చిన్నారుల జీవితాల్ని చిరుతిళ్లు శాసిస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే తినుబండారాల కంటే వారు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుండడం పరిపాటి అయ్యింది. బడుల వద్ద కూడా జంక్ ఫుడ్ కోసం పరుగులు పెడుతున్నారు. అది వారికి బలమివ్వకపోగా, ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనల్ని కఠినంగా పాటిస్తున్న కేరళ రాష్ట్రం ‘ఈట్ రైట్’ నినాదంతో ఆదర్శంగా నిలుస్తోంది. జంక్ ఫుడ్‌ను దూరం పెట్టడంతో పాటు పౌష్టికాహారాన్ని చిన్నారుల పళ్లెంలోకి చేర్చే ప్రయత్నం చేస్తోంది.
అక్కడ కఠినంగా!
పాఠశాలలకు 50 మీటర్ల పరిధిలో చిరుతిళ్ల దుకాణాలుండొద్దనే నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో సరిగా అమలు కావట్లేదు. కేరళ మాత్రం కఠినంగా అమలు చేస్తోంది. బడుల్లో వాతావరణం (20%), చిరుతిళ్ల వ్యాపారాలు (30%), ఆహార పరీక్షలు, పర్యవేక్షణ (20%), శిక్షణ, వనరులు (10%), వినియోగంపై అవగాహన (20%) అంశాల ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మూడేళ్లుగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తోంది. ‘ఈట్ రైట్’ నినాదంతో విధానాల్ని మెరుగుపరుచుకున్న కేరళ రాష్ట్రం రెండో స్థానానికి చేరుకోగా.. 49 పాయింట్లతో తెలంగాణ 10వ స్థానంలో, 36 పాయింట్లతో ఏపీ 19వ స్థానంలో నిలిచాయి.
కేరళలో ఏం చేస్తున్నారంటే
బడుల్లో ఇవీ నిబంధనలు..
* శుభ్రమైన తాగునీరు అందించాలి.
*తృణధాన్యాలు, పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారంతో కూడిన మెనూ ఉండాలి.
* తాజా, స్థానిక ఉత్పత్తులతోనే వంట చేయాలి. ప్యాక్ చేసిన ఉత్పత్తులేవీ వాడొద్దు.
* వంటనూనె ఒకేసారి వాడాలి. అదీ రోజూ 25 గ్రాములకు మించరాదు.
* పాఠశాలలు, విద్యార్థుల హాస్టళ్లకు 50 మీటర్ల దరిదాపుల్లో చిరుతిళ్ల దుకాణాలుండకూడదు. క్యాంటీన్లలో మిఠాయిలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, చిప్స్, పిజ్జా, సమోసాలు, నూడుల్స్, గులాబ్ జామూన్, శీతల పానీయాలు నిషేధం.
బడి బువ్వలో ఉండేవి ఇవీ...
* గోధుమ, బియ్యం, రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలతో వంటకాలు
* తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పన్నీరు, చికెన్, చేపలు, కోడిగుడ్లు
* 300 గ్రాముల కూరగాయలు. వీటిలో ఆకు కూరలు 50 గ్రా, ఇతరాలు 200 గ్రా, దుంపలు 50 గ్రా. ఉండాలి. 100గ్రా. పండ్లు
* బాదం, పిస్తా,ఉప్పు లేకుండావేయించిన గింజలు
* ఉడికించిన చిరుతిళ్లు, ఉప్మా, పోహా, డోఖ్లా
పిల్లలకు ఇచ్చే స్నాక్ బాక్సుల్లో..
ఫ్రూట్ సలాడ్‌లు, పల్లీలు, బెల్లంతో చేసిన చిక్కీలు, లడ్డూలు, బాదం, పిస్తాతో చేసిన తినుబండారాలు, మినప, ఉలవ పిండి లడ్డూలు, రాగులు, జొన్నలు, సజ్జలతో చేసే స్నాక్స్.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారమిద్దాం