మనదేశంలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 4 కోట్ల వీధి కుక్కలున్నాయని అంచనా. పట్ణణాలు, నగరాలు, గ్రామాలు ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తుంటాయి. సాధారణంగా కుక్కలు మనల్ని ఏమీ చేయవు గానీ కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. మీద పడి కరిచేస్తుంటాయి. ఇదే రేబిస్ (Rabies disease)కు కారణమవుతోంది. పిల్లుల వంటి జంతువులతోనూ రేబిస్ వచ్చే అవకాశమున్నా రేబిస్ (Rabies disease)తో మరణిస్తున్నవారిలో నూటికి 99 మంది కుక్కకాటు బాధితులే. రేబిస్ (Rabies disease) కారక వైరస్‌ను లిస్సా వైరస్ (Lissa virus) అంటారు. ఇది జంతువుల చొంగలో ఉంటుంది. కుక్క మనల్ని కరిచినా, శరీరం మీద గాయాలున్న చోట నాకినా, దాని చొంగ ద్వారా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో లిస్సా వైరస్ ఉన్న కుక్క కరిస్తేనే అది మనకు సోకుతుంది. అయితే కుక్కలో అప్పటికే వైరస్ ఉందో లేదో చెప్పటం కష్టం. చాలామంది పిచ్చికుక్క కరిస్తేనే రేబిస్ (Rabies disease) వస్తుందని భావిస్తుంటారు గానీ వైరస్ కుక్కలో ఉన్నా దాని ప్రవర్తన మామూలుగానే ఉండొచ్చు. అప్పటికి పిచ్చి కుక్కగా మారకపోయి ఉండొచ్చు. కాబట్టి ఊర కుక్కలు కరిస్తే జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. లిస్సా వైరస్ (Lissa virus) మన ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత 1-3 నెలల్లోపు ఎప్పుడైనా రేబిస్ (Rabies disease) రావొచ్చు. కొందరిలో తొలి వారంలోనే రావొచ్చు. కొందరికి ఏడాది తర్వాతా రావొచ్చు. కాబట్టి కుక్క కరిస్తే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి, తగు చికిత్స తీసుకోవటం అత్యవసరం.
కుక్క కరిచినప్పుడు..
- కుక్క కోరలు మన చేతికి తాకినప్పుడు, పుండ్లు పగుళ్లు వంటివేవీ లేనిచోట నాకినప్పుడు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఆ ప్రాంతాన్ని సరిగా శుభ్రం చేసుకుంటే చాలు.
- రక్తస్రావం లేకుండా కోరలు పైపైన గీరుకున్నా, చర్మం పైపొర లేచి పోయినా వెంటనే పద్ధతి ప్రకారం శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్ (Rabies disease) టీకాలు తీసుకోవాలి.
- కోరలు లోపలికి దిగినప్పుడు, చర్మం చీరుకుపోయినప్పుడు, గాయం నుంచి రక్తం వస్తున్నప్పుడు.. అలాగే శరీరం మీదున్న పుండ్లను కుక్క నాకినప్పుడు, గాయాలకు కుక్క చొంగ తగిలినప్పుడు తీవ్రంగా పరిగణించాలి. వెంటనే పుండును శుభ్రం చేయాలి. రేబిస్ (Rabies disease) ఇమ్యునోగ్లోబులిన్ల టీకాలు తీసుకోవాలి. ఇవి సిద్ధంగా ఉన్న రేబిస్ యాంటీబాడీలు. సత్వరం ప్రభావం చూపిస్తాయి. అలాగే యాంటీ రేబిస్ (Rabies disease) టీకాలు కూడా పూర్తిగా తీసుకోవాలి.
పుండు ఎలా కడగాలి?
కుక్క కరిచిన చోట వైరస్ చాలాకాలం జీవించి ఉంటుంది. కాబట్టి కుక్క కరిచిన వెంటనే.. లేదా వీలైనంత త్వరగా గాయాన్ని ధారగా పడుతున్న నీటి కింద పెట్టి 10-15 నిమిషాల సేపు సబ్బుతో శుభ్రంగా కడగాలి. గాయాన్ని నేరుగా చేత్తో తాకకూడదు. గ్లౌజులు వేసుకుంటే మంచిది. గాయాన్ని పొడిగా తుడిచి, యాంటిసెప్టిక్ లోషన్లు రాసి వదిలెయ్యాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి.