కీరా దోస
కీరా దోసలో 95శాతం నీరు ఉంటుంది. ఈ ఎండాకాలంలో శరీరానికి చలువనిచ్చేలా పండ్లు తినాలనుకుంటే ఈ దోసకాయను తినొచ్చు. ఈ కీరా దోస శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫిసెటిన్ అనే రసాయన మూలకం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఈ ముక్కలను కళ్ల వద్ద పెట్టుకుంటే కళ్ల కింద నల్లటి చారలు రాకుండా ఉంటాయి. చర్మసౌందర్యం కోసం ఫేసియల్ మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. ప్రతి రోజు కీరా తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
పుచ్చకాయ
ఈ ఎండా కాలంలోనే ఎక్కువగా దొరికే పుచ్చకాయల్లో 92శాతం నీరు ఉంటుంది. వీటిని తింటే దాహార్తి ఇట్టే తీరిపోతుంది. నిర్జలీకరణ సమస్యను నివారించవచ్చు. పుచ్చకాయ రక్తపోటును నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుందట. ఇందులోని విటమిన్లు ఏ, సీ, బీ6.. జుట్టు, చర్మం, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఉండే పీచుపదార్థాలు జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదపడతాయి.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలో 91శాతం నీరు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీటిని అందించొచ్చు. ఆకట్టుకునే రంగులో.. చూడగానే నోరూరించే ఈ పండల్లో పీచు పదార్థాలతో పాటు ఏ, సీ, బీ6, బీ9, ఈ, కె విటమిన్లు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్ వంటి పోషకాలూ ఉంటాయి. ఈ పండ్లు రక్తంలో కొవ్వును తగ్గిస్తాయి. ఇందులోని ఫెనోలిక్ రసాయన మూలకాలు క్యాన్సర్‌ను తగ్గించడంలో దోహదపడతాయి.