తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

సబ్బులు... పూలూ పండ్లని పొదువుకునీ!

పట్టు లాంటి చర్మానికి... పాలూ పుదీనా! నిగలాడే మోముకి... నిమ్మా మందారం! కాంతులీనే ముఖానికి కుంకుమపువ్వు గుణాలు కలగలిపిన సబ్బులు... అంటూ టీవీలో నిత్యం ప్రకటనలు గుప్పిస్తుంటాయి పలు తయారీ సంస్థలు. అయితే ఇప్పుడు ఆ సబ్బులే ప్రకృతి సిద్ధమైన గుణాలతోపాటు రకరకాల పువ్వుల్నీ, పండ్లనీ, ఔషధాలనీ నేరుగా తనలో పొదువుకుని సరికొత్తగా ముస్తాబవుతున్నాయి. చక్కని రంగుల్లో భిన్నమైన ఆకృతుల్లో ఆకర్షణీయంగా ఉండే వీటిని పిల్లల్నుంచి పెద్దల వరకూ ఎవరైనా వాడుకోవచ్చు.

Special soaps for winter skin care with flowers and fruits
పండ్లు పూలతో సబ్బులు

By

Published : Nov 1, 2020, 12:05 PM IST

చలికాలం చర్మ సంరక్షణ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది గ్లిజరిన్‌ సబ్బులే. వాటికి ఓ ప్రత్యేకత ఉంది. అదే పారదర్శకత. అందుకే ఈ సబ్బుల్ని ఎన్నో రంగుల్లో... మరెన్నో రూపాల్లో అందిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి తయారీ సంస్థలు. అంతేకాదు, ప్రకృతి సిద్ధమైన పూలూ, పండ్లూ, తేనె, పాలూ, పలు మొక్కల నుంచి లభించే గుణాలెన్నింటినో కలగలిపి చర్మాన్ని మెరిపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకునే ఎత్తుగడలూ వేస్తున్నాయి. గాజును మరిపించేంత పారదర్శకంగా ఉండే ఆ సబ్బులు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సహజసిద్ధమైన సుగుణాలతోపాటు పూలూ, పూరేకలూ, పండ్లూ, ఔషధాల వంటి అనేకానేక ప్రకృతి గుణాల్ని తనలో పొదువుకుంటున్నాయి.

పండ్లు పూలతో సబ్బులు

సహజంగా గులాబీ, మందార, చామంతి, లావెండర్‌, కుంకుమ పువ్వు, నిమ్మ, నారింజ... వంటి ఎన్నో రకాల ఎసెన్స్‌నూ, వాటి సువాసనల్నీ జత చేసిన బోలెడు రకాల గ్లిజరిన్‌ సబ్బులు మనకు తెలినవేే. గ్లిజరిన్‌లో ఉండే కొవ్వు పదార్థాలు చర్మానికి తేమనందిస్తే... పూలూ, పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు నిగారింపునూ మృదుత్వాన్నీ అందిస్తాయి. పైగా వాటి నుంచీ వచ్చే ఆ సువా సనలు కూడా మనసునీ తేలిక పరిచి ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే ఇప్పుడు ఈ సుగుణాలన్నీ జత చేయడంతోపాటు గులాబీ, చామంతీ, బంతీ, కుంకుమ పువ్వూ, లావెండర్‌, మందార వంటి పూలనీ... నిమ్మ, నారింజ, కివీ వంటి పండ్లనీ... పుదీనా, తులసీ వంటి ఔషధాలనూ నేరుగా గ్లిజరిన్‌ సబ్బుల్లో చొప్పించేస్తున్నారు. బార్లుగా, షవర్‌ బాంబ్స్‌లా వీటిని పలుఆకృతుల్లోనూ తీర్చిదిద్దుతున్నారు.

పండ్లు పూలతో సబ్బులు

అలా పూలూ పండ్ల అందం... పారదర్శక గుణం ఈ సబ్బుల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేస్తోంది. వీటిని రుద్దుకున్నప్పుడు పూలలోని గుణాలు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఇప్పటికే పలు కంపెనీలు ఈ తరహా సబ్బులు తయారు చేస్తున్నాయి. గ్లిజరిన్‌, అరొమా నూనెలూ, పూలూ, పండ్లూ, కప్‌కేక్‌ మౌల్డ్స్‌ ఉంటే ఇంట్లో కూడా వీటిని చేసుకోవచ్చు. మరి మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలాంటి సబ్బుల్ని అందుబాటులో ఉంచారనుకోండి... వాటి అందానికీ మీ అభిమానానికీ వాళ్లు ముగ్ధులైపోవడం ఖాయం. మరి తెచ్చేసుకుందామా పూలూ పండ్ల సబ్బుల్ని.

ABOUT THE AUTHOR

...view details