తక్కువ కెలొరీల చక్కెర... వచ్చేస్తోందోచ్! - చక్కెర వ్యాధిగ్రస్థులకు తక్కువ కెలొరీల చక్కెర
‘ఇంకొక్కటి తీసుకుంటే...’ తీయని పాకంలో మునిగి నిగనిగలాడుతున్న గులాబ్‌జామ్‌లను చూస్తూ రెండిటితో సరిపెట్టుకోవడం సాధ్యమా! అలాగని మరొకటి నోట్లో వేసుకుందామంటే- కోపంగా చూస్తున్న శ్రీమతీ, జేబులో చేయిపెడితే గుచ్చుకుంటున్న షుగర్ మాత్రలూ, డాక్టరు మందలింపులూ... వరసగా గుర్తొస్తాయి. నోరుకట్టుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోక తప్పదు. మనదేశంలో దాదాపు ఎనిమిది కోట్ల మంది షుగర్ పేషెంట్ల పరిస్థితి ఇదే. మీ కోసమే శాస్త్రవేత్తం ఓ శుభవార్త చెబుతున్నారు. అదేంటంటే?
తక్కువ కెలొరీల చక్కెర... వచ్చేస్తోందోచ్!
By
Published : Mar 21, 2021, 1:27 PM IST
తీపి ఇష్టపడే వారందరికీ ఓ శుభవార్త చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడిక ఏ స్వీట్ అయినా కొంచెం తినగానే తృప్తిగా ‘ఇక చాలు’ అనిపించే తీయని చక్కెర వచ్చేస్తోంది. అవును... తక్కువ కెలొరీలూ ఎక్కువ తీయదనం ఉండేలా చక్కెర ప్రయోగశాలలో సరికొత్తగా ముస్తాబవుతోంది.
చక్కెరా, దాంతో చేసిన తీపి వస్తువులు ఏవైనా... తలచుకోగానే నోరూరుతుంది. ఏ శుభవార్త అయినా పక్కన స్వీటు ఉంటేనే దానికి నిండుదనం. ప్రత్యేకించి ఆ మిఠాయిల్ని పంచదారతో చేస్తే ఇక చెప్పక్కరలేదు.
ఆ నునుపూ... ఆ మెరుపూ...
చూడగానే నోట్లో ఏదేదో అయిపోతుంది. అలా తీసి నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచి... ఎక్కడికో తీసుకుపోతుంది. ఆ అద్భుతమైన అనుభూతి కోసమే తీపి తరచూ తినాలనుకుంటాం. తినే సందర్భం కోసం వెతుక్కుంటాం. ఎవరే మంచి వార్త చెప్పినా ‘మరి స్వీటేదీ’ అని నిర్మొహమాటంగా అడిగేస్తాం.
పుట్టినరోజనో, ఉద్యోగం వచ్చిందనో, పెళ్లి నిశ్చయమైందనో, పాప పుట్టిందనో, పిల్లవాడికి మంచి మార్కులు వచ్చాయనో... ఇలా ప్రతి సందర్భాన్నీ స్వీటుతో జరుపుకునే మనకి పండగలూ, పెళ్లిలాంటి వేడుకలూ అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. మిఠాయి దుకాణమే ఇంటికి నడచి వచ్చేస్తుంది.
అవును... ‘తీపి’ వేడుక లాంటిదే. ప్రత్యేక సందర్భాల్లాగా అప్పుడప్పుడూ మాత్రమే తినాల్సినది. కానీ అదేమిటో చాలామందికి తరచూ తినాలనిపిస్తుంది. అందుకు కారణం- సంతోషం కలిగినప్పుడు పిల్లలు కేరింతలు కొట్టినట్లు, తీపి తగిలినా, దాన్ని తలచుకున్నా నాలుక మీద రుచి మొగ్గలు ఎగిరిగంతేస్తాయి. ఇంకా ఇంకా కావాలంటాయి. వాటికి లొంగిపోయి ఏ పోషకాలూ లేనిదాన్ని ఇష్టంగా ఆహారంలోకి తెచ్చుకున్నాం. కడుపు సంగతి మర్చిపోయి నోటి తృప్తికోసం రకరకాల తీపి పదార్థాలు తినేస్తున్నాం... ఫలితం అనుభవిస్తున్నాం.
