జార్ఖండ్‌లోని సింద్రీ ప్రాంతానికి చెందిన సుదీప్త... టీనేజ్ వయసులోనే తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. తన తల్లిదండ్రులతో పాటు ఎవరికీ భారంగా మారకూడదనుకుంది. అందుకే 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని వదిలిపెట్టి దిల్లీ చేరుకుంది. అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని ఓ న్యూస్ పేపర్‌లో జర్నలిస్టుగా చేరింది. ఏడాది తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లైవ్ థియట్రికల్ షో ‘Zangoora’ లో ఆర్టిస్ట్‌గా చేరి సుమారు 1,400 షోలకు పని చేసింది. షైమక్ దావర్ డ్యాన్స్ బృందంలో టాప్ డ్యాన్సర్‌గా కూడా పేరందుకుంది సుదీప్త. వీటితో పాటు ఫిట్‌నెస్ పాఠాలు కూడా చెప్పేది.
తలపై మజ్జిగ పోసి అవమానించాడు!
‘పెళ్లి’ అనేది ఎవరి జీవితంలోనైనా ఓ మేలి మలుపు కావాలి. అయితే దురదృష్టవశాత్తూ సుదీప్త జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ఓ చేదు జ్ఞాపకంగా మారిపోయింది. ఆరేళ్ల క్రితం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సుదీప్త దిల్లీ నుంచి ముంబయికి తన మకాం మార్చింది. అయితే అక్కడ ఆమె భర్త తనపై అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించాడు. మొదట తన జుంబా ట్రైనింగ్ క్లాసులకు అడ్డుపడ్డాడు. ప్రత్యేకించి మగాళ్లకు ట్రైనింగ్ వద్దన్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి శారీరకంగా, మానసికంగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
‘నా భర్త ఎంతగా హింసించినా ఓ సగటు భారతీయ మహిళగా సర్దుకుపోయి కాపురం చేయడానికే ప్రయత్నించాను. అతను మారతాడంటూ ఓపికతో ఎన్నో రోజులు వేచి చూశాను. కలహాలను దూరం చేసుకుని సజావుగా కాపురం చేసేందుకు ప్రయత్నించాను. అతను ఎప్పుడూ నా మాటలను పట్టించుకోలేదు. ఒకరోజు మాట్లాడుతుండగానే నా తలపై లస్సీ (మజ్జిగ) పోసి అవమానించాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ మా మధ్య గొడవలు పెరిగాయే కానీ తగ్గలేదు. అందుకే అతని నుంచి విడిపోవాలనుకున్నాను’ అని ఓ సందర్భంలో తను పడిన కష్టాలను గుర్తుకు తెచ్చుకుందీ ఫిట్‌నెస్ ట్రైనర్.
ఆర్థికంగానూ నష్టపోయాను!
దాంపత్య బంధాన్ని తెంచుకుని తన జీవితం తాను బతకాలన్న సుదీప్త ఆశ అంత సులభంగా నెరవేరలేదు. విడాకులు ఇవ్వడానికి భర్త, అత్తింటివారు నిరాకరించారు. సుమారు రెండేళ్లకు పైగా ఆమెను విసిగించి ఆ తర్వాత విడాకుల అంగీకారపత్రంపై సంతకాలు చేశారు.