మహిళలకు ఇంట్లో బాధ్యతలకు పిల్లల చదువులూ తోడయ్యాయి. ఉద్యోగినులకు ఆఫీసు పని అదనం. దీంతో వ్యాయామానికి ప్రాధాన్యమివ్వడమే తగ్గించారు. పెరిగిన పనితో ఒత్తిడీ వగైరా.. వీళ్లని చెప్పుల్లేకుండా నడవమని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే..
barefoot walk relieves stress : చెప్పులు విప్పి నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఇంటి పని.. ఆఫీసు పనితో నిత్యం బిజీ ఉండే గృహిణి తన ఆరోగ్యం పట్ల చూపించే శ్రద్ధ కాస్త తక్కువేనని చెప్పాలి. కరోనా పుణ్యమా అని.. పిల్లలు ఇళ్లకే పరిమితమవ్వడం.. భర్త కూడా ఇంట్లో నుంచే పని చేస్తుండటం వల్ల ఆ పని భారం డబుల్ అయింది. పిల్లల చదువు బాధ్యత కూడా తనపైనే పడింది. ఇంత బిజీ షెడ్యూల్లో వ్యాయామానికి వారికి సమయం దొరకడం కాస్త కష్టమే. అందుకే నడిచేటప్పుడు చెప్పుల్లేకుండా నడిస్తే ఒత్తిడి మాయమై ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.
వట్టి పాదాలతో నడిస్తే నొప్పి, ఒత్తిడి దూరమవ్వడమే కాకుండా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నిద్ర బాగా పట్టడంతోపాటు ఉత్సాహంగానూ ఉంటారు. చుట్టు ఉన్న సహజ వాతావరణంతో కలవడానికీ ఇదే మంచి మార్గమట. ఇలా చేస్తే శరీరం సౌకర్యవంతంగా కదులుతుంది. వయసు పైబడినప్పుడూ ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజంతా బూట్లు వేసుకుని ఉండటం శరీరంలోని సహజ బయోమెకానిక్స్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది. దేహం మొత్తంలో ఉండే ఎముకల్లో 25 శాతం పాదాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. షూ వాటిని సహజంగా కదలకుండా నిరోధిస్తాయి. ఫలితమే మోకాళ్లు, నడుము నొప్పి వగైరా.
- ఇదీ చదవండి :ఆకుకూరల్లో పోషకాలు పోకుండా ఉండాలంటే ఇలా చేయండి!
చెప్పుల్లేకుండా నడక కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. అరికాళ్లలోని ఇంద్రియ నాడి చివర్లు భూమిని గుర్తించి, ఎలా, ఎంత జాగ్రత్తగా నడవాలన్నదానిపై శరీరానికి సూచనలూ ఇస్తాయట. అప్పటిదాకా ఉపయోగించని కండరాలను మేల్కొలిపి, పాదాలకు రక్తప్రసరణ జరిగేలా చేస్తాయి. ఇది నిటారుగా నిలబడేలానూ సాయపడతాయి. కాబట్టి, అలా నాలుగు అడుగులు వేసేటప్పుడు చెప్పులను వదలండి. ఇసుక, గడ్డి, చిన్నరాళ్లు ఏం కనిపించినా వట్టి పాదాలతో నడవండి.