తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇది నిజం: థైరాయిడ్ రావడానికి ఇవీ కారణమేనట! - thyroid disease symptoms expalined

నిస్సత్తువ, బరువు పెరగటం, చలి తట్టుకోలేక పోవటం. హైపోథైరాయిడిజమ్‌ (థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోవటం) అనగానే ఇలాంటి లక్షణాలే గుర్తుకొస్తాయి. ఇవి అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. కొందరిలో.. ముఖ్యంగా వృద్ధుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోవచ్చు. ఇంకొందరిలో భిన్నమైన లక్షణాలూ ఉండొచ్చు. కొన్ని వృద్ధాప్య లక్షణాలుగానూ కనిపించొచ్చు. వీటిని పోల్చుకోగలిగితే సమస్య ముదిరిపోకుండా, ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు.

thyroid disease symptoms expalined
వీటి వల్ల కూడా థైరాయిడ్​ జబ్బు వస్తుందంట తెలుసా?

By

Published : Jun 30, 2020, 1:24 PM IST

అధిక కొలెస్ట్రాల్‌

వృద్ధుల్లో హైపోథైరాయిడిజమ్‌కు అధిక కొలెస్ట్రాల్‌ ఒక్కటే సంకేతం కావొచ్చు. చాలాసార్లు దీన్ని కొలెస్ట్రాల్‌ సమస్యగానే పొరపడుతుంటారు. థైరాయిడ్‌ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోతే కాలేయం కొలెస్ట్రాల్‌ను సరిగా విడగొట్టలేదు. అకారణంగా కొలెస్ట్రాల్‌ పెరుగుతుంటే థైరాయిడ్‌ పరీక్ష చేయించటం మంచిది.

ఆయాసం, పాదాల వాపు

థైరాయిడ్‌ హార్మోన్ల మోతాదులు తగ్గితే గుండెకు తగినంత రక్తం అందదు. గుండె కండర సామర్థ్యం, కొట్టుకునే వేగమూ తగ్గుతాయి. ఇవి గుండె వైఫల్యానికి దారితీయొచ్చు. పంపింగ్‌ వ్యవస్థ బలహీనపడటం వల్ల గుండెకు చేరుకోవాల్సిన రక్తం సిరల్లోనే ఉండిపోవచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాలు పోగుపడొచ్చు. దీంతో ఆయాసం, పాదాల వాపు, బలహీనత, నిస్సత్తువ వంటి గుండె వైఫల్య లక్షణాలు కనిపిస్తాయి.

మలబద్ధకం

హైపోథైరాయిడిజమ్‌ మూలంగా పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. దీంతో మల పదార్థం సరిగా ముందుకు కదలక మలబద్ధకం తలెత్తుతుంది. అరుదుగా కొందరికి విరేచనాలూ పట్టుకోవచ్చు. రోగనిరోధక శక్తి పొరపాటున దాడిచేయటం వల్ల తలెత్తే హషిమోటో అనే థైరాయిడ్‌ సమస్య గలవారికీ విరేచనాలు వేధిస్తుంటాయి.

కీళ్లు, కండరాల నొప్పులు

స్పష్టమైన కారణమేదీ లేకుండా కీళ్లు, కండరాల నొప్పులు తలెత్తటం హైపోథైరాయిడిజమ్‌ ప్రత్యేక లక్షణం. వృద్ధుల్లో ఇవి ఒక్కటే సమస్యకు సంకేతాలు కావొచ్చు. చాలామందికి కాలి కండరాల వంటి పెద్ద కండరాల్లో నొప్పి వస్తుంటుంది.

మానసిక సమస్యలు

థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల వృద్ధాప్యంలోనూ కుంగుబాటు (డిప్రెషన్‌) కనిపించొచ్చు. తేడా ఏంటంటే వృద్ధుల్లో కుంగుబాటు ఒక్కటే ప్రత్యేకించి కనిపిస్తుండటం. కొందరు లేనిపోనివి ఊహించుకొని భ్రాంతులకూ లోనవుతుండొచ్చు.

మతిమరుపు

కుంగుబాటుతో పాటు కొందరికి తీవ్ర మతిమరుపు సైతం ఉండొచ్చు. వృద్ధులు డిమెన్షియాతో బాధపడుతుంటే థైరాయిడ్‌ పనితీరునూ తెలుసుకోవటం ముఖ్యం.

తూలిపోవటం

హైపోథైరాయిడిజమ్‌ మూలంగా మెదడులో మన శరీర కదలికలను నియంత్రించే భాగం దెబ్బతినొచ్చు. ఫలితంగా నడక అస్తవ్యస్తం కావొచ్చు. తూలిపోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details