శీతగాలి తిరిగిందంటే చాలు... ఒకప్పుడు పల్లెల్లో ఉదయాన్నే కావిళ్లతోనో సైకిళ్లమీదో సీతాఫలాలు అమ్మొచ్చేవి. వాటికోసం పిల్లలు కాచుక్కూచుని, కొన్నవాటిలో పండిన వాటికోసం పోటీపడేవారు. పచ్చివి పండేయడం, అవి పండాయో లేదో అని చూడటం... మొత్తంగా ఈ కాలమంతా ఇంటిల్లిపాదికీ సీతాఫలమే(custard apple benefits) అల్పాహారం. మృదువుగా తియ్యగా ఉండే ఆ పండులో చక్కెర తప్ప ఇంకేదీ ఉండదనీ, తింటే జలుబు చేస్తుందనీ కొందరు పొరబడతారు. కానీ అన్ని పండ్లలానే సీతాఫలంలోనూ పోషకాలనేకం. సి-విటమిన్‌తోపాటు ఎ, బి, కె విటమిన్లూ ప్రొటీన్లూ కాల్షియం, ఫాస్ఫరస్... వంటి మూలకాలూ ఎక్కువే. ఈ పోషకాలన్నీ రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్నీ పెంచుతాయట.
రంగురంగులు..!
సీతాఫలం(custard apple benefits)... అనగానే ఎవరికైనా లేతాకుపచ్చరంగు తొక్కలతో తెల్లని గుజ్జుతో నల్లని గింజలతో ఉన్న రూపమే గుర్తొస్తుంది. కానీ ఈమధ్య అది ఎరుపూ ఊదా రంగుల్లోనూ పండుతోంది. కేవలం తొక్కే కాదు, లోపలి గుజ్జు సైతం ఎరుపూ గులాబీ రంగుల్ని సంతరించుకునేలా చేస్తున్నారు. ఇవి కూడా ఆకుపచ్చని పండులానే మంచి వాసనతో తియ్యగా ఉంటాయి. దాంతో ఒకప్పుడు కొండల్లో మాత్రమే పెరిగే సీతాఫలాన్ని నేడు చాలామంది రైతులు సాగుచేస్తూ లాభాలనూ ఆర్జిస్తున్నారు. గింజలు తక్కువగానూ గుజ్జు ఎక్కువగానూ ఉండే హైబ్రిడ్ రకాలనీ రూపొందిస్తున్నారు. అస్సలు గింజలు లేని రకాలనీ కొన్నిచోట్ల పండిస్తున్నారు. ఫలితంగా ఈ పండు మామిడిని మించిన ధరతో కిలో వంద నుంచి ఐదు వందల రూపాయల వరకూ పలుకుతోంది. మహారాష్ట్రలోని పింపరి డుమాల గ్రామీణులైతే ఊరంతా సీతాఫలతోటల్నే వేసి సంపన్నులుగా మారారు.
రకరకాలు..!
సీతాఫలం(custard apple benefits)... పేరు విని ఇదేదో మనదగ్గరే పుట్టి పెరిగింది అనుకోవద్దు. దక్షిణ అమెరికా నుంచి పదహారో శతాబ్దంలో పోర్చుగీసు వాళ్ల ద్వారా వచ్చింది. శీతగాలి తిరగ్గానే వస్తాయి కాబట్టి శీత ఫలం అని ఉండొచ్చు. కానీ సీతాఫలం(అనోనా స్క్వామోజా)తోపాటు దాన్ని పోలిన మిగిలిన జాతులకు రామ(రెటిక్యులేటా), లక్ష్మణ(మురిక్యులేటా), హనుమాన్(చెర్మోయా) పేర్లు ఉండటం, అవి అంతర్జాతీయంగానూ పేరొందడం చెప్పుకోదగ్గ విశేషం. సీతాఫలాన్నే ఇంగ్లిష్‌లో షుగర్ ఆపిల్ అనీ, లేత ఊదా ఎరుపు రంగుల్లో నున్నగా ఉండే రామాఫలాన్ని కస్టర్డ్ ఆపిల్‌గానూ పిలుస్తారు. మిగిలిన వాటితో పోలిస్తే ఈ రెండింటి వాడకమే మనదగ్గర ఎక్కువ. ఇటీవల సీతాఫలాన్ని హనుమాన్ ఫలంతో సంకరీకరించి అట్మోయా అనే హైబ్రిడ్ రకాన్నీ పుట్టించారు. బిరిబా, గ్లాబ్రా, క్రిసోఫైలా... ఇలా అనోనా జాతులు మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఔషధఫలాలే. స్థానిక అమెరికన్లు సంప్రదాయ వైద్యంలోనూ మనదగ్గర ఆయుర్వేదంలోనూ కాయలతోపాటు ఆకుల్నీ బెరడునీ వాడుతుంటారు. ముఖ్యంగా కీళ్లనొప్పులూ విరేచనాలూ అజీర్తికీ ఈ చెట్ల ఆకుల్నీ బెరడునీ మరిగించి మందుగా ఇస్తారు. వేసవిలో వచ్చే సెగ్గడ్డలకి సీతాఫల ఆకుల ముద్దను కట్టుకడితే త్వరగా తగ్గిపోతుందట. పచ్చికాయల్లో పోషకాలు ఎక్కువని వాటిని కొన్ని ప్రాంతాల్లో కాల్చుకునీ తింటుంటారు. సీతాఫలంతో పోలిస్తే మిగిలిన రకాల్లో గింజలు తక్కువ. కానీ తీపి తక్కువ. అందుకే మనదగ్గర సీతాఫలం వాడుకే ఎక్కువ.
ఉత్పత్తులు..!
పండుని పండుగానే తినే రోజులు పోయాయి. ఇతర పండ్ల మాదిరిగానే సీతాఫలంతోనూ ఐస్‌క్రీమ్‌లూ స్మూతీలూ డెజర్ట్‌లూ కేకులూ సలాడ్లూ షర్బత్‌లూ కుకీలూ... ఇలా ఎన్నో రకాలు చేస్తున్నారు. అన్నింటిలోకీ ఈ పండుతో చేసే ఐస్‌క్రీమ్ రుచి అదరహో అంటారు సీతాఫల ప్రియులు. చలికాలంలో మాత్రమే వచ్చే ఈ పండ్లను ఇతర కాలాల్లోనూ తినేలా బైట్స్ పేరుతో చాక్లెట్లూ చేస్తున్నారు. ఇక, ఎందులోనైనా వాడుకోగలిగే పొడి సరేసరి.