అచ్చంగా ‘చక్కెర’ ఒక వ్యాధి పేరై కూర్చుని ప్రపంచాన్ని వణికించడం మొదలెట్టాక కానీ ఈ ‘తీయని శత్రువు’ని గెలిచేదెలా అన్న సందేహం రాలేదు. అప్పటినుంచి చక్కెరకి ప్రత్యామ్నాయం కోసం పరిశోధకులు ప్రయోగశాలల్లో వెతుకుతూనే ఉన్నారు. కొన్నిటిని తయారుచేశారు కానీ, చక్కెర రుచికి బానిసై పోయిన మనిషికి అవి రుచించలేదు. పైపెచ్చు వాటి వల్ల లేనిపోని సమస్యలూ వస్తున్నాయి. అందుకని ఇంకా సరైన ప్రత్యామ్నాయం కోసం పరిశోధన కొనసాగించిన శాస్త్రవేత్తలు ఈ మధ్యే కొన్ని కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెచ్చారు.
చక్కెరకు ప్రత్యామ్నాయమా?
ప్రత్యామ్నాయం కాదు, చక్కెరనే రీడిజైన్ చేశారు. అంటే- చక్కెర అదే... చెరుకురసం నుంచి తయారుచేసిందే. కాకపోతే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో దాని రసాయన నిర్మాణాన్ని మార్చారు. అలా మార్చడం వల్ల చక్కెర రూపంలో, రంగులో, రుచిలో ఏ మార్పూ రాలేదు కానీ, తీయదనం పెరిగిందట. దాంతో ఈ కొత్త చక్కెర సగమే సరిపోతుందట. టీలో చెంచా వేసుకునేవారు అరచెంచా వేసుకుంటే చాలు అదే తీపి ఉంటుందట. దాంతో ఇప్పటివరకూ ఇబ్బందిపెడుతున్న చక్కెరతో వచ్చే కెలొరీలూ సగానికి తగ్గిపోతాయి కాబట్టి దానివల్ల వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చనీ అంటున్నారు తయారుచేసిన సంస్థ వాళ్లు.
ఎవరు తయారుచేశారు?
ఇజ్రాయెల్‌కి చెందిన డూమటాక్ కంపెనీ ‘ఇన్‌క్రెడో’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన చక్కెర సాధారణ పంచదార కన్నా రెట్టింపు తీయగా ఉంటుందట. దాంతో చక్కెర వాడే వంటకాల్లో దీన్ని వాడితే 40 నుంచి 50శాతం చక్కెర మోతాదు తగ్గించేయొచ్చనీ, రుచి మాత్రం ఎప్పటిలానే ఉంటుందనీ చెబుతోంది సంస్థ. ‘టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్’- అంటే తీపి తిన్న అనుభూతి మనకి ఎలా లభిస్తుందో సరిగ్గా అక్కడే ప్రభావం చూపేలా దీన్ని తయారుచేశారు. చాకొలెట్లు, కుకీలు, కేకులు... ఇలా చక్కెరతో చేసే పదార్థాలన్నిటిలోనూ తమ ఇన్‌క్రెడో పంచదారని వాడి తయారుచేస్తోంది ఈ కంపెనీ. వీటి రుచికీ మామూలు చక్కెరతో చేసినవాటికీ ఏమాత్రం తేడా లేదని నిపుణులు సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. ఇదొక్కటే కాదు, ఇజ్రాయెల్‌లో చాలా కంపెనీలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి.
అవేం తయారుచేస్తున్నాయి?
