ఆన్‌లైన్ ముచ్చట్లు
ఫోన్ కాల్ లేదా వీడియో చాట్ కావొచ్చు. కుదిరితే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు.. సాధనం ఏదైనా రోజూ స్నేహితులతో అభిప్రాయాలు పంచుకోవాలి. ఇంటికి దూరంగా ఉంటుంటే తరచూ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాలి. ఆత్మీయుల గురించి మనమెంత ఆందోళన చెందుతుంటామో మన గురించీ వాళ్లు అలాగే ఆలోచిస్తుంటారని గుర్తించాలి. వీలుంటే బాల్కనీలో దూరం నుంచే ఇరుగు పొరుగుతోనూ మాట్లాడొచ్చు. ఇలా మనలోని భావాలను ఇతరులతో పంచుకుంటే మనసు తేలిక పడుతుంది.
అవకాశం
సమస్యలను అవకాశాలుగా మలచుకున్నవారు జీవితంలో విజయం సాధిస్తారంటారు. ఒంటరితనాన్ని కూడా ఇలాగే భావించొచ్చు. అనూహ్యంగా లభించిన ఈ సమయాన్ని మన గురించి, మన సమస్యల గురించి ఆలోచించుకోవటానికి వినియోగించుకోవచ్చు. మన లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన మార్గాలను అన్వేషించటానికి వాడుకోవచ్చు. అలాగే స్నేహితులు, కుటుంబసభ్యులు సాధించిన విజయాలను గుర్తుచేసి వారిని మెచ్చుకోవచ్చు. ఇలాంటి వాటితో ఒంటరితనాన్ని దూరం చేసుకోవటమే కాదు. సామాజిక, కుటుంబ అనుబంధాలనూ పెంచుకోవచ్చు.
వాస్తవిక ధోరణి
మన చేతుల్లో లేనివాటిని మనమేమీ చేయలేం. ఇష్టమున్నా లేకున్నా కరోనా మన చేతులను కట్టి పడేసింది. ఆరోగ్యం దగ్గర్నుంచి ఆర్థిక పరిస్థితుల వరకూ అన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ఈ వాస్తవాన్ని గ్రహించి, దానికి అనుగుణంగా మసలుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ప్రస్తుత పరిస్థితిని తలచుకొని కుమిలిపోవటంతో ఒరిగేదేమీ లేదు. మనమే కాదు, మనలాగే మరెంతోమంది సతమతమవుతున్నారు. దీన్ని గ్రహించగలిగితే ఒంటరితనం భారంగానే అనిపించదు. దూరంగా ఉన్నా మానసికంగా ఒకరికి మరొకరు దగ్గరగా ఉన్నామనే భావన కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
పనుల్లో నిమగ్నమవ్వాలి
ఇంట్లోనే ఉంటున్నామని ఖాళీగా ఉండటం తగదు. ఖాళీగా ఉంటే మనసు పరిపరివిధాల పోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ముంచెత్తుతాయి. ఏదో ఒక పని ముందేసుకోవటం మేలు. ఇంట్లో చిన్న చిన్న పనులైనా సరే. రాసే అలవాటుంటే మనసులోని భావాలను కాగితం మీద పెట్టొచ్చు. బొమ్మలు వేయటం, సంగీతం వంటి హాబీలుంటే తిరిగి కొనసాగించొచ్చు. లేదూ కొత్త హాబీలను అలవరచుకోవచ్చు.