తెలంగాణ

telangana

మీ చిన్నారులను వేళకు నిద్రపుచ్చే చిట్కాలు..

By

Published : Jul 31, 2020, 1:18 PM IST

చిన్నారులను రోజూ ఒకే సమయానికి నిద్రపుచ్చడం తల్లులకు కాస్త కష్టమే. అయితే వారి నిద్రకు కచ్చితమైన వేళలు పాటించడం వల్ల బిడ్డలతోపాటు తల్లులకూ ఒత్తిడి ఉండదట. మరి చిన్నారులు వేళకు నిద్రపోయేలా చేసేందుకు ఈ చిట్కాలు చూసేయండి మరి..

tips to make your children sleep on time every day
మీ చిన్నారులను వేళకు నిద్రపుచ్చే చిట్కాలు..

పిల్లల వయసును బట్టి వారు నిద్రపోయే సమయం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒకటి నుంచి మూడేళ్ల పాపాయిలకు పన్నెండు-పద్నాలుగు గంటల నిద్ర సరిపోతుంది. ఏడు నుంచి పన్నెండేళ్ల పిల్లలకు పది నుంచి పన్నెండు గంటల నిద్ర అవసరం. పదమూడు నుంచి పద్దెనిమిదేళ్ల వారికి దాదాపు ఎనిమిది నుంచి పది గంటల నిద్ర కావాలి.

మరీ చిన్నపిల్లలయితే నిద్రపోయే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయిస్తే హాయిగా కలతలు లేకుండా నిద్రపోతారు.

చిన్నారులు రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూడాలి. వారు నిద్రకు ఉపక్రమించే పదిహేను నిమిషాల ముందు చక్కటి సంగీతం పెడితే వింటూ హాయిగా నిద్రపోతారు లేదా చిన్న చిన్న కథలు చెబితే వింటూ నిద్రలోకి జారుకుంటారు.

చిన్నారులు నిద్రకు ఉపక్రమించే సమయానికి వారి గదిని చీకటిగా నిశ్శబ్దంగా, చల్లగా ఉండాలి. కొంతమంది చిన్నారులు చీకటంటే భయపడతాడు. కాబట్టి తక్కువ వెలుతురు ఉండే బెడ్​లైట్​ను వేయాలి.

చిన్నారులు నిద్రపోయే ముందు టీవీ, కంప్యూటర్, ట్యాబ్లెట్, ల్యాప్​టాప్ ఇలా వేటినైనా కట్టేయాల్సిందే. వీటినుంచి వచ్చే కాంతి వల్ల నిద్ర పట్టదు. నిద్రపోయే గంట ముందు నుంచే వీటిని పక్కన పెట్టేయాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు వారి గదిలో ఉండకుండా చూసుకోవాలి.

రోజూ వారితో రకరకాల వ్యాయామాలు చేయించాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందు ఆడుకునే ఆటల వల్ల వారు అలసి పోయి నిద్రపోతారు.

కెఫిన్ అనేది చిన్నారులకు అస్సలు మంచిది కాదు. నిద్రపోయే మూడు గంటల ముందు నుంచి వారికి చక్కెర, కెఫిన్ ఉండే ఏ పానీయాలు ఇవ్వకూడదు. రాత్రిపూట పోషకాలుండే ఆహారాన్ని మితంగా పెట్టాలి. నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలు ఇస్తే సరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details