తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

కునుకు పట్టదు.. మనసు కుదుటపడదు - reasons and solution for insomnia problem

మనసారా నిద్రపోయి ఎన్నాళ్లయిందో.. ఇటీవల కాలంలో చాలామంది నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇది. ఉరుకుల పరుగుల జీవితం, మారిన జీవన శైలి...కరోనా కారణంగా తలెత్తిన ఇబ్బందులు..ఇలా కారణాలేవైనా ఎక్కువ మంది నిద్రకు దూరమైనట్టు అనేక అధ్యయనాలూ తేల్చాయి. వీటికి తోడు లాక్‌డౌన్‌ అనేక రంగాలపై ప్రభావం చూపింది. ఎందరో చిరుద్యోగులు ఉద్యోగాలు, తద్వారా బతుకుపై భరోసాను కోల్పోయారు. కళ్లెదుటే తమ ఆత్మీయులకు దూరమైన వారూ ఉన్నారు. వారందరూ కునుకుకు దూరమయ్యారని, యువకుల నుంచి వయోధికుల వరకూ అందర్నీ నిద్రలేమి సమస్య వేధిస్తున్నట్టు తమ పరిశీలనలో తేలిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 60 శాతం మందిని ఏదో ఒక రూపంలో నిద్రలేమి వేధిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలో సమస్యకు అసలు కారణాలేమిటి? దాన్ని ఎలా అధిగమించాలి? వైద్యులు ఏం చెబుతున్నారు?

reasons and solution for insomnia problem
నిద్రలేమి సమస్యకు పరిష్కారం

By

Published : Jan 7, 2021, 6:37 AM IST

నిత్యం జాగారమే!

నగరాల్లో నిత్యం పరుగులుతీసే జీవన విధానం. పగలు, రాత్రి తేడా లేకుండా పని వేళలు ఉండటం, పోటీలో ముందుండాలనే ఆలోచన, శారీరక శ్రమ తగ్గటం, మానసిక ఒత్తిళ్లు పెరగటం, సమయానికి ఆహారం తీసుకోపోవటం వంటివి అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇవన్నీ క్రమేపీ నిద్రలేమి సమస్యకు దారితీస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉండటం, స్మార్ట్‌ఫోన్లు, పార్టీల్లో మునిగితేలుతుండటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళన, కుంగుబాటు, జీవనశైలి నిద్రలేమికి కారణమని అధ్యయనాలూ చెబుతున్నాయి. వీటన్నింటినీ మించి కరోనా మహమ్మారి ఎక్కువ మందిని నిద్రకు దూరం చేసినట్టు తమ పరిశీలనలో గుర్తించామని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. అలాంటి బాధితులంతా నిద్రకోసం మద్యం, నిద్రమాత్రల వంటి వాటిని ఆశ్రయించినట్టు కూడా తేలిందని వారు పేర్కొంటున్నారు. ఈ అలవాటును ఎక్కువ కాలం కొనసాగించే వారు భవిష్యత్తులో పలు వ్యాధులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ‘లాక్‌డౌన్‌ ముందు వరకూ ప్రణాళికతో సాగిన జీవితాలు తారుమారయ్యాయి. భవిష్యత్తుపై ఆందోళన అధికమైంది. ఇది ఆందోళన, నిద్రలేమికి కారణమవుతోంది. కొవిడ్‌ తగ్గిన తర్వాత వచ్చే సమస్యల్లో నిద్రలేమి ప్రధానంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు చికిత్స పొంది వచ్చిన అధికశాతం మందిలో బలహీనత, మానసిక ఆందోళన కన్పిస్తోంది.’ అని హైదరాబాద్‌కు చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ హరీష్‌చంద్రారెడ్డి తెలిపారు.

అధ్యయనం చెప్పిన కఠోర నిజాలు

కరోనా సమయంలో హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రయివేటు ఆసుపత్రి నిద్రలేమి సమస్యపై తమ వద్దకు వచ్చే రోగులపై ఓ అధ్యయనం నిర్వహించింది. హైదరాబాద్‌, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తదితర నగరాల్లోని తమ ఆసుపత్రుల వద్దకు వచ్చిన 1500-1650 మంది అవుట్‌ పేషెంట్ల (ఓపీ)లో సుమారు 1100-1220 మంది తాము 2-3 నెలలుగా నిద్రకు దూరమైనట్టు చెప్పారని తేల్చింది. ‘వీరిలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేనివారు సుమారు 1,000 మంది వరకూ ఉండటాన్నిబట్టి..ఇంకేదో భయం, తెలియని ఆందోళన వారిని నిద్రకు దూరం చేసినట్టు నిర్ధారణకు వచ్చాం. 10-20 శాతం మంది ఈ సమస్యతో వాహనాలు నడుపుతూ ప్రమాదానికి గురవుతున్నట్టు గుర్తించాం. వీరి నిద్రలేమికి అర్ధరాత్రి వరకూ పార్టీలు, స్నేహితులంటూ నిద్రా సమయాన్ని దాటేయటమే కారణమని తేలింది. మారిన అలవాట్లు, మానసిక ఆందోళన వంటివి ఎక్కువ మందిలో నిద్రలేమికి కారణాలనే అంచనాకు వచ్చాం’ అని అధ్యయనం నిర్వహించిన ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గతేడాది ఓ పరుపుల తయారీ సంస్థ జరిపిన సర్వేలోనూ హైదరాబాద్‌, విశాఖపట్నం, కరీంనగర్‌, వరంగల్‌ తదితర నగరాల్లో 12 శాతం మంది నిద్రలో గురక, శ్వాసపరమైన ఇబ్బందులతో నిద్రలేమికి గురైనట్టు తేల్చడం ప్రమాద సూచికే.

షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌తో జాగ్రత్త

రాత్రివేళల్లో విధులు నిర్వర్తించే వారు ఎదుర్కొనే నిద్రలేమి సమస్యను షిఫ్ట్‌వర్క్‌ డిజార్డర్‌ అంటారు. ఒక వ్యక్తి నెలలో 15 రోజులు రాత్రి, మిగిలిన సగం రోజులు పగలు విధులు నిర్వహించే పక్షంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామున 3-4 గంటలకు నిద్రపోవాలంటే ఐదు గంటల ముందు కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు.

నిద్రమాత్రలతో జాగ్రత్త సుమా..

ఇటీవల చాలామంది నిద్రపట్టేందుకు మాత్రలు వాడుతున్నారు. వైద్యుల సిఫార్సుతో సంవత్సరాల తరబడి వాడుతున్న వారూ ఉన్నారు. వైద్యుల సూచన లేకుండా నిద్రమాత్రలు వాడటం మంచిది కాదు. ఐదేళ్లు నిద్రమాత్రలు వాడిన వారికి, మాత్ర లేకుండా నిద్రపట్టేలా చేసేందుకు 1-2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం పడుతుంది. ఈ సమస్య ఉన్న వారు వైద్య నిపుణులను సంప్రదిస్తే వారు, నిద్రలేమి సమస్యను క్రమంగా తగ్గించేలా చేస్తారు. ఇండియన్‌ స్లీప్‌ డిజార్డర్స్‌ అసోసియేషన్‌(ఐఎస్‌డీఏ), అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ స్లీప్‌ మెడిసిన్‌ (ఏఏఎస్‌) చెబుతున్న మాట ఇది.

లాక్‌డౌన్‌ భయంతో

లాక్‌డౌన్‌ సమయంలో 57 శాతం మంది నిద్రలేమి సమస్య పరిష్కారం కోసం అంతర్జాలంలో వెతికినట్టు ఆమెరికాలోని ఓ అధ్యయన సంస్థ పేర్కొంది. ఇది తాత్కాలిక సమస్యగా కనిపించినా మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గుర్తించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్ర..ఎలా ఉండాలి

* నిద్రలో రెండు రకాలుంటాయి. అందులో మొదటిదైన ఎన్‌ఆర్‌ఈఎం(నాన్‌ రాపిడ్‌ ఐ మూమెంట్‌)లో శరీరం ఉపశమనం పొందుతుంది. రెండోదైన ఆర్‌ఈఎం(రాపిడ్‌ ఐ మూమెంట్‌)లో గాఢ నిద్రపడుతుంది.

* సాధారణంగా మొదటి ఐదు గంటలతో పోలిస్తే.. చివరి 2-3 గంటల్లో బాగా నిద్రపడుతుంది.

* దఫాల వారీగా కాకుండా ఎవరైనా ఏకబిగిన ఏడు గంటలు నిద్రపోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇలా బయటపడదాం

అపోలో ఆసుపత్రి పల్మనాలజిస్టు, స్లీప్‌ డిజార్డర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ చెన్నంశెట్టి నిద్రలేమి నివారణ మార్గాలను వివరించారు.

* పడక గదిలో టీవీలు, ల్యాప్‌ట్యాప్‌ల వంటివి ఉంచవద్దు.

* నిద్రకు ఉపక్రమించే 1-2 గంటల ముందు అధిక కాంతినిచ్చే దీపాలు ఆర్పివేయాలి. అతి తక్కువ కాంతి ఉండేవే వినియోగించాలి.

* సాయంత్రం 5 గంటల తరువాత కాఫీ/టీ/ధూమపానం వంటివి నిద్రపై ప్రభావం చూపుతాయి.

* గురక సమస్యలున్న వారు అల్కాహాల్‌ తీసుకోవటం వల్ల నిద్రలేమి తీవ్రత పెరుగుతుంది.

* నిద్రకు ముందు కఠినమైన కసరత్తులు, ఎక్కువ దూరం నడవటం చేయకూడదు.

* అధిక ఆహారం తీసుకుని నిద్రపోకూడదు. అలా చేస్తే మైక్రోయాస్ఫిరేషన్‌ (తిన్న ఆహారం తిరిగి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం) సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల దీర్ఘకాలంలో దగ్గు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది

* ఆహారానికి, నిద్రకు మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి.

క్రమంగా సమస్యను అధిగమిద్దాం

నిద్రలేమి సాధారణ సమస్యగా మారింది. 30 శాతానికి పైగా ప్రజలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలు నిద్రకు ప్రధాన శత్రువులు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో తలెత్తే సమస్యలు కూడా నిద్రపై ప్రభావం చూపుతున్నారు. ఉదాహరణకు ఏలూరులో ఇటీవల జరిగిన ఘటన అక్కడి ప్రజలకు కొన్నిరోజులు కునుకులేకుండా చేసింది. మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గించుకోవటం, శారీరక వ్యాయామం, రాత్రి వేళ 7-9 గంటల మధ్యలో నిద్రకు ఉపక్రమించటం వంటి అలవాట్లతో సమస్యను అధిగమించవచ్చు.

- డాక్టర్‌ బుచ్చిరాజు గరుడ, న్యూరో విభాగ అధిపతి, కేజీహెచ్‌, విశాఖపట్నం

ABOUT THE AUTHOR

...view details