ఇజ్రాయెల్‌లో ఆహార పరిశ్రమకు సంబంధించి డూమటాక్‌తో పాటు ఇంకా కొన్ని వందల స్టార్టప్‌లు ఉన్నాయి. వాటిల్లో- అమై ప్రొటీన్స్, లాంపడాస్ ఇంటర్నేషనల్, ఉనావూ, ఏ1సీ ఫుడ్స్... లాంటి సంస్థలన్నీ కొత్త చక్కెరను ఆవిష్కరించడానికి తమ వంతు పరిశోధనలు చేస్తున్నాయి. చెరకు నుంచే కాకుండా పండ్లూ దుంపల నుంచి కూడా చక్కెరను తయారుచేస్తున్నాయి. చక్కెర కన్నా ఎన్నో రెట్లు తియ్యగా ఉండే జీరో కెలొరీ ప్రొటీన్‌ను పండ్ల నుంచి తయారుచేసిన అమై పెప్సీలాంటి శీతలపానీయాల కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. 2025కల్లా తమ పానీయాల్లో చక్కెర శాతాన్ని సగానికి సగం తగ్గించేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెప్సీకి ఇప్పుడు రుచి తగ్గకుండా చక్కెర పరిమాణం తగ్గించడం చాలా అవసరం మరి. టేబుల్‌టాప్ స్వీటెనర్ల స్థానాన్ని భర్తీ చేయడానికి పొడిరూపంలోనూ, ట్యాబ్లెట్ రూపంలోనూ ఇట్టే కరిగిపోయే వెజిటబుల్ ప్రొటీన్‌ని తయారుచేసింది ‘లాంపడాస్’. హోటళ్లలో కాఫీలో కలుపుకోడానికి ఇచ్చే పంచదార పాకెట్ లాగే ఉండే ‘హేలో’ని మార్కెట్లో ప్రవేశపెట్టింది ‘ఉనావూ’. ఓ చెట్టు నుంచి తయారుచేసిన ఈ తీయని పొడిలో పీచు కూడా ఎక్కువే ఉంటుందట. ఏ1సి ఫుడ్స్ అనే కంపెనీ మరొకడుగు ముందుకు వేసి ఆహారపదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్‌ని తగ్గించే ఫార్ములాని కనిపెట్టింది. ఈ ఫార్ములా వల్ల కార్బోహైడ్రేట్లు తగ్గి కృత్రిమ స్వీటెనర్లు కలపనక్కర లేకుండానే తీయగా ఉంటాయట. దాంతో ‘ఈట్‌సేన్’ పేరుతో బ్రెడ్డూ చాక్లెట్లూ లాంటివి తయారుచేస్తోంది. ప్రజలకు అలవాటైన చక్కెర తీయదనమూ, రుచీ ఏమాత్రం తగ్గకుండా దాని ప్రభావం మాత్రం తక్కువ ఉండేలా పదార్థాలను తయారుచేయడమే ఆశయం- అంటున్నాయి ఈ కంపెనీలన్నీ. లక్షా పాతికవేల కోట్ల రూపాయల ఈ పరిశ్రమ ఆవిర్భావానికి కారణం- ప్రజల్లో చక్కెర వాడకం పట్ల చైతన్యం పెరగడమూ, చక్కెర పన్ను విధిస్తూ ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడమూను.
తీపి తింటే ఏమవుతుంది?
తీపి పదార్థాలు తిన్నప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోన్ తయారై ఇంకా ఇంకా తినమంటుంది. తినగానే ఉత్సాహంగా అనిపిస్తుంది. కాబట్టి కొంత పరిమాణంలో తీపి తినడం అవసరమే. అయితే- చక్కెర అనేది ఆహారం కాదు. అందులో విటమిన్లూ, ఖనిజాలూ లాంటి శరీరానికి అవసరమైన పోషకాలేమీ ఉండవు. కానీ కెలొరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కెలొరీలను వెంటనే కరిగించకపోతే కొవ్వుగా మారి బరువును పెంచుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు తీసుకోవాల్సిన చక్కెర- పురుషులు 8 టీస్పూన్లు(36 గ్రాములు), స్త్రీలు 6 టీస్పూన్లు(25గ్రాములు) మాత్రమే. మనదేశంలో తలసరి చక్కెర వాడకం ఏడాదికి 18 కిలోల పైమాటేనని లెక్కలు చెబుతున్నాయి. తీపి ఎక్కువ తింటే స్థూలకాయం వస్తుంది. అది గుండె జబ్బులూ, మధుమేహం లాంటి వ్యాధులకు దారితీస్తుంది. చర్మం ముడతలు పడుతుంది. కుంగుబాటూ మానసికాందోళనా మతిమరపువ్యాధీ పెరుగుతాయి. పైగా రకరకాల రూపాల్లో చక్కెర శరీరంలోకి చేరడం వల్ల మూత్రపిండాలూ కాలేయాల పనితీరు దెబ్బతింటుంది. మెదడు ఆకలి తీరిందీ లేనిదీ గుర్తించలేదు. ఇవన్నీ తెలియక, స్వీట్లు తింటే దంతాలు పాడైపోతాయని చెప్పి పిల్లల్ని మాత్రం కంట్రోలు చేస్తున్నారు కానీ పెద్దలు తమ సంగతి చూసుకోవడం లేదంటోంది ఒక అధ్యయనం.
