తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

వ్యాయామం చేస్తున్నారా? ఈ స్కిన్​కేర్ చిట్కాలు మీ కోసమే..! - skin care tips for those who worksout

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాయామానికి మించిన సాధనం మరొకటి లేదు. ఇలా క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం వల్ల చర్మంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో ముఖంతో పాటు చర్మం మరింత తాజాదనాన్ని సంతరించుకుంటుంది. మృదువుగా తయారవ్వడంతో పాటు ప్రకాశవంతంగా మెరుస్తుంది. అయితే వ్యాయామాలు చేసే సమయంలో కొందరు చర్మ సంరక్షణ గురించి పెద్దగా పట్టించుకోరు. దీనికి తోడు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ముఖంలో ఉన్న మెరుపు మాయమవుతుంది.

skin care tips for those who worksout everyday
వర్కవుట్ స్కిన్ కేర్ చిట్కాలు

By

Published : Mar 21, 2021, 7:55 PM IST

అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ముఖం కొన్నిసార్లు వర్కవుట్లు చేయడం వల్ల ఒక్కసారిగా అందవిహీనంగా తయారవుతుంది. వర్కవుట్లు చేసే సమయంలో కొన్ని మెలకువలు పాటించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.


మేకప్‌ పూర్తిగా తొలగించాకే!

  • మేకప్‌ ఇప్పుడు అందరికీ సర్వసాధారణమైంది. అయితే అలంకరణపై ఉన్న ఆసక్తి దాన్ని తొలగించుకోవడంలో ఉండదు కొందరికి. ప్రత్యేకించి వర్కవుట్లు చేసే సమయంలో తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మేకప్‌ తొలగించుకోకుండా, ముఖాన్ని పూర్తిగా శుభ్రపరచుకోకుండా వ్యాయామాలు చేయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. మేకప్‌లో ఉండే రసాయనాలతో చెమట కలవడం వల్ల మొటిమలు, ర్యాషెస్ లాంటి చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక ఔట్‌డౌర్‌ వర్కవుట్స్కి వెళ్లాల్సి వస్తే... కచ్చితంగా ముఖానికి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. అయితే బయటకు అడుగుపెట్టే 15-20 నిమిషాల ముందే దీనిని అప్లై చేసుకోవాలి.
  • దీంతో పాటు వర్కవుట్‌ సెషన్‌కు ముందు, తర్వాత, వ్యాయామం చేస్తున్న సమయాల్లో కచ్చితంగా కొన్ని స్కిన్‌ కేర్‌ టిప్స్ పాటించాలంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. మరి ఆ మెలకువలేంటో మనమూ తెలుసుకుందాం రండి.
  • వర్కవుట్ ప్రారంభించే ముందు..!
  • వర్కవుట్‌కు వెళ్లేముందు ముఖాన్ని పూర్తిగా శుభ్రపరుచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేకప్‌తో వ్యాయామాలు మొదలుపెట్టద్దు. చర్మతత్వానికి సరిపడా క్లెన్సర్‌తో మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. ఇక జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో మేకప్‌ తొలగించుకునేందుకు సరిపడా సమయం లేకపోతే మేకప్‌ రిమూవల్‌ వైప్స్‌ను వినియోగించడం ఉత్తమం.
  • దీంతో పాటు నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని చర్మానికి రాసుకోవాలి. పెదాలకు లిప్‌బామ్‌ను అప్లై చేయాలి. ఎక్కువ సేపు వర్కవుట్లు చేసినట్లయితే చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు సహకరిస్తాయి.

వర్కవుట్స్ చేస్తున్నప్పుడు..!

