తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మీరూ ‘కరోనాసోమియా’తో బాధపడుతున్నారా?

ప్రస్తుతం ఎవరిని చూసినా కరోనా సెకండ్ వేవ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరిని కదిపినా ఈ కరోనా భయంతో మాకు రాత్రుళ్లు సరిగ్గా నిద్రే పట్టట్లేదని వాపోతున్నారు. క్లినికల్‌ స్లీప్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ తాజా అధ్యయనం కూడా ఇదే విషయం చెబుతోంది. కరోనా మహమ్మారి కారణంగా భయపడుతూ నిద్రలేమితో బాధపడుతోన్న వారు ప్రస్తుతం 40 శాతానికి పైగానే ఉన్నారట! ఇలా కరోనా భయంతో తలెత్తే నిద్రలేమిని ‘కరోనాసోమియా’గా పేర్కొంటున్నారు నిపుణులు. అంతేకాదు.. నిద్రలేమితో బాధపడే వారిలో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరో తాజా అధ్యయనం చెబుతోంది. ఏదేమైనా ఇదిలాగే కొనసాగితే వైరస్‌ ముప్పుతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు. కాబట్టి దీన్ని ఆదిలోనే దూరం చేసుకోవాలని చెబుతున్నారు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

solution for coronasomnia
కరోనాసోమియాకు పరిష్కారం

By

Published : Mar 31, 2021, 1:08 PM IST

వసుధ ప్రతి చిన్న విషయానికీ భయపడిపోతుంటుంది. ఇక కరోనా వచ్చినప్పట్నుంచి అది మరింత ఎక్కువైంది. ప్రతి క్షణం కరోనా గురించే ఆందోళన చెందుతూ రాత్రుళ్లు కంటి నిండా నిద్రే కరవవుతోందని చెబుతోంది. కరోనా ఏమో గానీ ఇటు ఇంటి పని, అటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని బ్యాలన్స్‌ చేసుకోలేక సతమతమైపోతోంది ప్రీతి. ఇక ఈ పనులన్నీ ముగించుకొని పడుకునే సరికి అర్ధరాత్రి దాటిపోతుంది. దీంతో నిద్రలేమితో బాధపడుతోందామె.

కరోనాసోమియాతో బాధపడుతున్నారా.?

వ్యక్తిగత సమస్యలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు.. మొన్నటిదాకా నిద్రలేమికి ఇవే ప్రధాన శత్రువులనుకున్నాం.. కానీ ఇప్పుడు వీటికి కరోనా కూడా తోడైంది. నిరంతరం కరోనా గురించే భయపడటం, ఈ వైరస్‌ గురించే ఆలోచించడం, దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ప్రతికూల ఆలోచనలతో చాలామంది రాత్రుళ్లు సరిగ్గా నిద్రే పోవట్లేదని చెబుతోంది క్లినికల్ స్లీప్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం. ‘కరోనాసోమియా’గా పిలిచే ఈ నిద్రలేమి సమస్యను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత ఆరోగ్యంగా ఉండచ్చంటున్నారు నిపుణులు.

నిద్రమాత్రలకు అలవాటు కావొద్దు

అసలు కారణాలివేనా?!

గత ఏడాది కాలంలో కరోనాసోమియాతో బాధపడుతూ.. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మందుల్ని ఆశ్రయించే వారి సంఖ్య 20 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఈ నిద్రలేమి సమస్యకు కరోనాతో ముడిపడి ఉన్న అనేక అంశాలు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు.

ఇంట్లో, ఆఫీస్​లో పని ఒత్తిడి

భయాందోళనలతో..

కరోనా తీవ్రత ఉన్నప్పటికీ ఆఫీస్‌, ఇతర పనుల రీత్యా బయటికి వెళ్లక తప్పట్లేదు. అలాంటప్పుడు తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని, తమ ద్వారా ఇంట్లో సురక్షితంగా ఉండే వారు కూడా ఈ మహమ్మారి బారిన పడతారేమోనని ఆందోళన చెందే వారు చాలామందే ఉన్నారంటున్నారు నిపుణులు. ఈ భయమే వారిలో నిద్రలేమికి ఒక కారణమవుతుందంటున్నారు.

ఎదుర్కొంటున్న సమస్యలు..

* కరోనా వైరస్‌ మన జీవనశైలినే మార్చేసిందని చెప్పచ్చు. ఇంటి నుంచి పని, అందరూ ఇంట్లోనే ఉండడంతో పెరిగిన పని ఒత్తిడి, ఆఫీస్‌- ఇంటి పనుల్ని బ్యాలన్స్‌ చేసుకోలేకపోవడం.. వంటివన్నీ ఉద్యోగినులను మానసికంగా, శారీరకంగా కుంగదీస్తున్నాయి. ఫలితంగా చాలామంది సుఖనిద్రకు దూరమైపోతున్నారు.