ఏమిటది?
నిజానికి పిల్లల కన్నా ఎక్కువ తీపి తింటున్నది పెద్దలేనట. ఆ మధ్య మన దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజల ఆహారపుటలవాట్ల మీద జరిగిన ఒక అధ్యయనంలో 36-59 మధ్య వయసు వారు ఎక్కువ తీపి తింటున్నట్లు తేలింది. వారి తర్వాత స్థానం అరవయ్యేళ్లు పైబడిన వారిదట. పిల్లలూ యువతే తక్కువ తింటున్నారనీ వాళ్లని మనం అనవసరంగా ఆడిపోసుకుంటున్నామనీ అంటోంది ఈ అధ్యయనం. పైగా పెద్దవారిలోనూ పురుషుల కన్నా స్త్రీలే సగటున ఓ రెండు గ్రాములు ఎక్కువ తీపి తింటున్నారట. పరిశోధనా రంగంలో పేరొందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, జాతీయ పోషకాహార సంస్థ, ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్- ఇండియా అనే సంస్థలు కలిసి చేసిన అధ్యయనం ఇది. వరల్డ్ అట్లాస్ లెక్కల ప్రకారం తీపి ఎక్కువగా తినే టాప్ టెన్ దేశాల్లో మన దేశం లేదు, అయినా దేశంలో చక్కెర వాడకం మాత్రం ఏయేటికాయేడు పెరుగుతూనే ఉందట. విదేశాల్లో అయితే చాలా ఆహారపదార్థాలు కొనుక్కుని తినేవే కాబట్టి లెక్కలు తీయడం తేలిక. మనం ఇళ్లల్లో చేసుకుని తినేవే ఎక్కువ కాబట్టి తలసరి చక్కెర వాడకం లెక్కలు అంత తేలిగ్గా తేలేవి కావు. పైగా ఒక్క మిఠాయిల రూపంలోనే కాదు, మనకు తెలియకుండానే ఇంకా ఎక్కువ రూపాల్లో చక్కెర మన శరీరంలోకి ప్రవేశిస్తోంది.
వేరే రూపాల్లోనా... ఎలా?
ఆరోగ్యకరమైన, పోషకాలనిచ్చే ఆహారానికి రుచికోసం కృత్రిమ స్వీటెనర్లను జతచేయడం వల్ల నష్టం లేదని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. దానివల్ల చక్కెర వాడకం తగ్గుతుందనుకున్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకెట్లలో దొరికే రెడీమేడ్ ఆహారపదార్థాల్లో వాటిని ఎక్కువగా వాడడమూ మొదలెట్టారు. అయితే ఇటీవల వెలువడిన ఒక అధ్యయనంలో కృత్రిమ స్వీటెనర్లు జీర్ణవ్యవస్థకు ఎంత హాని చేస్తున్నాయో తెలిసింది. ఆహార భద్రత శాఖ అనుమతులు ఉన్న శాకరిన్, సూక్రలోజ్, ఆస్పర్టేమ్, నియోటేమ్, అడ్వాంటేమ్, అసెసల్ఫేమ్ పొటాషియం-కె... లాంటి ఆరు ప్రధాన కృత్రిమ స్వీటెనర్ల ప్రభావంపై సింగపూర్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేశారు.
