తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అందుకే వెంటనే ప్లాస్మాను దానం చేశాను! - special story on plasma donate

కరోనా బాధితులకు సేవలందిస్తూ దురదృష్టవశాత్తూ అదే వైరస్‌ బారిన పడింది ఓ 25 ఏళ్ల డాక్టర్‌. అయితే మనో ధైర్యంతో ఈ మహమ్మారిపై విజయం సాధించిన ఆమె మళ్లీ కొవిడ్‌ రోగులకు సేవలందిస్తోంది. ఇక కరోనా నుంచి కోలుకున్నాక తన ప్లాస్మాను దానం చేసి తనలాంటి మరికొందరి కరోనా బాధితులకు ప్రాణం పోసిందా కరోనా వారియర్‌. అంతేకాదు చికిత్స పొందుతున్న రోగులకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తోందామె. తద్వారా కొవిడ్‌పై పోరాటంలో నేను సైతం భాగమయ్యానంటున్న ఆ వైద్యురాలి హృదయరాగమేంటో మనమూ విందాం రండి.

special story on plasma donate
అందుకే వెంటనే ప్లాస్మాను దానం చేశాను!

By

Published : Jul 29, 2020, 10:17 AM IST

మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా. కంటికి కనిపించని ఈ వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం మందు లేని ఈ మహమ్మారి నుంచి మానవ జాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేం. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌తో ఆరోగ్యం విషమించిన వారికి ప్రాణదాతలా పనిచేస్తోంది ప్లాస్మా థెరపీ. అందుకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేస్తున్న వారికి పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా చిరంజీవి, నాగార్జున, అమల, సాయిధరమ్‌ తేజ్‌, వెంకటేష్‌ తదితర సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా వేదికగా ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నారు.


మొదట్లో సాధారణ ఫ్లూ అనుకున్నా !

‘హాయ్.. ఓ ఆస్పత్రిలో మెడికల్‌ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న నాకు జూన్‌లో కరోనా సోకింది. అయితే మొదట్లో కేవలం స్వల్పకాలిక లక్షణాలు మాత్రమే ఉండడంతో నేను కూడా దీనిని ఓ సాధారణ ప్లూ అనుకున్నాను. ముందు జాగ్రత్తచర్యగా కొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండిపోయాను. అయితే తర్వాత నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నాకు కొవిడ్‌ వైరస్‌ సోకిందని తేలింది. అయితే నేనేమీ అధైర్యపడలేదు. మానసిక స్థైర్యంతో ఈ మహమ్మారిపై విజయం సాధించాను. ఇందులో భాగంగా సీనియర్‌ వైద్యుల సూచనలతో చికిత్స తీసుకున్నాను. విటమిన్‌-సి అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని హోమియోపతీ మందులను రెగ్యులర్‌గా వాడాను. అదేవిధంగా బెటాడైన్‌ కలిపిన గోరువెచ్చని నీళ్లతో గార్గ్‌లింగ్ (పుక్కిలించడం) చేయడంతో పాటు మూడు సార్లు ఆవిరి పట్టాను.’

అన్నిటికంటే అదే ముఖ్యం!

‘అయితే ఈ మహమ్మారిని జయించాలంటే నేను చెప్పిన ఈ చికిత్స విధానాలతో పాటు మానసిక స్థైర్యం కూడా ముఖ్యమే. ఎవరూ దీని గురించి భయపడద్దు. ఒకవేళ ఆందోళనకు గురైతే మాత్రం మీరు మరింత బలహీనంగా తయారవుతారు. నాకు కరోనా సోకకముందు నేను వైద్యం చేసే రోగులకు కూడా ఇదే చెప్పేదాన్ని. మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతో పాటు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయమని సూచించేదాన్ని.’

ప్లాస్మా దానంతో ఆ భయమంతా పోయింది!

‘కరోనా నుంచి కోలుకున్నాక వెంటనే విధులకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్లే కొద్ది రోజుల క్రితమే నేను మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అయ్యాను. ఇదే సమయంలో ప్లాస్మా థెరపీ ప్రాధాన్యమేంటో నేను పూర్తిగా తెలుసుకున్నా. కరోనాపై పోరులో దాని అవసరమేంటో అర్థం చేసుకున్న నేను వెంటనే ప్లాస్మాను దానం చేశాను. ప్రజలకు సేవ చేసేందుకే నేను ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను. జీవితంలో అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి మంచి పనులు చేసే అవకాశం లభిస్తుంది. అందుకే ఆలోచించకుండా వెంటనే ప్లాస్మాను దానం చేశాను. కరోనా నుంచి కోలుకున్నాక మనసులో ఎక్కడో కొద్ది పాటి భయం ఉండేది. అయితే ప్లాస్మాను దానం చేశాక నా భయాలు, అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రస్తుతం నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో కరోనా బాధితులకు సేవలందిస్తున్నాను. అదేవిధంగా ప్లాస్మా దానంపై నావంతు వారికి అవగాహన కల్పిస్తున్నాను.’

కొంతమంది కరోనా రోగులకు పునర్జన్మ ఇస్తోంది ప్లాస్మా థెరపీ. ఈక్రమంలో కరోనా నుంచి కోలుకుని తన ప్లాస్మాను దానం చేసిందీ డాక్టరమ్మ. అంతేకాదు ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్స చేస్తూ ప్లాస్మాను దానం చేయాలని చెబుతూ తన వంతు అవగాహన కల్పిస్తోంది. మరి కరోనాపై పోరులో భాగమవుతున్న ఇలాంటి కరోనా వారియర్లందరికీ ‘సెల్యూట్’!

ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details