* వైరస్‌ భయంతో నిరంతరాయంగా ఇంటికే పరిమితమవడం, ఒంటరితనం.. వంటివి చాలామందిలో ప్రతికూల ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయేమోనన్న అనవసర భయాలు నిద్రలేమికి దోహదం చేస్తున్నాయి.

ఆందోళన వద్దు

* కరోనా ప్రతికూల పరిస్థితులు చాలామందికి ఉద్యోగ భద్రత లేకుండా చేశాయని చెప్పచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే ఉద్యోగాలు పోయి కొంతమంది.. తమను ఎప్పుడు జాబ్‌ నుంచి తీసేస్తారోనని క్షణక్షణం భయపడుతూ మరికొంతమంది క్షణమొక యుగంలాగా జీవితం గడుపుతున్నారు. నిజానికి ఇలాంటి ఒత్తిళ్లు నిద్రలేమితో పాటు చేసే పనిపై ఏకాగ్రత లోపించేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు.

* వైరస్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలెన్నో! దీనికి తోడు తగ్గిన ఆదాయం, పెరిగిన ధరలు, ఈ రెండింటికీ పొంతన లేకపోవడంతో చాలా ఇళ్లలో ఆర్థిక అనిశ్చితి నెలకొందని చెప్పచ్చు. దీని ప్రభావం కూడా అంతిమంగా మానసిక ఆరోగ్యంపై పడి నిద్రలేమికి దారితీస్తుంది.

ఇలా చేస్తే రిలాక్సవుతారు!

  • కరోనాసోమియాను జయించాలంటే ముందుగా ఒత్తిడిని, మన మనసులో కూరుకుపోయిన ప్రతికూల ఆలోచనల్ని జయించాల్సి ఉంటుంది. ఇందుకోసం రోజూ పడుకోవడానికి ముందు ఓ అరగంట పాటు కాస్త కష్టపడమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఒక చిన్నపాటి వ్యాయామం చేయమంటున్నారు. అలాగే మంద్రస్థాయిలో మీకు నచ్చిన సంగీతం వినడం, పజిల్స్‌ పూర్తి చేయడం-పుస్తకాలు చదవడం.. ఇలా మెదడుకు పదును పెట్టే పనులు చేస్తే ఎలాంటి ఆలోచనలు మనసులోకి రావు.. సరికదా రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
    ఇష్టమైన సంగీతం వింటే
  • కరోనా వచ్చినప్పట్నుంచి చాలామంది తిండి, నిద్ర విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవి కూడా ఒక రకంగా ఒత్తిడిని కలుగజేసేవే! కాబట్టి వేళకు నిద్ర లేవడం దగ్గర్నుంచి ప్రతి పనినీ ఒక నిర్ణీత సమయం ప్రకారం చేసుకుంటూ పోతే కచ్చితంగా కొంతైనా సమయం మిగులుతుంది. అలాగే రాత్రుళ్లు కూడా తగిన సమయం నిద్రకు కేటాయించచ్చు.
  • నిద్రలేమికి మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, టీవీలు.. వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు కూడా ఓ కారణమే! కాబట్టి పడుకునే సమయంలో, పని పూర్తయ్యాక వాటిని పూర్తిగా పక్కన పెడితే సగం ఒత్తిడిని మనకు మనమే తగ్గించుకున్న వాళ్లమవుతాం.
  • ఒత్తిళ్లు తగ్గిపోయి రాత్రుళ్లు సుఖంగా నిద్ర పట్టాలంటే రాత్రి భోజనంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, నట్స్‌, గింజలు, డార్క్‌ చాక్లెట్‌ ముక్క.. వంటివి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
  • కాఫీలో ఉండే కెఫీన్‌ నిద్రలేమికి దారితీస్తుందట! కాబట్టి మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసలు కాఫీ తాగకూడదని చెబుతున్నారు నిపుణులు.

మరి, మీరూ కరోనాసోమియాతో బాధపడుతున్నారా? అయితే ఈ చిన్న చిన్న చిట్కాల్ని పాటిస్తూ ఈ సమస్యను దూరం చేసుకోండి.. తద్వారా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్ని జయిస్తూ ఇటు మానసికంగా, అటు శారీరకంగా ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేయండి!

ఇదీ చదవండి:టీ పొడి అనుకొని ఎండ్రిన్​ వేసుకుని.. మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details