తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మార్కెట్​లోకి సరికొత్త ఛాలెంజ్​... ఇది పర్యావరణహితమండోయ్​..! - plastic free environment

ఐస్‌ బకెట్‌ దగ్గర్నుంచి రియల్​మ్యాన్​ ఛాలెంజ్​ వరకూ అనేక సవాళ్లను‌ చూశాం. తాజా సవాలేంటో తెలుసా? ‘ప్లాస్టిక్‌ ఫ్రీ జులై’ ఛాలెంజ్‌. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడానికీ.. వీధులని, సముద్రాలని ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా మొదలయిన పర్యావరణ ఉద్యమం ఇది. మీరూ ఇందులో పాల్గొని సవాల్‌ విసరాలని అనుకుంటున్నారా? అయితే ఏం చేయాలో తెలుసుకోండి. ఎలా చేయాలో చూడండి...

plastic free july challenge in australia is become famous in world
మార్కెట్​లోకి సరికొత్త ఛాలెంజ్​... ఇది పర్యావరణహితమండోయ్​..!

By

Published : Jul 2, 2020, 5:50 PM IST

మనం ఉండే ఇంటినే కాదు.. చుట్టపక్కల ప్రాంతాలనీ మనకు చేతనైనంతలో ప్లాస్టిక్‌ రహితంగా చేయగలిగితే? భవిష్యత్తులో మన నివాస ప్రాంతాలు, సముద్రాలు ప్లాస్టిక్‌ కాలుష్యంతో నిండిపోకుండా ఉంటాయి అంటోంది ఈ పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించిన రెబెక్కా ప్రిన్స్‌. ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా రెండేళ్ల క్రితం ప్లాస్టిక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వాడకం పట్ల అవగాహన తీసుకొస్తోంది. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ‘ప్లాస్టిక్‌ ఫ్రీ జులై’ ఛాలెంజ్‌. 177 దేశాలకు చెందిన 12 కోట్ల మందిని ఈ ఛాలెంజ్‌ ప్రభావితం చేసింది. ఇందులో పాల్గొన్న వాళ్లు టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వినియోగానికి చెక్‌ చెప్పడమే కాకుండా... పునర్వినియోగాన్ని పెంచారు.మీరూ చేయాలనుకుంటున్నారా?

ఇంట్లో, స్కూల్ల్లో, ఆఫీసులో, రెస్టారెంట్లు లేదా కేఫుల్లో... ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులని తిరిగి వాడకూడదు. వీలైనంత వరకూ పునర్వియోగాన్ని ప్రోత్సహించాలి.ప్రయాణాల్లో వాటర్‌ బాటిళ్లని కొని పారేసే బదులు... ఇంటి నుంచే వాటర్‌బాటిల్‌ని నీటితో నింపుకొని వెళ్లండి.

సూపర్‌మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడ దొరికే ప్లాస్టిక్‌ సంచుల్లో పచారీ సరకులని నింపేయకుండా... వెంట నూలు సంచులని తీసుకెళ్లడం, పచారీ సరకులని సీసాలు, జార్లలో నింపి తెచ్చుకోవడం మంచి పద్ధతి.

ప్లాస్టిక్‌ స్ట్రాలు, చెంచాలు, ఫోర్క్‌లు, ఇయర్‌ బడ్స్‌, లంచ్‌బాక్సుల వాడకాన్ని తగ్గించాల్సిందే. వీలుకాని పరిస్థితుల్లో మళ్లీమళ్లీ వాడే మెటల్‌ స్ట్రాలు, స్టీల్‌ చెంచాలు, బాక్సులని ఎంచుకోవాలి.

ప్లాస్టిక్‌ షేవింగ్‌ బ్రష్‌లు, టూత్‌బ్రష్‌లు, దువ్వెనల స్థానంలో చెక్క వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి భూమిలో త్వరగా కలిసిపోతాయి. సముద్ర జీవులకు హాని తగ్గుతుంది.

పిల్లలకు వాడే పాల సీసాలు ప్లాస్టిక్‌వి కాకుండా... గాజు, స్టీల్‌, సిలికాన్‌వి ఎంచుకోవాలి. డైపర్లకు బదులు వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించాలి.

ప్లాస్టిక్‌ డబ్బాల్లో నింపిన షాంపూలు, సబ్బులు వాడే బదులు... ఇంట్లో రీటా, మెంతులు వంటి వాటితో చేసిన పొడులు లేదా డ్రైషాంపూల వాడకం వల్ల ప్లాస్టిక్‌ వాడకం తగ్గడంతోపాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఇవేకాదు సంఘటితంగా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు, ఆఫీసుల్లో కూడా ప్లాస్టిక్‌ని దూరం చేయడానికి బోలెడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ప్లాస్టిక్‌ ఫ్రీ జులై. ఆర్గ్‌లోకి వెళ్తే సరి. అక్కడ బోలెడు విజయగాథలున్నాయి మీలో స్ఫూర్తినింపడానికి.

ABOUT THE AUTHOR

...view details