అన్నవాహికలోని మంచి బ్యాక్టీరియాకి ఈ పదార్థాలు ఒక్క మిల్లీగ్రాము తగిలినా చాలు ఆ బ్యాక్టీరియా విషపూరితంగా మారి పోతున్నాయట. దాంతో పలు జీర్ణసంబంధ సమస్యలకు ఇవి కారణమవుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
మరో పక్క జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనంలో కృత్రిమ స్వీటెనర్లు కలిపిన ఆహార పదార్థాల వాడకం ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతోందని వెల్లడైంది. ఒక్క అమెరికాలోనే నాలుగో వంతు పిల్లలూ, దాదాపు సగం మంది పెద్దలూ ఇలాంటి ఆహారపదార్థాలను తింటున్నారట. చక్కెర తగ్గించమంటే అర్థం కృత్రిమ చక్కెరను పెంచమని కాదనీ, చక్కెర ఏ రూపంలోనూ మంచిది కాదనీ శాస్త్రవేత్తలు అంటున్నారు. మామూలు చక్కెరతో వచ్చే జబ్బులకు తోడు ఈ కృత్రిమ చక్కెరల వల్ల లివర్, కిడ్నీ జబ్బులూ, మైగ్రెయిన్లూ, వ్యాధి నిరోధక శక్తి తగ్గడమూ లాంటి కొత్త సమస్యలు వస్తున్నాయట. ఇవే కాదు, కొన్ని సందర్భాల్లో మామూలు ఆహారం ముసుగులోనూ మనకు తెలియకుండానే చక్కెర మనలోకి ప్రవేశిస్తోందని బ్రిటన్ పరిశోధకులు కనిపెట్టారు. అక్కడి సూపర్ మార్కెట్లలో దొరికే ‘యోగర్ట్’(పెరుగు)ని వారు పరీక్షిస్తే వంద గ్రాముల కప్పులో 13 గ్రాములకు పైగా చక్కెర ఉందట. అసలు చక్కెర ఉంటుందని ఊహించని పెరుగులోనే ఇంత ఉంటే ఇక పళ్లరసాలూ, శీతల పానీయాల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అనే మరో సంస్థ 12 దేశాలనుంచి నాలుగు లక్షల రడీమేడ్ ఆహార పదార్థాలను(స్వీట్లు కావు) విశ్లేషించి చూడగా మన దేశానికి చెందిన పదార్థాల్లో ఎనర్జీ(కెలొరీలు) చాలా ఎక్కువగా (వందగ్రాముల ఆహారపదార్థంలో 362 కెలొరీలు) ఉన్నట్లు తేలింది. ఈ పదార్థాల్లో చక్కెర విషయానికి వస్తే ప్రతి వందగ్రాములకీ దాదాపు 8గ్రాముల చక్కెరతో మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. అంటే అవసరం లేని పదార్థాల్లోనూ కేవలం రుచి కోసం, ప్రజలు వాటికి అలవాటు పడి మళ్లీ మళ్లీ తినేలా చేయడం కోసం చక్కెరను కలుపుతున్నారు. కానీ ఆ వివరాలను ప్యాకెట్ల మీద రాయడం లేదు.
ఇలాంటి అధ్యయనాలే చక్కెరని తగ్గించడమెలా అన్న పరిశోధనను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అలాగని ఈ సమస్య అకస్మాత్తుగా వచ్చిందేమీ కాదు. కారణం వేరైనా చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కనిపెట్టాలన్న ఆలోచనకు బీజం పడి దాదాపు ఎనభై ఏళ్లవుతోంది.
ఏ కారణంతో... ఎవరు చేశారు?
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చక్కెరకి తీవ్రంగా కొరత ఏర్పడింది. దాంతో అన్ని దేశాల్లోనూ కోటా విధించారు. ఇజ్రాయెల్‌కి చెందిన డాక్టర్ అబ్రహాం బానియెల్ రసాయన శాస్త్రవేత్త. అతడి పొరుగింట్లో ఉంటున్న టీచరు ఓరోజు మాటల్లో చక్కెర కోటా తగ్గిపోవడంవల్ల పిల్లలకు చాలినంత తీపి పదార్థాలు లభించక ఉత్సాహంగా చదవలేకపోతున్నారనీ, తీపి కొంచెమే ఉన్నా ఎక్కువ తిన్న అనుభూతి కలిగేలా ఏదైనా వంటకం తయారుచేయ గలిగితే బాగుంటుందనీ అందట. ఆ మాట అతని మనసులో నాటుకుపోయింది. కొంత కాలం సైన్యంలో పనిచేసి ఆ తర్వాత దశాబ్దాల పాటు పరిశోధనలో మునిగితేలిన బానియెల్ వేర్వేరు కొత్త విషయాలు కనిపెట్టి 110కి పైగా పేటెంట్లు సాధించాడు. అయితే ఏ పని చేస్తున్నా చక్కెర విషయం అతని మనసులో తొలుస్తూనే ఉంది. దాని మీద వస్తున్న అధ్యయనాలు అతడిలో ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. మొత్తానికి చక్కెరని ఆరోగ్యకరంగా మార్చాలన్న అతడి ఆశయం తొంభై ఆరేళ్ల వయసులో నెరవేరింది. కొడుకుతో కలిసి ‘డూమటాక్’ అనే కంపెనీ పెట్టి ‘ఇన్‌క్రెడో’ చక్కెరకు పేటెంట్ పొందాడు బానియెల్. ఇజ్రాయెలీ భాషలో ఆ పదానికి అర్థం ‘రెట్టింపు తీయదనం’.
