కీరాదోస, పుదీనాతో..
ముందుగా మూడు కీరాదోస కాయల్ని, నాలుగు నిమ్మకాయల్ని తీసుకుని చక్రాల్లా కట్ చేసుకోవాలి. లీటరు నీటిలో ఈ ముక్కల్ని, కొన్ని తాజా పుదీనా ఆకుల్ని వేసి.. రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. అనంతరం నీటిని వడకట్టుకుని తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ నీరు శరీరంలోని మలినాల్ని, విషపదార్థాల్ని బయటికి నెట్టివేస్తుంది. నిమ్మలోని ఆల్కలిన్ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పుదీనా జీర్ణశక్తిని మెరుగుపరిస్తే.. కీరాదోస చర్మ ఆరోగ్యానికెంతగానో మేలు చేస్తుంది. కాబట్టి చలికాలంలో నీరు తాగాలనిపించినప్పుడు ఈ మిశ్రమాన్ని నీటికి బదులుగా తీసుకోవడం చాలా మంచిది.
పండ్లతో..
నిమ్మ, ద్రాక్ష, యాపిల్, కివీ, అనాస.. వంటి పండ్లతో తయారు చేసిన పానీయం కూడా బరువు తగ్గడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొన్ని పండ్ల ముక్కల్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో కొన్ని గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని వడకట్టుకునైనా తీసుకోవచ్చు.. లేదంటే ముందు పండ్లు తిని ఆ నీరైనా తాగచ్చు. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు శరీరంలోని విషతుల్యాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. జీవక్రియల్ని వేగవంతం చేసి శరీరంలోని అనవసర పదార్థాల్ని అతి వేగంగా బయటికి పంపించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాగే వీటిలోని విటమిన్ 'సి' కణాలకు పోషణ అందిస్తుంది. ఇవేకాదు.. చలికాలంలో దొరికే పండ్లతో మీకు నచ్చినవి కూడా కలుపుకోవచ్చు.
దాల్చినచెక్కతో..
ఒక గ్లాస్ నీటిలో కొన్ని యాపిల్, దాల్చినచెక్క ముక్కల్ని వేసి.. ఈ మిశ్రమాన్ని గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. మరీ రుచిగా కావాలనుకున్న వారు యాపిల్, దాల్చిన చెక్క ముక్కల్ని కాస్త ఎక్కువగా కూడా కలుపుకోవచ్చు. ఈ పానీయంలో క్యాలరీలు అసలే ఉండవు. కాబట్టి కూల్‌డ్రింక్ బదులు దీన్ని తీసుకోవచ్చు. దీనివల్ల త్వరగా బరువు తగ్గడంతో పాటు శరీరంలోని హానికారక విషపదార్థాలు కూడా వేగంగా తొలగిపోతాయి. అలాగే శరీరంలోని జీవక్రియల్ని కూడా వేగవంతం చేయడంలో ఈ పానీయం కీలకపాత్ర పోషిస్తుంది.