనలో ఉన్నారట! ఏదేమైనా ఇలాంటి అదనపు భారమే ఉద్యోగులను తీవ్ర అలసటకు గురిచేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలా అధిక పనిభారం వల్ల ఉత్పాదకత కూడా సరిగ్గా ఉండదు. అందుకే ఈ భారాన్ని, అలసటను తగ్గించుకోవడానికి కచ్చితమైన పనివేళలు నిర్దేశించుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజూ సమయానికి లాగిన్‌ అవడం, తిరిగి వేళకు లాగౌట్‌ అవడం చాలా ముఖ్యం. తద్వారా ఎప్పుడూ పని పని అని కాకుండా మనకంటూ కాస్త సమయం గడిపే వీలుంటుంది.

రొటీన్‌ మిస్సయితే

రొటీన్‌ మిస్సయితే..!

ఇంటి నుంచి పని విధానం చాలామంది ఉద్యోగుల్లో బద్ధకాన్ని కూడా పెంచిందంటున్నారు నిపుణులు. ఎలాగూ పని ఇంటి నుంచే కదా అని ఆలస్యంగా నిద్ర లేవడం, స్నాక్స్‌ పేరుతో జంక్‌ ఫుడ్‌ లాగించేయడం, ఇంట్లో చేసుకునే సమయం లేదంటూ బయటి నుంచే ఆహారం తెప్పించుకోవడం.. వంటి అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాదు.. విపరీతమైన అలసటను కూడా పెంచేస్తాయి. ఇదీ ఓ విధంగా పనిలో ఉత్పాదకత తగ్గిపోవడానికి కారణమే! కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో క్రమశిక్షణతో కూడిన రొటీన్‌, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, పని నుంచి కాస్త విరామం తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని, మనసును పునరుత్తేజితం చేసుకోవచ్చు.

కళ్లు అలసిపోతున్నాయా


కళ్లు అలసిపోతున్నాయా?!

కరోనా ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ విధానం తెచ్చి.. వారిని భౌతికంగా దూరం చేసినా.. టెక్నాలజీ మాత్రం వారిని మరింత దగ్గరగా చేర్చిందని చెప్పచ్చు. ఈ క్రమంలోనే ఒక సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులంతా వీడియో కాల్స్‌ మాట్లాడుకోవడం, రోజువారీ పనుల గురించి చర్చించుకోవడం.. ఇప్పుడంతా కామనైపోయింది. అయితే ఒక్కోసారి రోజంతా వీడియో కాల్‌ మాట్లాడడమంటే ఎవరికైనా విసుగొస్తుంది. అంతేకాదు.. దాని ప్రభావం కళ్ల పైనా పడుతుంది. తద్వారా కళ్లు, శరీరం, మనసు అలసటకు గురవుతాయి. కాబట్టి వీడియో కాల్‌తో పని లేనప్పుడు ఆడియో కాల్‌ మాట్లాడడం, నిర్ణీత వ్యవధుల్లో పని నుంచి విశ్రాంతి తీసుకోవడం.. వంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఎలాంటి అలసట లేకుండా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని ఎంజాయ్‌ చేయచ్చు.

ఆ వాతావరణం అనుకూలించకపోయినా..!

ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేయాలంటే మన చుట్టూ ఉండే వాతావరణం మనకు అనుకూలంగా ఉండాలి. అయితే కొంతమంది ఉద్యోగులకు వారు ఇంటి నుంచి పనిచేసేందుకు సరైన సదుపాయాలు ఉండట్లేదనే చెప్పాలి. ఈ క్రమంలో వారికి ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేసుకునే వీల్లేకపోవడం, ఇంట్లో ఎక్కువమంది సభ్యులుండడం.. ఇలాంటివన్నీ పని అంటే వారిలో ఒక రకమైన అసహనాన్ని కలుగజేస్తాయి. పైగా తమ పనిని ఇతరులు గమనిస్తే అసౌకర్యానికి గురయ్యే వారూ ఎందరో! ఇలాంటి ప్రతికూల వాతావరణంలో పనిచేయలేకపోవడం కూడా ఒక రకంగా అలసటకు గురైనట్లే అంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో ఉండే చోటును బట్టి మీకు మీరే ఓ ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకోవడం, పనిలో ఉన్నప్పుడు ఆ గదిలోకి రావద్దంటూ.. డిస్టర్బ్‌ చేయద్దంటూ కుటుంబ సభ్యులు-పిల్లలకు వివరించడం వల్ల ఈ అసహనాన్ని, అలసటను చాలావరకు తగ్గించుకోవచ్చు.

వాటిని సమన్వయం చేసుకోలేక

వాటిని సమన్వయం చేసుకోలేక..!

ఇంటి నుంచి పని అంటే మహిళలకు కత్తి మీద సామే! ఎందుకంటే ఆఫీస్‌కు వెళ్లే వారైతే ఉన్న సమయంలో పనుల్ని విభజించుకొని.. సమయానికి పనులు పూర్తి చేసుకోవచ్చు. అదే ఇంట్లో ఉండే ఎంత చేసినా ఈ పని ఓ పట్టాన తరగదు. ఇలా ఇంటి పని చేసుకోలేక.. ఇటు ఆఫీస్‌ పని సమయానికి పూర్తి కాక.. చాలామంది మహిళల శరీరం, మనసు విపరీతంగా అలసిపోతాయని చెప్పచ్చు. మరి, దీన్నుంచి బయటపడాలంటే.. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పనంతా మీరే చేయడం కాకుండా ఇంట్లో ఉన్న వారికి పంచడం, అత్యవసరమైన పనుల్నే పెట్టుకోవడం, మిగతావి వాయిదా వేసుకోవడం.. ఇలా ఆలోచిస్తే ఎన్నో ప్రత్యామ్నాయాలు దొరుకుతాయి.

సో.. ఇంటి నుంచి పనిచేసే క్రమంలో మనల్ని అలసిపోయేలా చేసే కొన్ని అంశాలేంటో తెలుసుకున్నారు కదా! కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే ఇటు మీపై భారం పడకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.. అటు పనిలో మంచి ఉత్పాదకతనూ సంస్థకు అందించచ్చు. తద్వారా కెరీర్‌లోనూ రాణించచ్చు..!

ఇదీ చదవండి:చేయూత ఇచ్చింది.. చేయందుకున్నాను!

ABOUT THE AUTHOR

...view details