తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తోందట! - how to identify corona symtoms

‘హమ్మయ్య.. వ్యాక్సిన్ వచ్చేసింది.. కేసులూ తగ్గుతున్నాయి.. ఇక కరోనా పీడ విరగడైనట్లే!’ అని ఇలా అనుకున్నామో లేదో.. అలా సెకండ్‌ వేవ్‌ రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. పైగా ఈ దశలో వైరస్‌ సోకిన వారిలో సుమారు 95 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించట్లేదని చెబుతున్నారు నిపుణులు. కొవిడ్‌ ఎక్కువ మందికి విస్తరించడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఇక మరోవైపు సాధారణ ఫ్లూ లక్షణాలు, చిన్న పాటి అనారోగ్యాలు కనిపిస్తే.. అది వైరస్‌ వల్ల కాదేమో అన్న చాలామంది నిర్లక్ష్యం కూడా ప్రస్తుతం కరోనా విజృంభణకు ఓ కారణమే అంటున్నారు నిపుణులు. నిజానికి ఇలా మనకు తెలియకుండానే వైరస్‌ మన శరీరంలోకి వచ్చి వెళ్తోందన్నమాట! మరి, ఇంతకీ ఏవి అసలైన కరోనా లక్షణాలు? మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కనిపిస్తే కొవిడ్‌ సోకినట్లుగా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి? ఇలాంటి సందేహాలు మీలోనూ ఉన్నాయా? అయితే వీటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

మనకు తెలియకుండానే కరోనా
మనకు తెలియకుండానే కరోనా

By

Published : Apr 14, 2021, 3:45 PM IST

రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్న వారికి కరోనా అసలు తమ శరీరంలో ప్రవేశించిందన్న విషయం కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈ క్రమంలో లక్షణాలేవీ కనిపించట్లేదు కాబట్టి! అయితే కొంతమందిలో జలుబు, దగ్గు, జ్వరం.. వంటి లక్షణాలున్నా అది వైరస్‌ వల్ల కాదేమోనన్న అనుమానం-వైరస్‌ సోకితే ఎలా అన్న భయంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొంతమందేమో ఇతర అనారోగ్యాలతో కరోనాకు సంబంధం లేదంటూ వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. నిజానికి ఇలా ఈ మూడు అంశాలే ప్రస్తుతం కరోనా శరవేగంగా విస్తరించడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని లక్షణాలుంటే మాత్రం కొవిడ్‌గా పరిగణించి వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వైరస్‌ విస్తృతిని కట్టడి చేయచ్చని చెబుతున్నారు.

కళ్లు ఎరుపెక్కుతున్నాయా?!

సాధారణంగా కళ్లు ఎరుపెక్కడం, దురద పుట్టడం, కంటి నుంచి నీళ్లు కారడం.. వంటి లక్షణాలు కనిపిస్తే కంటికి సంబంధించిన సమస్యలు, ఇతర ఇన్ఫెక్షన్లు, అలర్జీలు కారణమనుకుంటాం. ఒకవేళ దీంతో పాటు జ్వరం, తలనొప్పి.. వంటివి వస్తే కంటి సమస్యల వల్లే ఈ దుష్ప్రభావాలు వచ్చి ఉండచ్చు.. కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు.. అనుకునే వారే మనలో ఎక్కువమంది ఉంటారు. కానీ కళ్లు ఎరుపెక్కడంతో పాటు జ్వరం, తలనొప్పి.. వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయంటే మాత్రం ఇది కరోనా సోకిందనడానికి ఒక సూచిక కావచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఒకసారి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

మతిమరుపా?

ముందు ఊపిరితిత్తులపై దాడి చేసిన కరోనా వైరస్‌.. ఇప్పుడు మన శరీరంలోని ప్రతి అవయవం పైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మెదడు పైనా ఇది చూపే దుష్ప్రభావాలు ఎక్కువే అంటున్నారు నిపుణులు. మనం రోజూ చేసే పనులపై శ్రద్ధ పెట్టలేకపోవడం, మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, చిన్న విషయానికే గందరగోళంగా అనిపించడం.. ఇలాంటి సమస్యలొస్తే మన శరీరంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చినట్లుగా సందేహించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అశ్రద్ధ చేయకుండా అసలు మన శరీరంలో వైరస్‌ ఉందో, లేదో నిర్ధారించుకోవడానికి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం వల్ల ఇటు మీకు, అటు మీ చుట్టూ ఉన్న వారికి మంచిది.

ఆకలి లేకపోయినా..!