  • వ్యాయామం చేస్తున్న సమయంలో వీలైనంతవరకు చేతులతో ముఖాన్ని అసలు తాకద్దు. తరచూ చేతులతో ముఖాన్ని తాకడం వల్ల వర్కవుట్‌ పరికరాలపై ఉన్న దుమ్ము, ధూళి, క్రిములు ముఖ సౌందర్యానికి హాని కలిగిస్తాయి. మొటిమలతో పాటు బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వర్కవుట్స్‌ సమయంలో చేతులను ముఖం నుంచి దూరంగా ఉంచుకోవడం ఎంతో ఉత్తమం.
  • వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో బయటకు వస్తాయి. అయితే చాలామంది ఈ సమయంలో శరీరంపై ఉన్న దుస్తులతోనే ముఖంపై చెమటను తుడుచుకుంటుంటారు. ఇలాంటి విధానాలకి స్వస్తి పలకాలి. లేకపోతే ర్యాషెస్‌, దురద, చికాకు లాంటి సమస్యలు బాధిస్తాయి. ఓ శుభ్రమైన టవల్‌తో ముఖంపై చెమటను ఎప్పటికప్పుడు తుడిచేసుకోవాలి. అలాగే శరీరంలోని ఇతర భాగాలను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే టవల్‌ను ముఖానికి వినియోగించకపోవడం ఉత్తమం. ఇందుకోసం వర్కవుట్‌ బ్యాగ్‌లో ఎప్పుడూ 2, 3 పరిశుభ్రమైన టవల్స్ ఉంచుకోవాలి.
  • వ్యాయామం చేస్తున్న సమయంలో తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండండి. ఎక్కువ సేపు నీరు తాగకుండా ఉంటే బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. నోరు కూడా ఎండిపోతుంది. చెమట కూడా పట్టదు. దీని వల్ల వర్కవుట్స్‌ చేసినా ఎలాంటి ప్రయోజనముండదు.

వర్కవుట్‌ సెషన్‌ పూర్తయిన తర్వాత!

  • వర్కవుట్‌ సెషన్‌ పూర్తయిన వెంటనే చర్మతత్వానికి సరిపోయే మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • చర్మం శుభ్రంగా, తాజాగా ఉండడానికి వీలైనంత త్వరగా స్నానం చేయాలి. లేకపోతే చెమట చర్మాన్ని చికాకు పెడుతుంది.
  • చెమట, మురికితో కూడిన దుస్తులపై బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యాయామ సమయంలో ఉపయోగించిన దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఉత్తమం. బ్యాక్టీరియాలను చంపే గాఢమైన డిటర్జెంట్ లో వీటిని నానబెట్టి శుభ్రం చేయాలి.
  • వ్యాయామం చేసే సమయంలో పుట్టే వేడి కారణంగా ఒక్కోసారి చర్మం కందిపోయి ఎర్రగా మారిపోవచ్చు. ఇలాంటి సమయంలో క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మృదువైన మాయిశ్చరైజర్‌ను పూసుకోవాలి. సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

వీటిని మరవద్దు!

  • వీలైనంత వరకు వ్యాయామ సమయంలో ఆభరణాలు, గడియారం, రిస్ట్‌ బ్యాండ్స్‌ శరీరంపై లేకుండా చూసుకోవాలి. లేకపోతే చెమట కారణంగా అవి బ్యాక్టీరియాలకు కేంద్రకాలుగా మారిపోతాయి. ఫలితంగా పలు రకాల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
  • సైక్లింగ్‌, ఇతర వ్యాయామాలు చేసేటప్పుడు చాలామంది చెవిలో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటుంటారు. ఇది కూడా కొన్ని చర్మ సమస్యలకు దారితీస్తుంది.
  • యోగా, రన్నింగ్‌, వాకింగ్‌, డ్యాన్స్... ఇలా శారీరక శ్రమకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నా ఆ సమయంలో వేసుకునే దుస్తులు సౌకర్యంగా ఉండాలి. చెమటను పీల్చుకోవడంతో పాటు సాగే తత్వాన్ని కలిగి ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా టీషర్ట్‌లూ, ఫోల్డ్‌ ఓవర్‌ యోగా ప్యాంట్లు, ట్రాక్‌సూట్లూ, స్వెట్‌షర్ట్‌లతో పాటు హిప్‌ షేపర్స్‌, ఫంక్షనల్‌ బ్రాలు వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. ఇందులో అవసరానికి తగ్గట్టుగా దుస్తులను ఎంచుకోవాలి.
  • సాధారణంగా జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో వర్కవుట్‌ పరికరాలు, యంత్రాలను చాలామంది వినియోగిస్తుంటారు. కాబట్టి వర్కవుట్‌ ప్రారంభించే ముందు వాటిని యాంటీ బ్యాక్టీరియల్‌ లిక్విడ్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉండే జిమ్‌ పరికరాలకు కూడా ఇది వర్తిస్తుంది.

ఇదీ చూడండి :రోజుకో కొత్త వర్కవుట్​.. ఉంటుంది బాడీ ఫిట్​

ABOUT THE AUTHOR

...view details