తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Vitamins For Immunity: ఈ విటమిన్లు మీ ఇమ్యూనిటీని పెంచేస్తాయి..! - రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు

Vitamins For Immunity : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. మరోసారి కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో విజృంభణ ప్రారంభించింది. ఈ వైరస్​ను తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే.. విటమిన్లు నిండి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు. మరి ఏ ఆహారంలో ఏ విటమిన్లు ఉంటాయో తెలుసుకుని మీ మెనూలో యాడ్ చేసుకోండి.

Vitamins, విటమిన్లు
Vitamins

By

Published : Dec 27, 2021, 8:26 AM IST

Vitamins For Immunity : రోగనిరోధక శక్తి.. మనల్ని జబ్బుల బారి నుండి కాపాడే ఔషధం వంటిది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే దాని ధాటికి మన ఒంట్లోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియాలు కూడా నిలవలేవు. మరి, ఇందుకోసం మనం తీసుకునే ఆహారం చాలా కీలకం. ఈ క్రమంలో విటమిన్లు నిండి ఉన్న ఆహారాన్ని కూడా మన రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా వ్యాధి సోకిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కంటే ముందే జాగ్రత్తపడచ్చంటున్నారు. మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లేంటి? అవి పుష్కలంగా లభించే పదార్థాలేంటో తెలుసుకొని మన రోజువారీ మెనూలో భాగం చేసుకుందాం రండి..

విటమిన్‌ సి..

Vitamin C :మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లలో విటమిన్‌ ‘సి’ది కీలక పాత్ర అని చెప్పచ్చు. ఈ విటమిన్‌ లోపం ఉన్న వాళ్లు చిన్న పాటి అనారోగ్యాలను కూడా ఎదుర్కోలేరు. కాబట్టి మనం రోజూ తీసుకునే ఆహారంలో ఈ విటమిన్‌ పుష్కలంగా లభించే కమలాఫలం, నిమ్మకాయ.. వంటి నిమ్మజాతి పండ్లను భాగం చేసుకోవడంతో పాటు పాలకూర, క్యాప్సికం.. వంటివి కూడా తీసుకోవాలి. అలాగే విటమిన్‌ ‘సి’ పుష్కలంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

విటమిన్‌ బి6..

Vitamin B6 : రోగనిరోధక వ్యవస్థలో జరిగే జీవరసాయన ప్రతిచర్యలకు (బయో కెమికల్‌ రియాక్షన్స్‌కి) తోడ్పడుతూ ఆ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహకరిస్తుందీ విటమిన్‌. కాబట్టి బయటి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విటమిన్‌ ‘బి6’ అధికంగా లభించే అరటిపండ్లు, బంగాళాదుంపలు, చికెన్‌, చేపలు, శెనగలు.. వంటి ఆహార పదార్థాల్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.

విటమిన్ ఇ..

Vitamin E : విటమిన్‌ ‘ఇ’ మన శరీరంలో ఒక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడి అవి మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపుతుంది. అలాగే ఈ విటమిన్‌ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠ పరచడంలోనూ సహకరిస్తుంది. కాబట్టి ఈ విటమిన్‌ ఎక్కువగా లభించే పొద్దుతిరుగుడు గింజలు, పల్లీలు, బాదంపప్పులు, పాలకూర, నట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

విటమిన్ ఎ..

Vitamin A : ఈ విటమిన్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్‌ ‘ఎ’ కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి క్యారట్స్, తర్బూజా, గుమ్మడికాయ, సోరకాయ.. వంటి విటమిన్‌ ‘ఎ’ ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్ని తీసుకోవడం ఉత్తమం.

విటమిన్‌ డి..

Vitamin D : విటమిన్‌ ‘డి’లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యునోరెగ్యులేటరీ గుణాలు రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, దాని రక్షణకు తోడ్పడతాయి. కాబట్టి ఈ విటమిన్‌ను పొందడానికి ఉదయాన్నే లేలేత సూర్యకిరణాల్లో ఓ అరగంట పాటు నిలబడాలి. అలాగే చేపలు, పాలు, పప్పులు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్‌ ‘డి’ వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.

గమనిక: మరీ అత్యవసరమైతే ఈ విటమిన్లను సప్లిమెంట్స్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.. అయితే అందుకు ముందుగా మీ డాక్టర్‌ సలహా తీసుకోవడం ముఖ్యం అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు.

ABOUT THE AUTHOR

...view details