తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

hair fall due to illness : కరోనా, డెంగీ బాధితుల్లో జుట్టు రాలుతోంది..

కరోనా(corona victims) బారినపడిన వాళ్లే కాకుండా డెంగీ(dengue) లాంటి విష జ్వరాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు.. ఇలా వేటి బారినపడినా బాధితుల్లో కొద్దికాలం తర్వాత జుట్టు ఊడిపోవడం జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధుల నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకశక్తి(immunity) బాగా తగ్గిపోవడంతో.. శరీరంలో అనేక రకాల మార్పులను ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

hair fall due to illness
hair fall due to illness

By

Published : Nov 16, 2021, 8:51 AM IST

ఏ అనారోగ్యం బారిన పడినా..

కరోనా(corona victims) బారినపడిన వాళ్లే కాకుండా, డెంగీ(dengue victims) లాంటి విష జ్వరాలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు.. ఇలా వేటి బారినపడినా బాధితుల్లో కొద్దికాలం తర్వాత జుట్టు ఊడిపోవడం(hair loss) జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. టెలోజెన్‌ ఎఫ్లువియం అనే ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు. వ్యాధుల నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకశక్తి(immunity) బాగా తగ్గిపోవడం వల్ల అనేక రకాల మార్పులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. జుట్టు ఊడిపోవడం(hair fall) అనేది కూడా దానిలో భాగంగా జరిగే ఓ ప్రక్రియే. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ప్రధానంగా ప్రొటీన్‌ ఎక్కువ ఉండే ఆహారం తినాలి. గుడ్లు ఎల్లోతో సహా, చికెన్‌, మొలకెత్తిన విత్తనాలు, పప్పుదినుసులు, పాలు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

‘విజయవాడ పటమటకు చెందిన సుధీర్‌(26) కొవిడ్‌ బారినపడి కోలుకున్నాడు. నెల రోజుల తర్వాత నుంచి జుట్టు ఊడిపోవడం ఎక్కువైంది. తల దువ్వితే చాలు వెంట్రుకలు రాలిపడిపోతున్నాయి. గతంలో ఈ సమస్య ఎప్పుడూ లేదు. సుధీర్‌ చెల్లి, తల్లికి కూడా ఇదే సమస్య ఎదురైంది. గతంలో కొద్దిగా ఊడుతుండేది.. ఇప్పుడు మాత్రం తలపై చెయ్యి పెడితే.. ఊడిపోతుండడంతో ఆందోళనతో ఆసుపత్రికి వచ్చారు.’

ఏపీలోని విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రస్తుతం ఆసుపత్రులకు జుట్టు ఊడిపోతోందంటూ వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరిలో అత్యధికశాతం మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారే ఉంటున్నారు. ఒక్కో చర్మ వ్యాధుల నిపుణుడి వద్దకు గతంలో రోజుకు ఐదారుగురు ఈ సమస్యతో రాగా.. ప్రస్తుతం 20 నుంచి 30మంది వస్తున్నారు. కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న వారిలో జుట్టు ఊడడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే అకస్మాత్తుగా ఊడిపోవడం ఆరంభమైతే ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచిస్తున్నారు.

ఆందోళన చెందితే మరింత..

చాలామంది జుట్టు ఊడిపోతోందనే(hair fall) ఆందోళనతో ఆసుపత్రులకు వస్తుంటారు. వారి ఆదోళన వల్లే మరింత ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. అందుకే వ్యాధుల బారినపడి కోలుకునే వారిలో ఇలాంటివి సహజం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఆసుపత్రులకు వచ్చి తమ సమస్యకు మందులు రాయమంటూ ఎక్కువ మంది అడుగుతుంటారు. వాస్తవంగా అయితే ఈ సమస్యకు ఎలాంటి మందులు అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. జుట్టు కొంతకాలం ఊడిన తర్వాత.. తిరిగి వచ్చేస్తుంది. ఇది శాశ్వతంగా ఊడిపోవడం కాదు, వ్యాధి నుంచి కోలుకోవడం వల్ల కలిగిన మార్పుల ప్రభావంతో జరుగుతున్న సమస్య మాత్రమేనన్నారు.

అన్ని వయసుల వాళ్లూ..

కొవిడ్‌కు ముందు జుట్టు ఊడిపోతోందనే(hair fall) సమస్యతో 25 నుంచి 30ఏళ్ల మధ్యలో ఉండే యువత ఎక్కువగా వస్తుండేవాళ్లు. ప్రస్తుతం పదిహేనేళ్లు దాటిన వారి నుంచి.. పెద్దవాళ్ల వరకూ అన్ని వయసుల వాళ్లూ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. దానికి కారణం.. కరోనా వైరస్‌ బారిన ప్రతి నగరంలోనూ వేలాది మంది పడి కోలుకోవడంతో.. వారిలో చాలామందిలో ఈ సమస్య తలెత్తడమేనని పేర్కొంటున్నారు. వీరిలో వంశపారంపర్యంగా వచ్చే బట్టతల మాదిరిగా ఉండదని.. ఇది తాత్కాలికంగా ఉండే సమస్యేనని పేర్కొంటున్నారు.

నాలుగైదు నెలల్లో తిరిగి వచ్చేస్తుంది..

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో 70శాతం మందికి పైగా జుట్టు ఊడడం అనే సమస్య ఉంటుంది. వీరిలో చాలామంది ఆసుపత్రికి వచ్చి మందులు రాయమంటూ అడుగుతున్నారు. అసలు అవసరం లేదని చెప్పినా వినడం లేదు. వాస్తవంగా అయితే వీళ్లకు జుట్టు రూట్‌ చనిపోదు. తాత్కాలింగా ఊడుతుంది. ఓ నాలుగైదు నెలల తర్వాత మళ్లీ యథావిధిగా జుట్టు వచ్చేస్తుంది. రాలిపోతోందనే ఆందోళన ఎక్కువ పడకూడదు. ఓపికతో వేచిచూడాలి. కానీ.. ఎక్కువ మంది త్వరగా పెరగాలని మందులు అడుగుతుంటారు. గతంలో ఆసుపత్రికి వచ్చే 50 కేసుల్లో ఐదారు మంది జుట్టు ఊడే సమస్యతో వచ్చేవాళ్లు. ఇప్పుడు 15 నుంచి 20మంది ఉంటున్నారు.

రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోవాలి..

తీవ్రమైన వ్యాధుల బారినపడి కోలుకున్న వారిలో జుట్టు ఊడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ.. పోయిన జుట్టు తిరిగి ఖచ్చితంగా వచ్చేస్తుంది. పౌష్టికాహారం అనేది చాలా ప్రధానం. ఎందుకంటే కొవిడ్‌ ప్రభావం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. అందుకే.. ముందుగా మన శరీరాన్ని పూర్వపుస్థితికి తీసుకొచ్చేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. శరీరంలో బలం పెంచుకోవాలి. ఆసుపత్రులకు వచ్చేవారికి ఆహారంలో మార్పులు చేస్తూ ఉంటాం. అవసరమైన వారికి మాత్రమే మల్టీవిటమిన్‌ టాబ్లెట్లు, ఇతర మందులను ఇస్తుంటాం.

ABOUT THE AUTHOR

...view details