తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇమ్యూనిటీని పెంచే ‘ఉగాది పచ్చడి’!

ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది బొబ్బట్లు, పచ్చడి. పచ్చడిలో ఎన్నో రుచులు ఉంటాయి. ఈ పచ్చడి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఈ ప్రత్యేకమైన పదార్థం రుచిలోనే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే!

ugadi pachadi
ఉగాది పచ్చడి

By

Published : Apr 13, 2021, 2:03 PM IST

ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. పాత కాలపు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఈ ప్రత్యేకమైన పదార్థం రుచిలోనే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ముఖ్యంగా ఇందులో భాగంగా మనం వాడే ఆరు రకాల పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉగాది పచ్చడి కూడా ఎంతగానో సహకరిస్తుందంటున్నారు. మరి, ‘శ్రీ ప్లవ’ నామ సంవత్సరంలోకి అడుగిడుతోన్న వేళ.. ఉగాది పచ్చడి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడానికి, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి...

ఏటా ఎంతో సందడిగా ఉగాదిని జరుపుకొంటూ మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనవాయితీ! అయితే ఏడాది కాలంగా పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి కారణంగా వేడుకలు, పండగలన్నీ నిరాడంబరంగానే జరుపుకోవాల్సి వస్తోంది. అంతేకాదు.. వైరస్‌ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకునే పనిలో పడ్డారు. ఆయా పర్వదినాల్లో ప్రత్యేకంగా చేసుకునే వంటకాల్లో కూడా రోగనిరోధక శక్తిని వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది ప్రత్యేక వంటకం ‘ఉగాది పచ్చడి’లోనూ బోలెడన్ని సుగుణాలున్నాయని, అవి మన రోగనిరోధక శక్తిని పెంచి.. వైరస్‌ బారి నుంచి మనల్ని కాపాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

షడ్రుచులతో అమోఘమైన రుచి..!

ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్ని మన జీవితంలోని భావోద్వేగాలతో పోల్చుతుంటారు. తీపి (బెల్లం), చేదు (వేప పువ్వు), వగరు (మామిడి పిందె), కారం (కారం), ఉప్పు (ఉప్పు), పులుపు (చింత పండు).. వంటి షడ్రుచులతో ఉగాది పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సినవి
* మామిడి పిందె - ఒకటి (చిన్నది)
* చింతపండు రసం - కప్పు (చిన్న నిమ్మకాయంత చింతపండును నానబెట్టి దాన్నుంచి రసం తీసుకోవాలి)
* బెల్లం - అరకప్పు
* వేప పువ్వు - కొద్దిగా
* కారం - టీస్పూన్
తయారీ
పైన తెలిపిన పదార్థాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా ఇందులో నీళ్లు, ఉప్పు కలుపుకొంటే ఉగాది పచ్చడి రడీ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే ఈ పచ్చడిలో కారానికి బదులుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అదనపు రుచి కోసం కొబ్బరి ముక్కలు, వేయించుకున్న పుట్నాల పప్పు.. వంటివి కూడా వేసుకోవచ్చు.

ఆరు రుచులు - ఆరోగ్య రహస్యాలు!

‘బెల్లం’తో ఇన్ఫెక్షన్లు దూరం!

ఉగాది పచ్చడిలో మనం వాడే బెల్లం శరీరంలోని విషపదార్థాల్ని బయటికి పంపించడంలో సహకరిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌, సెలీనియం.. వంటి పోషకాలు ఫ్రీరాడికల్‌ డ్యామేజ్‌ నుంచి శరీరాన్ని కాపాడతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్‌, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ఇక ఇందులోని ఐరన్‌ రక్తహీనతను నివారిస్తుంది. దగ్గు, అజీర్తి, మలబద్ధకం, మై గ్రెయిన్ కామెర్లు.. వంటి సమస్యలకు బెల్లం పరిష్కారం చూపుతుంది.

వ్యాధులకు ఔషధం ‘వేప’!

పచ్చడిలో చేదు కోసం వాడే వేప పువ్వుకు సుమారు 35 రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. శరీరంలోకి చేరి మనల్ని అనారోగ్యాలకు గురిచేసే క్రిములు, ఇతర వైరస్‌-బ్యాక్టీరియాలను నాశనం చేయడంలో వేపకు సాటి మరొకటి లేదనడం అతిశయోక్తి కాదు. రక్తాన్ని శుద్ధి చేసి అనేక చర్మ వ్యాధులను నివారించడంలో ఇది దోహదం చేస్తుంది. అలాగే మధుమేహులకు వేప చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.

‘మామిడి’తో చల్లదనం!

మామిడి పిందెతో పచ్చడికి వగరు రుచి వస్తుంది. గాయాలు, వాటి కారణంగా జరిగే రక్తస్రావాన్ని నివారించడంలో ఇది సహకరిస్తుంది. ఇక వేసవి వేడి వల్ల వడదెబ్బ తగలకుండా, మనం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఇక ఇందులోని విటమిన్‌ ‘సి’ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. ఎసిడిటీ, ఛాతీలో మంట.. వంటి సమస్యల్ని తొలగించడంతో పాటు పొట్టను పరిశుభ్రంగా ఉంచడానికి మామిడిలోని పీచు పదార్థం సహకరిస్తుంది.

ఇన్ఫెక్షన్లతో పోరాడే ‘కారం’!

చర్మ ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కారంలో ఉన్నాయి. అందుకే దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్‌గా పేర్కొంటారు. అలాగే ఇందులో ఉండే క్యాప్సైచిన్‌ అనే పదార్థం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచడం, బరువును తగ్గించడంతో పాటు ముక్కు దిబ్బడ నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది కారం.

‘ఉప్పు’తో ఉత్సాహంగా..!

వేసవిలో మన శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే తగినంత సోడియంను శరీరానికి అందించడం ముఖ్యం. ఉగాది పచ్చడిలోని ఉప్పు ఇందుకు దోహదపడుతుంది. రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌ను నివారించడంతో పాటు వేసవి వేడి కారణంగా వచ్చే నీరసాన్ని తరిమికొట్టడంలో ఇది సహకరిస్తుంది.

ఆరోగ్యానికి ‘చింత’ లేదు!

వెయ్యి వ్యాధుల నుంచి మనల్ని కాపాడే అద్భుత ఔషధం చింతపండు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తీసుకున్న ఆహారంలోని ఖనిజాల్ని శరీరం సులభంగా గ్రహించేందుకు.. శరీరంలోని విష పదార్థాలను తొలగించేందుకు ఇది సహకరిస్తుంది. ఇక అజీర్తి వల్ల కలిగే అసౌకర్యానికి చెక్‌ పెట్టడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో దీని పాత్ర కీలకం. ఇక అందాన్ని పెంచే శక్తి కూడా చింతపండుకు ఉందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అందుకే దీన్ని వివిధ సౌందర్య ఉత్పత్తుల్లోనూ వాడుతుంటారు. కొంతమంది దీంతో ఫేస్‌ప్యాక్స్‌ కూడా ప్రయత్నిస్తుంటారు.

చూశారుగా.. ఉగాది పచ్చడిలో మనం ఉపయోగించిన ఆరు పదార్థాల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో! అలాగని పచ్చడిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింతగా పెరుగుతుంది, తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చన్న అత్యుత్సాహం కూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైనా మితంగా తీసుకుంటేనే దాని ప్రయోజనాలు పొందచ్చంటున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ABOUT THE AUTHOR

...view details