కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు కాని.. జనం సాధారణ జీవితానికి నెమ్మదిగా అలవాటు పడిపోతున్నారు. క్రమంగా, వీధుల్లో, ముఖ్యమైన కూడళ్లలో తోపుడు బళ్లు.. స్టార్ హోటల్ ఆన్ రోడ్స్ వంటి ఆహారం వండి.. వడ్డించే వాహనాల సంఖ్య పెరిగింది. వర్షాకాలం.. కొన్ని రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఏమాత్రం ఆహారం కలుషితమైనా.. పేగు సంబంధిత వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని జాతీయ పోషకాహార సంస్థ విశ్రాంత శాస్త్రవేత్త డా.సుదర్శన్ హెచ్చరిస్తున్నారు. వీధి పక్కన ఆహారం వడ్డించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (Food Safety and Standards Authority of India) సూచించింది.
ఇవిగో సూత్రాలు..
- వంటలు చేసి వడ్డించే ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని సరఫరా చేసే తోపుడు బండి లేదా వాహనం సైతం శుభ్రంగా ఉండాలి.
- ఆహారంలో వినియోగించాల్సిన కూరగాయలు, ఆకులను కోసిన తర్వాత వాటిపై తప్పనిసరిగా ప్లాస్టిక్ కవర్‌తో కప్పి ఉంచాలి.
- మూత ఉన్న చెత్త డబ్బాలు వాడాలి.
- వంట కోసం వినియోగించే వస్త్రాలు శుభ్రంగా ఉతికి ఆరబెట్టినవై ఉండాలి.
- వంట చేసి వడ్డించేవారు తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గ్లౌజులు ధరించాలి.
- చేతులకు గాయాలు అయిన వారు, అనారోగ్యం ఉన్నవారు వంటకు దూరంగా ఉండాలి.
- వర్షాకాలంలో వీధి బండ్లపై వండిన మాంసాహారం తినొద్దు.
- నీరు, ఆహారం కలుషితం కావడంతోనే టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా చేరతాయి కనుక ఎల్లప్పుడూ వేడి ఆహారం తీసుకోవాలి.
ఇదీ చూడండి:రోడ్డు పక్క చిరుతిళ్లు ఇకపై డోర్ డెలివరీ!