యుక్త వయసులోనూ మధ్యవయసులోనూ సంతోషంగా జీవించేవాళ్లకి వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే అవకాశాలు తక్కువని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. 20 నుంచి 90 ఏళ్లలోపు 15 వేలకు పైగా వ్యక్తుల్ని ఎంపికచేసి నిశితంగా గమనించారట. ఇందుకోసం వాళ్లను మూడు వర్గాలుగా విభజించారట. యుక్తవయసు, మధ్య వయసు, వృద్ధాప్యం... ఇలా మూడు దశలుగా విభజించి వాళ్ల జీవనశైలినీ మెదడు పనితీరునీ పదేళ్లపాటు గమనిస్తూ వచ్చారట. అందులో- డిప్రెషన్‌తో ఉన్నవాళ్లలో ఆనందంగా ఉన్నవాళ్లకన్నా వయసు పెరిగేకొద్దీ ఆలోచనా శక్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. మధుమేహం, బరువు, చదువు, ఉద్యోగం... ఇలా ఏ కారణం వల్ల డిప్రెషన్ వచ్చినా వయసు పెరిగేకొద్దీ వాళ్ల మెదడులోని హిప్పోక్యాంపస్ భాగం క్రమంగా దెబ్బతింటున్నట్లు గుర్తించారు. దాంతో వృద్ధాప్యంలో వాళ్లు కొత్త విషయాలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోతున్నారట. ముఖ్యంగా డిప్రెషన్ కారణంగా మహిళల్లో మతిమరుపు మరీ ఎక్కువగా ఉందట. అంతేకాదు, డిప్రెషన్ శాతం పెరిగేకొద్దీ మతిమరుపూ ఎక్కువవుతున్నట్లు తేలిందట.
కీళ్లవ్యాధికీ వ్యాక్సిన్ చికిత్స!
కీళ్ల జబ్బులకు వ్యాక్సీన్ ఏమిటా అనిపిస్తోంది కదూ. కానీ టొలెడొ యూనివర్సిటీ పరిశోధకులు రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌ను నివారించేందుకు సరికొత్త వ్యాక్సీన్ చికిత్సను రూపొందించారు. దీన్ని ప్రయోగాత్మకంగా జంతువుల్లోనూ పరిశీలించారట. అదెలా అంటే- జెటా 14-3-3 అనే ప్రొటీన్ ఎక్కువ కావడం వల్లే రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ వస్తున్నట్లు ఇంతకాల శాస్త్ర బృందం భావించింది. దాంతో జీన్ ఎడిటింగ్ ద్వారా ఆ ప్రొటీన్‌ను తొలగించాలనీ అనుకున్నారు. అయితే ఎలుకల్లో ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు- ఈ ప్రొటీన్ తగ్గినప్పుడు కూడా కీళ్లనొప్పులు వస్తున్నట్లు గుర్తించారు. దాంతో ఈ ప్రొటీన్‌ను ప్రేరేపించే వ్యాక్సీన్‌ను పరిశోధక బృందం తయారుచేసి కొన్ని జంతువుల్లో ప్రయోగపూర్వకంగా పరిశీలించిందట. ఆశ్చర్యకరంగా వాటిల్లో ఈ వ్యాధి పూర్తిగా తగ్గిందట. దాంతో త్వరలోనే కీళ్లవాతాన్ని నివారించడానికి ఈ వ్యాక్సీన్ చికిత్సను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది సదరు నిపుణుల బృందం.