ఇజ్రాయెలీ కంపెనీలే కాదు, ఇంకా ఎన్నో కంపెనీలు ఈ దిశగా కృషిచేస్తున్నాయి. నెస్లే కంపెనీ మూడేళ్ల క్రితం తాను తయారుచేసిన కొత్త రకం చక్కెరను వాడి ‘మిల్కీబార్ వావ్‌సమ్స్’ అనే చాకొలెట్‌ని తయారుచేసింది. అది వాణిజ్యపరంగా విజయం సాధించకపోవడంతో ఆపేసింది. టాటె అండ్ లైల్ కంపెనీ తయారుచేసిన జీరో కెలొరీ అల్యులోజ్ మంచిదే కానీ అన్నిరకాల పదార్థాలకూ పనికిరాదట. మరో ఐదేళ్లకల్లా 80 నుంచి 90 శాతం చక్కెర వాడకం తగ్గేలా ఆరోగ్యకరమైన చక్కెరని తయారుచేస్తామంటున్నాయి ఈ రంగంలో పరిశోధనలను కొనసాగిస్తున్న సంస్థలు.
‘ఇన్‌క్రెడో’ విజయం సాధించినట్లేనా?
ఎలాంటి ముడి చక్కెరనైనా ఇన్‌క్రెడో లాగా(తక్కువ చక్కెర, ఎక్కువ తీపి) మార్చగలమంటున్న డూమటాక్ ప్రారంభమై ఆరేళ్లే అయినా ఈ ఏడాది ప్రపంచంలోని 50 ప్రధాన ఆహార పదార్థాల పరిశ్రమల్లో ఒకటిగా చరిత్ర సృష్టించింది. దాంతో సంస్థ విస్తరణకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. యూరప్‌కి చెందిన అతి పెద్ద చక్కెర కర్మాగారం సుజుకర్ ఈ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉంది. చక్కెర విషయంలో సాధించిన విజయంతో ఇప్పుడిక ఉప్పు మీద దృష్టి పెట్టబోతున్నట్లు ప్రకటించింది డూమటాక్. అయితే చక్కెరను రెట్టింపు ఫలితం ఇచ్చేలా తయారుచేయడంతో వీరి పని అయిపోలేదు. దాన్ని అన్నిరకాలుగా వాడగలిగినప్పుడే పూర్తి విజయం సాధించినట్లు. అది అంత సులభమేమీ కాదు. చక్కెర వాడడం వల్ల తయారుచేసే ఆహారపదార్థం పరిమాణం పెరుగుతుంది. ఆకర్షణీయమైన మెరుపూ నునుపూ వస్తాయి. ప్రత్యామ్నాయాలతో పోలిస్తే చక్కెర ధర తక్కువ. అలాంటప్పుడు సగం వాడితేనే సరిపోయే చక్కెర వల్ల పదార్థం సైజు తగ్గు తుంది. దాంతో ఖరీదు పెంచాల్సి రావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇన్‌క్రెడో లాంటి ఉత్పత్తుల్ని అన్ని రకాల తీపి పదార్థాల్లోనూ వాడడమూ, లాభసాటిగా మలచడమూ ఇప్పుడిక పాకశాస్త్ర నిపుణుల మీద ఆధారపడి ఉంది. అందుకే డూమటాక్ చాక్లెట్లు, కుకీలు, కేకులు, బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్ తయారుచేసి విక్రయించే బ్రాండ్లతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. సో, ఇక ఒక్క చాక్లెట్‌తోనే పిల్లలూ, ఒక్క గులాబ్‌జామ్‌తోనే పెద్దలూ... తృప్తిపడి ‘ఇక చాలు’ అనే రోజు ఎంతో దూరంలో లేదన్నమాట!