వేసవిలో మండుటెండల నుంచి ఉపశమనం పొందాలంటే పుచ్చకాయకు మించిన పండు మరొకటి లేదు. దాదాపు 95 శాతం నీటిని నింపుకొన్న ఈ సీజనల్ ఫ్రూట్‌లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామంది ఈ పండును తినేటప్పుడు గింజలను పక్కన పడేస్తుంటారు. మరికొంతమంది తినేందుకు సులభంగా ఉంటుందని గింజలు లేని పుచ్చకాయ ముక్కలను కొని తెచ్చుకుంటారు. అయితే ఇలా పుచ్చకాయ గింజలను పక్కన పెట్టేయడమంటే చేతికందిన పోషకాలను దూరం చేసుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు లాంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయని వారు సూచిస్తున్నారు.
పండ్లలోనే కాదు.. గింజల్లోనూ!
పుచ్చకాయ పండులో ఉన్న పోషక విలువల్లో ఎక్కువ భాగం వాటి గింజల నుంచే లభిస్తుంది. వీటిలో ప్రొటీన్లు, విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్, మాంగనీస్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మం, జుట్టు సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
చర్మ సంరక్షణకు..
ముఖంపై ముడతలు తొలగిపోయి మిలమిలలాడాలంటే పుచ్చకాయ గింజలను డైట్‌లో భాగం చేసుకోవాల్సిందే. ఇందులోని మెగ్నీషియం, జింక్ ఇతర ఖనిజ లవణాలు చర్మంలోని విష తుల్యాలను తొలగిస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుపడతాయి. వీటిని డైరెక్టుగా తీసుకోవడం ఇష్టం లేకపోతే వేయించుకుని తినచ్చు. ఈ గింజల్లో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. అందుకే తామర లాంటి చర్మవ్యాధుల చికిత్సా విధానాల్లో వీటిని ఎక్కువగా వాడుతుంటారు.
కురుల ఆరోగ్యాన్ని కాపాడతాయి!
చర్మమే కాదు కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పోషకాలు పుచ్చకాయ గింజల్లో ఉంటాయి. ఇందులోని ప్రొటీన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ తదితర ఖనిజ లవణాలు శిరోజాల కుదుళ్లను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. జుట్టు పొడవుగా పెరిగేందుకు సహకరిస్తాయి. ఈ గింజల్లోని మాంగనీస్ జుట్టు రాలిపోవడాన్ని బాగా నిరోధిస్తుంది. కురులకు మృదుత్వాన్ని చేకూర్చి సిల్కీగా మార్చడంలో ఇందులోని కాపర్ కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె జబ్బులను తగ్గిస్తాయి!
పుచ్చకాయ గింజల్లో మోనో అన్శ్యాచురేటెడ్, పాలీ అన్శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె నొప్పి, గుండెపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక మాంగనీస్ రక్తపోటులో హెచ్చుతగ్గులను నివారిస్తే... శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని చేరవేయడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.