ఆకలేయకపోవడం, ఆహారాన్ని చూస్తే వికారం రావడం.. ఇవి మాట్లాడుకోవడానికి చిన్న సమస్యలే అయినా వీటికి కరోనా వైరస్‌ కూడా కారణం కావచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వైరస్‌ పుట్టిన చైనాలో మొదటి కొన్ని వారాల్లో సుమారు 48 శాతం మంది వైరస్‌ బాధితుల్లో ఇలాంటి ఉదర సంబంధిత సమస్యలే వచ్చాయట! అందుకే విరేచనాలు, కడుపునొప్పి, వికారం, ఆకలి లేకపోవడం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.. వంటివి తలెత్తితే అది వైరస్‌ వల్ల కాదేమో అని అలక్ష్యం చేయకుండా ఒకసారి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వల్ల రాబోయే ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నీరసంతో నిస్సత్తువ..!

మనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైనా, ఇంట్లో పని ఎక్కువైనా అలసట, నీరసంగా అనిపించడం సహజమే! మహా అయితే మరుసటి రోజుకు తిరిగి యాక్టివ్‌గా మారిపోతాం. కానీ అలా జరగకుండా మూడు నాలుగు రోజుల పాటు విపరీతమైన అలసట, నీరసం వేధిస్తే.. ‘అదే తగ్గిపోతుందిలే’ అని ఊరుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కరోనా వైరస్‌ సోకడం వల్ల కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఇలాంటప్పుడు వెంటనే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే సకాలంలో చికిత్స తీసుకొని దీన్నుంచి బయటపడచ్చంటున్నారు. అలాకాకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ వైరస్‌ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా కుంగదీస్తుందట! కేవలం వైరస్‌ సోకిన తర్వాతే కాదు.. వైరస్‌ నుంచి కోలుకున్నా ఈ అలసట అంత త్వరగా బాధితుల్ని వదలట్లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి దీన్నుంచి త్వరగా బయటపడాలంటే నిపుణుల సలహాలు క్రమం తప్పకుండా పాటించడం మంచిది.

ఇక వీటితో పాటు తీవ్ర జ్వరం, నిరంతరాయంగా వేధించే పొడి దగ్గు, ఛాతీ పట్టేయడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం.. తదితర సమస్యలుంటే మాత్రం వెంటనే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

ఈ టెస్టు ద్వారా తెలుస్తుందట!

మాకు ఎలాంటి లక్షణాలు లేవు.. కానీ వైరస్‌ వచ్చిందో, లేదో తెలుసుకునేదెలా? అంటే.. అందుకు యాంటీబాడీ టెస్ట్‌ చేయించుకోవడం అత్యుత్తమమైన మార్గం అని చెబుతున్నారు నిపుణులు. రక్తపరీక్ష ద్వారా ఈ యాంటీ బాడీస్‌ని గుర్తిస్తారు. గతంలో వైరస్‌ సోకిన వారి రక్తంలో ఈ యాంటీ బాడీస్‌ విడుదలవుతాయి. ఈ ప్రతిరోధకాలు వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. కాబట్టి రక్తంలో ఇవి ఉన్నాయంటే గతంలో వైరస్‌ సోకినట్లుగా భావించచ్చంటున్నారు నిపుణులు. అయితే మళ్లీ వైరస్‌ బారిన పడకుండా ఇవి రక్షిస్తాయా? అంటే.. అది కచ్చితంగా చెప్పలేమంటున్నారు. కానీ కొన్ని అధ్యయనాలు మాత్రం యాంటీ బాడీస్‌ ఉన్న వారు తిరిగి వైరస్‌ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నాయి.

ఏదేమైనా.. ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా, ఎలాంటి లక్షణాలు కనిపించినా కీడెంచి మేలెంచమంటున్నారు నిపుణులు. అంటే ‘అది వైరస్‌ వల్ల కాదేమో!’ అని నిర్లక్ష్యం చేయకుండా.. ‘వైరస్‌ కారణంగానే ఇలా జరుగుతుందేమో’నని భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోమంటున్నారు. ఫలితంగా ఇటు మీకు, అటు మీ వల్ల మీ చుట్టూ ఉన్న వారికీ ప్రమాదం లేకుండా జాగ్రత్తపడచ్చు. అయితే వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి ముందు ఒకసారి మీ ఫిజీషియన్‌ సలహా కూడా తీసుకుంటే మీకు పరీక్ష అవసరమా? కాదా? అన్న విషయం వారు చెబుతారు.

ఇదీ చూడండి: వ్యాయామం అలవాటు లేదా?- కొవిడ్ ముప్పు ఎక్కువే!

ABOUT THE AUTHOR

...view details